రాష్ట్ర సరిహద్దు ప్రాంతాల్లో జోరుగా కోడి పందేలు

Kodi Pandelu In Mahabubnagar - Sakshi

గద్వాల క్రైం: ఆంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో కోడిపందేల ఆట అంటే యమ క్రేజీ. అది జూదౖ మెనా జాలీగా ఆడుతుంటారు. ముఖ్యంగా సం క్రాంతి పండగ సందర్భంగా దాన్ని ఓ సంప్రదాయంగా ఆడతారనే విషయం అందరికీ తెలియదు. అయితే కొన్నిప్రాంతాల్లో ఆ సంప్రదాయం ముదిరి కత్తులు దూసుకునే వరకు వెళ్తుంది. రూ.లక్షల్లో బెట్టింగులు.. కోట్లల్లో చేతులు మారుతుంటాయి. ఆ సంస్కృతి ఇప్పుడు తెలంగాణలోనూ పాకుతోంది. అక్కడ కేవలం సంక్రాంతి పండగ సమయాల్లో సాగితే ఇక్కడ మాత్రం గుట్టుచప్పుడు కాకుండా నిత్యం రహస్యంగా నిర్వహిస్తున్నారు.
 
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా.. 
పందెం కోళ్ల  సై ఆటకు ఉమ్మడి జిల్లాలోని జడ్చర్ల, భూత్పూర్, ఖిల్లాఘనపురం, కొత్తకోట, కొల్లాపూర్, పాన్‌గల్, మిడ్జిల్, పెబ్బేరు, నాగర్‌కర్నూల్, అచ్చంపేట, మహబూబ్‌నగర్, వనపర్తి, గద్వాలకు చెందిన వారితో గుంటూరు జిల్లా కారంపుడి, పిడుగురాళ్లకు చెందిన కేటుగాళ్లు జోగుళాంబ గద్వాల జిల్లాను అడ్డాగా మార్చుకున్నారు. నడిగడ్డ ఆంధ్ర, కర్నాటక రాష్ట్రాలకు సరిహద్దు ప్రాంతం కావడంతో పందేలకు ఎలాంటి అడ్డంకులు ఉండవని ఈ ప్రాంతాన్ని ఈ ప్రాంతాన్ని ఎంచుకున్నారు. కొందరు బృందాలుగా ఏర్పడి రాష్ట్ర సరిహద్దుల్లో గుట్టలు, వాగులు, చిట్టడవి లాంటి రహస్య ప్రాంతాల్లో పందేలు కాస్తున్నారు. ఐదు రోజుల కిందట అయిజ శివారులో పక్కా సమాచారంతో కోళ్ల పందేల గుంపులపై పోలీసులు దాడులు చేశారు. అక్కడ వారినుంచి రూ.4.19 లక్షలు, 4 తుఫాన్‌ వాహనాలు, 4 కార్లు, 5 పందెం కోళ్లు, నాలుగు కత్తులు, 46 మంది కేటుగాళ్లను అరెస్టు చేశారు. ఇంత పెద్దమొత్తంలో బెట్టింగురాయుళ్లు పట్టుబడటం ఈ ప్రాంతంలో సంచలనం సృష్టించింది. వారిని విచారించగా ఎన్నో ఆసక్తికర విషయాలు వెలుగు చూస్తున్నట్లు తెలిసింది.

నడిగడ్డలో జరిగిన దాడులు.. 
జనవరిలో మల్దకల్‌ మండలంలో కోళ్ల పందేలు ఆడుతున్న 9 మంది పట్టుబడ్డారు. 
ఫిబ్రవరిలో ఇటిక్యాల మండలం ఎర్రవల్లి గ్రామ శివారులో 37 మంది కోళ్ల పందేలు కాస్తున్న వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. 
అదేనెలలో ధరూర్‌ మండల కేంద్రంలో 10 మంది పందెంరాయుళ్లు దొరికారు.  
ఈనెలలో గట్టు మండలం బల్గెర గ్రామ శివారులో కోళ్ల పందెం ఆడుతున్న పది మంది అరెస్టయ్యారు.  
తాజాగా ఐదు రోజుల కిందట అయిజ మండల కేంద్రంలో వాగు ప్రాంతంలో జరిగిన దాడిలో భారీగా 46 మంది అరెస్టయ్యారు. ఇలా కేవలం ఈ ఏడాదినే లెక్కేసుకుంటే 102 మందిపై గేమింగ్‌ యాక్టు కింద కేసులు నమోదయ్యాయి.

అక్రమాలకు అడ్డాగా నడిగడ్డ 
నడిగడ్డ అక్రమ దందాలు, నిషేధిత వ్యాపారాలు, నిషేధిత ఆటలు, జూదానికి అడ్డాగా మారుతోంది. ఇక్కడి పోలీస్‌ వ్యవస్థ కఠినంగా వ్యవహరిస్తున్నందునే వారి భాగోతం వెలుగుచూస్తోందనే చెప్పాలి. జూదం, బెట్టింగ్, కల్తీ విత్తనాలు, సారా, కల్తీ కల్లు లాంటి ఎన్నో అక్రమం దందాలను పోలీసులు ఒక్కొక్కటిగా చెక్‌ పెడుతూ వస్తున్నారు. ఇంత చేస్తున్నా కేటుగాళ్లకు భయం లేకుండా పోయింది. తాజాగా కోళ్ల పందేలా వ్యవహారం బయటికి రావడం కలకలం సృష్టిస్తోంది.

పందెకోళ్లకు భలే డిమాండ్‌ 
కోళ్ల పందేలకు ఇక్కడ ప్రత్యేకమైన కోళ్లను ఎంపిక చేసుకుంటారు. అరుదైన జాతుల్లో  ఉమ్మార్, శైలం, పెద్దవరిసే లాంటి పలు రకాల కోళ్లను మాత్రమే పందేలకు వినియోగిస్తారు. వాటి ధరలు వేలల్లో ఉంటాయంటే నమ్మశక్యం కాదు. కోళ్ల పోషణకు రాగులు, సద్దలు, జీడిపప్పు, పిస్తా తదితర తృణ ధాన్యాలు తినిపిస్తారు. ఈ కోళ్లన్నీ ఆంధ్రా ప్రాంతం నుంచే వస్తాయి. పందేనికి ముందు వాటి కాళ్లకు కత్తులు కట్టి రంగంలోకి దించుతారు. నికాసైన సారా తాగించి బరిలోకి దించుతారు.
 
పక్కాప్లాన్‌తో నిర్వహణ 
కోళ్ల పందేల నిర్వహణ పక్కాప్లాన్‌తో ప్రారంభమవుతుంది. పోలీసులు, జన సంచారం లేని స్థలాలు గుర్తిస్తారు. ఎక్కడ నిర్వహించాలనేది కూడా స్థానికుల సాయంతో ముందుగా పరిశీలన చేసి బెట్టింగ్‌ రాయుళ్లను ఒక చోటుకు తీసుకొస్తారు. ఆ ప్రాంతంలో ఎవరూ రాకుండా జాగ్రత్త పడతారు. ఒకవేళఎవరైనా వస్తే తప్పించుకునేందుకు పథక రచనలు కూడా ఉంటాయి. రెండు గ్రూపులుగా విడిపోయి రెండేసి కోళ్లను ఆటలో వదులుతారు. ఆ రెండు గ్రూపుల వ్యక్తులు తమకు నచ్చిన కోడిపై బెట్టింగ్‌ కడతారు. రూ.10 వేల నుంచి మొదలు లక్షల్లో పందేలు కాస్తారు. పెట్టిన బెట్టుకు రెండు, మూడింతలు లాభం వస్తుండటంతో కకొందరు అప్పులు చేసి మరీ పందెం కాయడానికి వస్తున్నారు. గెలుపొందిన వారు లక్షాధికారులవుతుంటే ఓడిన వారు మాత్రం రోడ్డున పడుతున్నారు. 

కఠిన చర్యలు తప్పవు 
నిషేధిత పోటీలు నిర్వహించడం చట్టరీత్యా నేరం. కోడి పందేలు, జూదం, బెట్టింగ్‌ నిర్వహించే ఎంతటి వారిపైనైనా కఠిన చర్యలు తీసుకుంటాం. చట్ట వ్యతిరేక కార్యకలాపాలపై పోలీసుశాఖ గట్టి నిఘా పెట్టింది. జిల్లాలో కొంత మందితో బయటి రాష్ట్రానికి చెందిన వారు వచ్చి కోడి పందేలు నిర్వహిస్తున్నట్లు మా దృష్టికి వచ్చింది. అలాంటి వ్యక్తుల కదలికలపై ఆరా తీస్తున్నాం. దొరికిన వారిపై గేమింగ్‌ యాక్టు కింద కేసులు నమోదు చేస్తున్నాం. – సురేందర్‌రావు, డీఎస్పీ, గద్వాల

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top