దొమ్మరపాపమ్మ తల్లి సాక్షిగా..! 

Love Story Ends With Tragedy - Sakshi

భార్య శవాన్ని మోస్తూ కన్నీటి పర్యంతమైన భర్త

సాక్షి, పలమనేరు: దొమ్మరపాపమ్మ తల్లి సాక్షిగా చిన్ననాటి నుంచి వారిరువురూ ప్రేమించుకున్నారు. కలిసి బతకాలని కష్టాలను ఎదుర్కొన్నారు. చివరికి అదే ఆలయం వద్ద వారి బంధానికి తెరపడింది. మండలంలోని ఊసరపెంటకు చెందిన కేశవ, హేమావతిల ప్రేమ, పెళ్లి సినిమా కథను పోలినట్టు సాగింది. ఈ గ్రామం విసిరేసినట్టు అడవిలో ఉంటుంది. చుట్టూ చెట్లుచేమలు తప్ప, జనసంచారం పెద్దగా కనిపించదు. మొన్నటి దాకా ఆ గ్రామానికి అధ్వాన మట్టిరోడ్డు మాత్రమే దిక్కు. దీంతో వాహన సౌకర్యం లేదు. గ్రామస్తులు దొమ్మరపాపమ్మ గుడిదాకా నడిచివెళ్లి, ఆపై అటు పలమనేరు.. ఇటు గుడియాత్తం పట్టణాలకు వెళ్లేవారు. ఈ ప్రాంతం తమిళనాడుకు ఆనుకునే ఉంటుంది. ప్రజల ఆచార వ్యవహారాలు, భాషలో కూడా తమిళమే ఎక్కువ.

40 దాకా ఉన్న ఎస్సీ కుంటుంబాలకు కూలినాలే దిక్కు. పిల్లలను చదివించాలన్నా కష్టమే. ఈ పరిస్థితుల్లో కేశవ పట్టణంలోని ప్రభుత్వ కళాశాలలో ఇంటర్‌ దాకా చదివాడు. హేమావతి పట్టణంలోని ఓ ప్రైవేటు పాఠశాలలో పది వరకు చదివింది. వీరు దొమ్మరపాపమ్మ గుడిదాకా రోజూ కలసిమెలసి నడిచి వెళ్లి, ఆపై సైకిళ్లపై వెళ్లేవారు. హేమావతి కుటుంబీకులు, వారి బంధువుల వ్యవసాయ పనులకు కేశవ కుటుంబీకులు వెళ్లేవారు. దీంతో చనువుగా ఉండే వీరి మధ్య అప్పటికే ప్రేమ వికసించి పెళ్లిదాకా వెళ్లింది. ఈ విషయం హేమావతి కుటుంబానికి తెలియడంతో పలుమార్లు గొడవలు, పంచాయతీలు జరిగాయి. హేమావతిని కుటుంబీకులు తిరుపతిలోని ఓ ప్రైవేటు కళాశాలలో చేర్చారు.

విషయం తెలుసుకున్న కేశవ సైతం తిరుపతికెళ్లి అక్కడ పనిచేసుకుంటూ వారి ప్రేమను కొనసాగించాడు. ఆపై కులాంతర వివాహానికి ఆటంకాలు రావడంతో.. పరారై, కుప్పంలో పెళ్లి చేసుకున్నారు. రెండున్నరేళ్ల తర్వాత హేమావతి గర్భిణి కావడంతో కాన్పుకోసం ఇక్కడికి వచ్చారు. ఆస్పత్రి నుంచి బస్సు దిగగానే అదే దొమ్మరిపాపమ్మ గుడివద్ద బాలింత హేమావతిని తల్లిదండ్రులు బంవంతంగా లాక్కెళ్లి ఉరివేసి చంపి, బావిలో పడేశారు. ఇన్ని కష్టాలు పడ్డ తనకు హేమావతి దక్కకుండా పోయిందని భర్త కేశవ రోదించాడు. పలమనేరు ఆస్పత్రి మార్చురీలో శనివారం తన భార్య మృతదేహాన్ని తీసుకుని.. విలపిస్తూనే ఆటోలో ఎక్కించడం అక్కడున్న వారిని కలచివేసింది.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top