ప్రేమికుల ఆత్మహత్యాయత్నం

Love Couple Commits Suicideattempt In Guntur - Sakshi

ప్రియురాలితో వివాహం వద్దంటున్న ప్రియుడు

ప్రియుడితోనే వివాహం చేయాలంటున్న ప్రియురాలు

దిక్కుతోచనిస్థితిలో ఇరువర్గాల పెద్దలు, బం«ధువులు

అర్ధరాత్రి వేళ సంచలనం కలిగించిన ఆత్మహత్యయత్నాలు

వినుకొండ టౌన్‌: ప్రేమజంట ఆత్మహత్యాయత్నానికి పాల్పడటం పట్టణంలో శనివారం అర్ధరాత్రి సంచలనం రేపింది. పోలీసులు, ప్రేమికుల బంధువులు తెలిపిన వివరాల ప్రకారం... గుంటి ఆంజనేయ స్వామి టెంపుల్‌ రోడ్డులోని పఠాన్‌ పూసల బాజీ కుమారుడు కరీముల్లా, అదే ప్రాంతంలో నివాసం ఉంటున్న షేక్‌ చిన లాల్‌ సాహెబ్‌ కుమార్తె షెహనాజ్‌ నాలుగేళ్ల నుంచి ప్రేమించుకుంటున్నారు. ఒకే ప్రాంతంలో నివాసం ఉండటం, వారి తండ్రుల వ్యాపారాలు పక్కపక్కనే ఉన్నందున పరిచయం ప్రేమగా మారింది. కొంతకాలం ప్రేమాయణం సాగించిన తర్వాత కరీముల్లా వివాహానికి నిరాకరించాడు. దీంతో షెహనాజ్‌ తనపై అత్యాచారం చేశాడంటూ అతడిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరచగా న్యాయమూర్తి రిమాండ్‌కు పంపారు.

జైలు నుంచి బయటకు వచ్చిన కరీముల్లాను పెళ్లి చేసుకోవాలటూ షెహనాజ్‌ కోరుతూ ఉంది. దీనికి అతను అంగీకరించక పోవడంతో గతనెల 17న ఫినాయిల్‌ తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడి ప్రైవేటు వైద్యశాలలో చికిత్స పొందింది. ఆ సమయంలో పెద్దలు కలుగ చేసుకుని వారం రోజుల్లో చర్చలు జరిపేందుకు నిర్ణయించారు. ఆ మరుసటి రోజు కరీముల్లా తండ్రి సొంత పనిమీద హైదరాబాద్‌ వెళుతుంటే షెహనాజ్‌ బంధువులు వారు ఊరు విడిచిపోతున్నట్లుగా భావించి దాడిచేసి గాయపరిచారు. దీనిపై ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో మరోసారి పెద్దలు సండ్రపాటి సైదా, సీహెచ్‌.షమీమ్‌ ఖాన్, బంధువులు జానీ, వలీలు చర్చలు జరిపి సమస్యను రంజాన్‌ పండుగ అనంతరం పరిష్కరిస్తామని పోలీసులకు తెలిపారు.

పండుగ వెళ్లడంతో మరలా పెద్దల చర్చలతో ప్రేమికుల వ్యవహారం మరోసారి తెరపైకి వచ్చి పోలీసు స్టేషన్‌ వద్దకు చేరింది. నిష్కారణంగా తన తండ్రిని, అన్న ఫరీద్‌ఖాన్‌లపై షెహనాజ్‌ బంధువులు దాడిచేసి గాయపరిచారని, కేసు పెట్టారని ఆరోపిస్తూ ప్రేమికుడు కరీముల్లా వివాహానికి ససేమిరా అంటున్నాడు. తనతోనే వివాహం చేయాలని షెహనాజ్‌ భీష్మించుకు కూర్చుంది. పెద్దలు ఎవరికి సమాధానం చెప్పలేక పోయారు. బలవంతంగా వివాహం చేస్తే ఆత్మహత్యే శరణ్యం అంటూ కరీముల్లా, అతను లేకుండా తానేందుకు జీవించి ఉండాలంటూ షెహనాజ్‌ అక్కడ నుంచి వాహనాలపై వెళ్లిపోయారు.

శనివారం ఒకరు దోమల మందు హిట్‌ను, మరొకరు ఫినాయిల్‌ను తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. బంధువులు హిట్‌ తాగిన కరీముల్లాను ప్రైవేటు వైద్యశాలకు తరలించారు. అనంతరం డాక్టర్ల సూచనల మేరకు మెరుగైన వైద్యం కోసం గుంటూరుకు పంపారు. ఫినాయిల్‌ తాగిన షెహనాజ్‌ను ప్రభుత్వ వైద్యశాలకు తరలించి వైద్యసేవలు అందిస్తున్నారు.ఇరుపక్షాల పెద్దలు, బంధువులు శనివారం రాత్రి పోద్దుపోయేవరకు పోలీస్‌ స్టేషన్‌ వద్దనే చర్చలు జరిపారు. ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఇద్దరిపై పట్టణ సీఐ టి.వి. శ్రీనివాసరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top