కథువాలో మరో దారుణం : చర్చి పాస్టర్‌ అరెస్ట్‌

Kathua Horror: Police Arrest Church Pastor For Sexual Assault - Sakshi

కథువాలో మరో దారుణం చోటు చేసుకుంది. అనాథశ్రమంలో మైనర్‌ బాలికలను ఓ చర్చి పాస్టర్‌ లైంగికంగా వేధిస్తున్న ఘటన వెలుగులోకి వచ్చింది. తమల్ని తీవ్రంగా వేధిస్తున్నాడంటూ బాలికల ఫిర్యాదు అనంతరం, చర్చి పాస్టర్‌ను పోలీసులు అరెస్ట్‌ చేశారు. జమ్ముకశ్మీర్‌ జిల్లాలోని కథువాలో నిర్వహిస్తున్న ఈ అనాథశ్రమంపై పోలీసులు దాడులు నిర్వహించి, 19 మంది పిల్లల్ని రక్షించారు. వారిలో ఎనిమిది మంది బాలికలు ఉన్నారు. కేరళ నుంచి వచ్చిన ఆంటోని థామస్‌ అనే పాస్టర్‌ ఈ అనాథశ్రమాన్ని నడుపుతున్నాడు. తమల్ని లైంగికంగా వేధిస్తున్నాడని కొంతమంది చిన్నారులు ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదు మేరకు సివిల్‌ అడ్మినిస్ట్రేషన్‌, పోలీసులు శుక్రవారం ఆ అనాథశ్రమంపై దాడులు నిర్వహించారు. 

అంతేకాక ఆంటోని థామస్‌ను అదుపులోకి తీసుకున్నారు. పోస్కో యాక్ట్‌ కింద కేసు నమోదు చేశారు. అయితే తానెలాంటి తప్పు చేయలేదని థామస్‌ కప్పిపుచ్చుకుంటున్నాడు. ఆ అనాథశ్రమంలో మొత్తం 21 మంది చిన్నారులున్నారు. వారిలో ఇద్దరు స్వగ్రామంలో(పంజాబ్‌లో) ఓ పెళ్లి వేడుకకు హాజరు కావడానికి తమ స్వస్థలానికి వెళ్లారు. 5 నుంచి 16 ఏళ్ల వయసున్న మిగతా చిన్నారులను ప్రభుత్వం నడిపించే బాల ఆశ్రమ్‌, నారి నికేతన్‌లకు తరలించినట్టు అధికారులు చెప్పారు. వారందరూ పంజాబ్‌, హిమాచల్‌ ప్రదేశ్‌, జమ్మూ ప్రాంతాలకు చెందిన వారు. చిన్నారుల ఫిర్యాదు మేరకు రెస్క్యూ ఆపరేషన్‌ నిర్వహించినట్టు కథువా సీనియర్‌ సూపరిటెండెంట్‌ ఆఫ్‌ పోలీసు శ్రీదర్‌ పటీల్‌ చెప్పారు. గత కొన్నేళ్లుగా ఈ ఆశ్రమం నడుస్తుందని, ఓ ఎన్‌జీవో సంస్థతో ఇది లింక్‌ అయి ఉండేందని, కానీ కొన్ని రోజుల క్రితం దాంతో కూడా సంబంధాలు తెంచుకున్నట్టు పటీల్‌ పేర్కొన్నారు. 

అనాథశ్రమంలోని కొన్ని వస్తువులును అధికారులు సీజ్‌ చేశారు. కాపాడిన చిన్నారులను మెడికల్‌ ట్రీట్‌మెంట్‌, కౌన్సిలింగ్‌కు తరలించారు. పాస్టర్‌ భార్య కేరళలో సంభవించిన వరదల కారణంగా ఆ ప్రాంతానికి వెళ్లారు. కొన్ని రోజుల్లో ఆమె తిరిగి రావొచ్చని చెప్పారు. చిన్నారుల కుటుంబ సభ్యులను అధికారులు కాంటాక్ట్‌ అవుతున్నారు. ఈ ఆశ్రమం కూడా అనధికారికంగా నడుస్తున్నట్టు తెలిసింది. దీన్ని నడిపేందుకు ఎలాంటి రిజిస్ట్రేషన్‌ను థామస్‌ తీసుకోలేదని కథువా అసిస్టెంట్‌ కమిషనర్‌ రెవెన్యూ, జితేంద్ర మిశ్రా చెప్పారు. నిందితులకు కఠిన శిక్ష వేయాలని రాష్ట్రీయ భజరంగ్‌ దళ్‌ కార్యకర్తలు జమ్మూలోని ప్రెస్‌ క్లబ్‌ ఎదుట ఆందోళన చేశారు.  

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top