మూడు గంటలు.. ముచ్చెమటలు!

Lifetime Prisoner Hulchul In Chanchalguda Jail - Sakshi

హైటెన్షన్‌ పోల్‌ ఎక్కి జీవితఖైదీ హల్‌చల్‌

తనపై అక్రమ కేసు పెట్టిన ఎస్సై నాగరాజును సస్పెండ్‌ చేయాలని డిమాండ్‌..

భార్య హత్య కేసులో 2013లో జీవితఖైదు 

హైకోర్టులో అప్పీలు అదే శిక్ష ఖరారు

మానసికంగా కుంగిపోయిన ఖాజాపాషా..  

కిందకు దింపిన ఫైర్‌ సిబ్బంది..

కుషాయిగూడ: కోర్టు తీర్పుతో మానసికంగా కుంగిపోయిన ఓ జీవితఖైదీ హైటెన్షన్‌ కరెంట్‌ పోల్‌ ఎక్కి మూడు గంటల పాటు పోలీసులకు ముచ్చెమటలు పట్టించాడు. తన భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకుని, తనపై అక్రమ కేసు బనాయించి, జైలుపాలు చేసిన శంకర్‌పల్లి ఎస్సై నాగరాజును సస్పెండ్‌ చేయాలని డిమాండ్‌ చేస్తూ సూసైడ్‌ నోట్‌ రాసి కరెంటు స్తంభమెక్కాడు. దీంతో అప్రమత్తమైన జైల్‌ సిబ్బంది  ట్రాన్స్‌ కో అధికారులతో మాట్లాడి విద్యుత్‌ సరఫరాను నిలిపివేశారు. అనంతరం ఫైర్‌ సిబ్బంది సహకారంతో అతడిని సురక్షితంగా కిందకు దించడంతో కథ సుఖాంతమైంది. సోమవారం చర్లపల్లి కేంద్ర కారాగారంలో చోటు చేసుకున్న సంఘటన వివరాలిలా ఉన్నాయి.

రంగారెడ్డి జిల్లా, శేర్‌గూడానికి చెందిన యండీ ఖాజాపాషా భార్యపై అనుమానంతో 2012లో  బానూరు వద్ద ఆమెను అతి కిరాతకంగా  హత్య చేశాడు. కేసును విచారించిన సంగారెడ్డి కోర్టు  2013లో అతడికి జీవితఖైదు విధిస్తూ  తీర్పునిచ్చింది. అప్పటి నుంచి చర్లపల్లి జైల్‌లో శిక్ష అనుభవిస్తున్నాడు. జైల్‌లో సత్పప్రవర్తనతో మెలగడంతో ఖాజాపాషాను 2017లో జైల్‌ పెట్రోల్‌బంకు విధుల నిర్వహణకు కేటాయించారు.  గత డిసెంబర్‌లో పెరోల్‌పై నెలరోజుల పాటు ఇంటికి  వెళ్లి వచ్చాడు. ఈ క్రమంలో జిల్లా కోర్టు తీర్పును సవాలు చేస్తూ హైకోర్టులో అప్పీలు చేసుకున్నాడు. అయితే ఈ నెల 7న హైకోర్టు యావజ్జీవ కారాగార శిక్షను ఖారారు చేస్తు  తీర్పునివ్వడంతో మానసికంగా కుంగిపోయిన ఖాజాపాషా జీవితంపై విరక్తి పెంచుకున్నాడు. ఈ నేపథ్యంలో పెట్రోల్‌బంకు ఆవరణలో కరెంటు పోల్‌ ఎక్కి ఆత్మహత్యకు యత్నించాడు.  

ఎస్సై నాగరాజును సస్పెండ్‌ చేయాలి
నా భార్యతో వివాహేతర సంబంధం కొనసాగిస్తూ తనపై అక్రమంగా కేసు బనాయించి, తన పిల్లలకు దూరం చేసిన అప్పటి శంకర్‌పల్లి ఎస్సై నాగరాజు సస్పెండ్‌ చేయాలని డిమాండ్‌ చేస్తూ సూసైడ్‌ నోట్‌ రాసి కరెంటు పోలెక్కడంతో అప్రమత్తమైన జైల్‌ సిబ్బంది, కుషాయిగూడ పోలీసులు అక్కడికి చేరుకొని ట్రాన్స్‌కో అధికారులతో మాట్లాడి విద్యుత్‌ సరఫరా నిలిపివేశారు. అధికారులు అతనితో మాట్లాడేందుకు ప్రయత్నించగా పై నుంచి మాటలు వినిపించక పోవడంతో మరో ఖైదీని పోల్‌ పైకి పంపి సెల్‌ఫోన్‌ను అందజేసి  పలుమార్లు సంభాషించారు. అతని  డిమాండ్లను అంగీకరిస్తూ, సదరు ఎస్సైపై చర్యలు తీసుకుంటామని కుషాయిగూడ ఏసీపీ కృష్ణమూర్తి, జైల్‌ సూపరింటెండెంట్‌ భాస్కర్‌ హామీ ఇచ్చినా అతను కిందకు దిగిరాలేదు.  ‘‘బతకాలని అనిపించడం లేదని, నేను చనిపోతాను’’ అంటూ ఫోన్‌ కట్‌చేశాడు. దాదాపు మూడు గంటల పాటు అధికారులు, సహచర ఖైదీలు ఫోన్‌లో మాట్లాడుతూ సర్ధిజెప్పే ప్రయత్నం చేసినా అతని నిర్ణయంలో  మార్పురాలేదు. దీంతో అధికారులు రక్షణ చర్యలకు శ్రీకారం చుట్టారు.

రంగంలోకి దిగిన ఫైర్‌ సిబ్బంది..  
అప్పటికే సంఘటనా స్థలానికి చేరుకున్న చర్లపల్లి ఫైర్‌ సిబ్బంది తమ వద్ద ఉన్న మ్యాట్‌లతో ప్రాథమికంగా రక్షణ చర్యలు చేపట్టారు. ఫైర్‌ ఆఫీసర్‌ శైఖర్‌రెడ్డి  ఉన్నతాధికారులతో మాట్లాడి  54 ఫీట్ల స్కై లిఫ్ట్‌ను రప్పించారు.  కిందపడినా ప్రమాదం జరగకుండా రక్షణ వలయాన్ని ఏర్పాటు చేశారు. ఫైర్‌ సిబ్బందితో పాటు డిప్యూటీ జైలర్‌ శోభన్‌బాబు కూడా లిఫ్ట్‌లో పైకి వెళ్లి అతడికి నచ్చజెప్పి కిందకు తీసుకువచ్చాడు.  జైళ్లశాఖ డీఐజీ సైదయ్య, చర్లపల్లి ఫైర్‌ ఆఫీసర్‌ శేఖర్‌రెడ్డి  సంఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. నిబంధనలు ఉల్లంఘించడమే కాకుండా అధికారుల నమ్మకాన్ని వమ్ముచేసేలా వ్యవహరించిన  ఖాజాపాషాపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు. అందుకుగాను కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఖాజాపాషాపై పోలీసులకు ఫిర్యాదు చేస్తామన్నారు. కాగా తమకు జైలు అధికారుల నుంచి ఎలాంటి ఫిర్యాదు  అందలేదని కుషాయిగూడ ఇన్‌స్పెక్టర్‌ చంద్రశేఖర్‌ తెలిపారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top