మృత్యువును జయించింది!   | Madhulika Discharged from hospital | Sakshi
Sakshi News home page

మృత్యువును జయించింది!  

Feb 21 2019 4:00 AM | Updated on Feb 21 2019 4:00 AM

Madhulika Discharged from hospital - Sakshi

బుధవారం ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అవుతున్న మధులిక

సాక్షి, హైదరాబాద్‌: ప్రేమోన్మాది చేతిలో తీవ్రంగా గాయపడిన మధులిక మృత్యువును జయించింది. 15 రోజుల క్రితం తీవ్రంగా గాయపడి అచేతన స్థితిలో ఆస్పత్రిలో చేరిన ఆమె ఇప్పుడు చక్కగా మాట్లాడుతోంది. ఆరోగ్య పరిస్థితి మెరుగుపడటంతో వైద్యులు బుధవారం ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్‌ చేశారు. అనంతరం ఆమెను నేరెడ్‌మెట్‌లోని అమ్మమ్మ ఇంటికి తరలించారు. డిశ్చార్జ్‌ సమయంలో బాధితురాలితో మాట్లాడించేందుకు ఆస్పత్రి వర్గాలు ఏర్పాట్లు చేసినప్పటికీ పోలీసులు అంగీకరించలేదు. 

35 కేజీల బరువు.. 14 కత్తిపోట్లు...
బర్కత్‌పురా సత్యనగర్‌కు చెందిన మంగరాములు, ఉదయ దంపతుల రెండో కుమార్తె మధులిక (17)పై ఇదే బస్తీకి చెందిన భరత్‌(19) తన ప్రేమను నిరాకరించిందన్న కారణంతో ఈ నెల 6న కత్తితో దాడి చేసిన విషయం తెలిసిందే. 14 కత్తిపోట్లకు గురై తీవ్ర రక్తస్రావంతో అపస్మారకస్థితిలోకి చేరుకున్న ఆమెను బంధువులు మలక్‌పేట యశోద ఆస్పత్రికి తరలించారు. 35 కేజీల బరువు మాత్రమే ఉన్న మధులికకు చికిత్స చేయడం పెద్ద సవాల్‌గా మారింది. బాధితురాలి ఆరోగ్య పరిస్థితి తెలుసుకునేందుకు ఆస్పత్రి వైద్యులు ఓ వాట్సాప్‌ గ్రూప్‌ ఏర్పాటు చేసి ఆరోగ్య పరిస్థితి, ఇస్తున్న మందులు వంటి అంశాలపై ఎప్పటికప్పుడు ఆరా తీశారు. ఆస్పత్రిలో చేరిన రెండు రోజుల తర్వాత ఆమె స్పృహలోకి రావడంతో చికిత్స ప్రారంభించారు. 

సర్జరీ తర్వాత ఇన్‌ఫెక్షన్‌తో పోరాటం...
చికిత్సకు మధులిక శరీరం సహకరిస్తుండటంతో న్యూరోసర్జన్‌ డాక్టర్‌ శ్రీనివాస్‌ భొట్ల, ప్లాస్టిక్‌ సర్జన్‌ డాక్టర్‌ చంద్రమౌళి, డాక్టర్‌ ప్రకాశ్, డాక్టర్‌ సాయిబాబా, డాక్టర్‌ ప్రసాద్‌ల బృందం 7 గంటల పాటు శ్రమించి ఆమె తల, ఇతరచోట్ల గాయాలకు ఈ నెల 8న చికిత్స చేశారు. భరత్‌ ఉపయోగించిన కత్తి తుప్పుపట్టి ఉండటంతో సర్జరీ తర్వాత ఇన్‌ఫెక్షన్‌తో ఇబ్బంది పడాల్సి వచ్చింది. ఇన్‌ఫెక్షన్‌ కంట్రోల్‌ చేసేందుకు చాలా కష్టపడాల్సి వచ్చిందని వైద్యులు స్పష్టం చేశారు. ప్రస్తుతం మధులిక కోలుకుందని, గాయాలకు వేసిన కుట్లు కూడా విప్పినట్లు చెప్పారు. స్వయంగా ఆహారం తీసుకోవడం, మాట్లాడటంతో పాటు లేచి నడుస్తోందన్నారు. చికిత్సకైన ఖర్చును సీఎంఆర్‌ఎఫ్, ఇతర దాతలు చెల్లించినట్లు ఆస్పత్రి వర్గాలు చెప్పాయి. 

ఇంజనీరింగ్‌ చేస్తా: మధులిక
భరత్‌ మా ఇంటికి సమీపంలో ఉండేవాడు. ఒకే వీధిలో ఉండటంతో చిన్నప్పటి నుంచి పరిచయం. కొద్దికాలంగా తనను ప్రేమించాలంటూ నాపై ఒత్తిడి తెచ్చాడు. కొన్నిసార్లు కొట్టాడు కూడా. చదువుమాన్పిస్తారనే భయంతో చాలా రోజులు ఇంట్లో చెప్పలేదు. అతని ప్రవర్తనకు విసిగిపోయి చివరికి అమ్మానాన్నకు చెప్పా. అతను ఇలా చేస్తాడని అసలు ఊహించలేదు. ఆ రోజు ఉదయం కాలేజీకి వెళ్తుండగా అడ్డుకుని కత్తితో దాడి చేశాడు. నేను అరవడంతో అమ్మానాన్న వచ్చారు. తర్వాత ఏం జరిగిందో తెలియదు. భరత్‌ను కఠినంగా శిక్షించాలి. ఇలాంటి దుస్థితి మరే అమ్మాయికి రాకుండా చూడాలి. భవిష్యత్‌లో ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్‌లోని ఇంజనీరింగ్‌ కాలేజీలో సీటు సంపాదించి చదువుతా. మంచి ఉద్యోగం చేసి, నా తల్లిదండ్రులకు అండగా ఉంటా.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement