హోలీ వేడుకల్లో విషాదం

Man Dies In Essarisi Canal Khammam - Sakshi

స్నేహితులతో కలిసి ఈతకు వెళ్లిన యువకుడి మృతి

మరో ముగ్గురికి తప్పిన ప్రాణాపాయం  

తిరుమలాయపాలెం: హోలీ వేడుకల్లో విషాదం చోటుచేసుకుంది. అంతసేపు హోలీ వేడుకల్లో పాల్గొని రంగులు చల్లుకుని ఆనందంగా గడిపిన ఓ యువకుడు, అంతలోనే ప్రాణాలు కోల్పోయాడు.  మండలంలోని మేడిదపల్లిలో ఇది జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలు... మేడిదపల్లి గ్రామస్తుడు ఆమెడ మురళి(21), తన స్నేహితులైన షేక్‌ నజీర్, తురక నవీన్, షేక్‌ వహీద్‌తో కలిసి గురువారం హోలీ వేడుకల్లో పాల్గొన్నాడు.

ఈత కొట్టేందుకని మోటార్‌ సైకిళ్లపై మేడిదపల్లి సమీపంలోని ఎస్సారెస్పీ కాలువ వద్దకు చేరుకున్నారు. అప్పటికే వీరు మద్యం మత్తులో ఉన్నారు. భక్త రామదాసు ప్రాజెక్ట్‌ కాలువలో ఎత్తిపోస్తున్న నీటి ప్రవాహం వద్దకు వెళ్లారు. అక్కడ ఈత కొడుతున్నారు. ఇంతలోనే... అక్కడి సుడిగుండంలో వహిద్, నజీర్‌ మునిగిపోతుండడాన్ని ఆమెడ మురళి, తురక నవీన్‌ గమనించి అప్రమత్తమయ్యారు. వారిని గట్టిగా పట్టుకుని బయటకు తీసుకొచ్చారు. అక్కడకు దగ్గరలోనే ఉన్న కొందరు రైతులు కూడా సాయపడ్డారు. ఈ ప్రయత్నంలో, అదే సుడి గుండంలో ఆమెడ మురళి చిక్కుకున్నాడు. ఊపిరాడక మృతిచెందాడు. పోలీసులు కేసును దర్యాప్తు చేస్తున్నారు.

రెండేళ్ల క్రితమే పెళ్లి... 
మేడిదపల్లి గ్రామానికి చెందిన మురళి, రెండేళ్ల క్రితమే సుబ్లేడుకు చెందిన కళ్యాణిని కులాంతర వివాహం చేసుకున్నాడు. వీరిద్దరూ కొద్ది నెలలపాటు పెట్రోల్‌ బంకులో పనిచేశారు. వీరికి ఆరునెలల కుమారుడు ఉన్నాడు. మురళి భార్య కళ్యాణి, తల్లిదండ్రులు వెంకన్న, వెంకటమ్మ రోదన... చూపరులకు కంట తడి పెట్టించింది.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top