వేర్వేరు ప్రమాదాల్లో ముగ్గురి దుర్మరణం | Lorry Accident In Visakhapatnam | Sakshi
Sakshi News home page

వేర్వేరు ప్రమాదాల్లో ముగ్గురి దుర్మరణం

Nov 22 2018 11:06 AM | Updated on Jan 3 2019 12:14 PM

Lorry Accident In Visakhapatnam - Sakshi

ప్రమాద స్థలిలో పరిశీలిస్తున్న పోలీసులు

వేర్వేరుచోట్ల జరిగిన రోడ్డు ప్రమాదాల్లో ముగ్గురు దుర్మరణం పాలయ్యారు. కుటుంబంతో బైక్‌పై వెళ్తున్న వ్యక్తి లారీని వెనుక నుంచి ఢీకొట్టడంతో అతని ఐదేళ్ల కుమారుడు సంఘటనా స్థలంలోనే దుర్మరణం పాలయ్యాడు. మూడేళ్ల కుమార్తె పరిస్థితి విషమంగా ఉంది. మారికవలస బస్టాపు సమీపంలో నిల్చున్న వ్యక్తిని లారీ ఢీకొనడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. పీఎం పాలెం సమీపంలో కారుషెడ్‌ కూడలి వద్ద జాతీయ రహదారి దాటుతుండగా కారు ఢీకొనడంతో తీవ్ర గాయాలపాలైన వ్యక్తి కేజీహెచ్‌లో చికిత్స పొందుతూ మృతిచెందాడు.

విశాఖపట్నం ∙, పెందుర్తి: రోడ్డు ప్రమాదంలో చిన్నారి మృతి చెందిన సంఘటన మండలంలోని పినగాడి జంక్షన్‌ సమీపంలో సబ్బవరం – పెందుర్తి నేషనల్‌ హైవేపై జరిగింది. పెందుర్తి ట్రాఫిక్‌ సీఐ కాంతారావు అందించిన వివరాల ప్రకారం... గొలుగొండకి చెందిన బోయిన అల్లబాబు ద్విచక్ర వాహనంపై భార్య సోమేశ్వరి, కుమారుడు అవినాష్‌(5), కూతురు వాణి(3)తో కలిసి గొలుగొండ నుంచి తగరపువలస వెళ్తున్నాడు. సబ్బవరం – పెందుర్తి నేషనల్‌ హైవేలో  పినగాడి జంక్షన్‌ దాటిన వెంటనే కూతవేటు దూరంలో ముందు వెళ్తున్న లారీని అల్లబాబు ఢీకొట్టాడు. దీంతో ద్విచక్ర వాహనంపై నుంచి అందరూ కింద పడిపోయారు. ఈ ప్రమాదంలో ముందు కూర్చున్న అవినాష్‌ తలకి తీవ్ర గాయమై అక్కడికక్కడే మృతి చెందాడు. కూతరు వాణి తలకి తీవ్ర గాయమైంది. అల్లబాబుకి, సోమేశ్వరికి స్వల్ప గాయాలయ్యాయి. వీరిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. వాణి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలిసింది. అల్లబాబు భీమిలిలోని దివీస్‌ కంపెనీలో పనిచేస్తున్నాడు. సంఘటనా ప్రాంతానికి చేరుకున్న పెందుర్తి లా అండ్‌ ఆర్డర్‌ సీఐ సూర్యనారాయణ, ఎస్‌ఐలు స్వామినాయుడు, ట్రాఫిక్‌ ఎస్‌ఐ ఉమామహేశ్వరరావు వివరాలు సేకరించారు. అవినాష్‌ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్‌కి తరలించారు. అల్లబాబు మద్యం సేవించి బైక్‌ డ్రైవ్‌ చేస్తున్నట్టు పోలీసుల విచారణలో తెలిసింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

లారీ ఢీకొని ఒకరు...
పీఎం పాలెం(భీమిలి): జాతీయ రహదారిపై మంగళవారం రాత్రి వేర్వేరుచోట్ల జరిగిన ప్రమాదాల్లో ఇద్దరు మృతిచెందారు. ఇందుకు సంబంధించి పీఎం పాలెం పోలీస్‌ స్టేషన్‌ ఎస్‌ఐ హరికృష్ణ తెలిపిన వివరాల ప్రకారం... పరదేశిపాలెం అంబేడ్కర్‌ కాలనీకి చెందిన మదపాక నరసింగరావు (36)మంగళవారం రాత్రి 8: 30 గంటల సమయంలో జాతీయ రహదారిలో మారికవలస బస్టాపు వద్ద నిల్చుని ఉండగా ఆనందపురం వైపునకు వెళ్తున్న లారీ బలంగా ఢీ కొట్టొంది. తీవ్రంగా గాయపడిన నరసింగరావు సంఘటన స్థలంలోనే మరణించాడు. అతనికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. మృతుని సోదరుడు రాము ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్‌ఐ తెలిపారు.

కారు షెడ్‌ కూడలికి సమీపంలో...
పీఎం పాలెం ఆర్‌హెచ్‌ కాలనీకి చెందిన పోలిపల్లి పైడిరాజు(60)మంగళవారం రాత్రి కారు షెడ్‌ కూడలికి సమీపంలో జాతీయ రహదారి సర్వీసు రోడ్డు దాటుతుండగా కారు ఢీకొట్టింది. దీంతో తీవ్ర గాయాలు కావడంతో క్షతగాత్రుడిని కేజీహెచ్‌కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ పైడిరాజు మరణించాడు. మృతుని కుమారుడు సింహాద్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్‌ఐ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement