వీడు మామూలోడు కాదు..

Karimnagar Police Arrested Mobile Robbery Gang - Sakshi

సాక్షి, కరీంనగర్‌ : ఆంధ్రప్రదేశ్‌ కాకినాడకు చెందిన బాలుడు(17) తన పదమూడో యేటా పనిచేస్తున్న స్థలంలో తన సెల్‌ఫోన్‌ చోరీకి గురైంది. దీంతో కోపోద్రిక్తుడైన ఆ బాలుడు అదే ప్రాంతంలో 30నుంచి 40 వరకు సెల్‌ఫోన్లు చోరీచేసి తన మకాం హైదరాబాద్‌కు మర్చాడు. సెల్‌ఫోన్లు అమ్మగా వచ్చిన సొమ్ముతో జల్సాలు చేశాడు. దొంగతనాన్నే వృత్తిగా ఎంచుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలో సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌కు చెందిన తన స్నేహితుడు కుందారపు సాయివర్మ(19)ను కలిశాడు. విషయం చెప్పి మకాంను హుస్నాబాద్‌కు మర్చాడు. సాయివర్మతో పాటు అదే ప్రాంతానికి  చెందిన మురిమురి రంజిత్‌(38), ఎల్వకా సాయిరాం(19), బైరి రాజు(26),విలాసాగరం రజనీకాంత్‌(19),ఎనగందులనాగరాజు(31)తో కలిసి ముఠా ఏర్పాటు చేసుకున్నాడు.

యూట్యూబ్‌లో చూస్తూ..
తన చోరీలకు అధునాతన టెక్నాలజీని వాడుకోవాలనుకున్నాడు. యూట్యూబ్‌లో దొంగతనాలకు సంబంధించిన వీడియోలు చూస్తూ తన ముఠా సభ్యులకు సైతం శిక్షణ ఇచ్చాడు. ఎలాంటి ఇంటి తాళమైనా రెండు నిమిషాల్లో తీసే నేర్పు సంపాదించారు. 

పట్టణాలే టార్గెట్‌..
వీరు చోరీ చేసేందుకు పట్టణాలనే ప్రధానంగా ఎంచుకుంటారు. మధ్యాహ్నం ఆ ప్రాంతాల్లో రెక్కీ నిర్వహిస్తారు.తాళం వేసిఉన్న ఖరీదైన భవంతులు గుర్తిస్తారు. అదే ప్రాంతంలో సెకండ్‌షో సినిమాకు వెళ్తారు.తిరిగి వెళ్లేప్పుడు చోరీ చేసే ఇంటికి వెళ్లి రెండు నిమిషాల్లో తాళం తీస్తారు. అందినకాడికి దండుకుని, పోలీసులకు క్లూస్‌ దొరకకుండా వాళ్లు తిరిగిన ప్రాంతమంతా కారంపొడి చల్లుతారు.చోరీ చేసిన సొత్తు అమ్మగా వచ్చిన దాంతో జల్సాలు చేస్తారు. ఇలా ఇప్పటి వరకు కరీంనగర్‌ జిల్లాలో12, సిద్దిపేట జిల్లాలో10, సిరిసిల్ల జిల్లాలో 4, వరంగల్‌ జిల్లాలో5 మొత్తంగా 31చోరీలు చేశారు. ఇందులో హుస్నాబాద్‌ ఎమ్మెల్యే  అధికార కార్యాలయంలో కూడా కెమెరాలు చోరీ చేయడం కొసమెరుపు.

ఇలా చిక్కారు..
కరీంనగర్‌ జిల్లాలో ఒకే పద్ధతిలో కారంపొడి చల్లుతూ జరిగిన దొంగతనాల విషయమై సీపీ కమలాసన్‌రెడ్డి దృష్టిసారించారు. సీసీఎస్‌ ఏసీపీ పర్యవేక్షణలో సీఐ ఎర్రల కిరణ్‌ ఆధ్వర్యంలో సైబర్‌ల్యాబ్‌ ఇన్‌చార్జి మురళిని కలుపుకుని బృందాన్ని ఏర్పాటు చేశారు. పలు సాంకేతిక అంశాల ఆధారంగా నిందితులను గుర్తించారు. హుస్నాబాద్‌ నుంచి కరీంనగర్‌ వస్తున్నారని అందిన పక్కా సమాచారంతో అల్గునూరు వద్ద పట్టుకున్నారు. తమదైన పద్ధతిలో విచారించగా నాలుగు జిల్లాల్లో 31చోరీలు చేసినట్లు ఒప్పుకున్నారు. వారినుంచి రూ.23లక్షల విలువైన 53 తులాల బంగారం, మూడున్నర కిలోల వెండి, ఐదుబైక్‌లు, ఐడుమొబైల్స్, రెండు ఇనుపరాడ్లు స్వాధీనం చేసుకున్నారు.

రివార్డులు అందజేత..
రెండేళ్లుగా తప్పించుకు తిరుగుతున్న దొంగలముఠాను పట్టుకున్న సీసీఎస్‌ ఏసీపీ శ్రీనివాస్, సీఐ కిరణ్, తిమ్మాపూర్‌ సీఐ కరుణాకర్, ఎస్సై నరేష్‌రెడ్డి, సైబర్‌సెల్,ఐటీకోర్‌ టీం ఇన్‌చార్జి మురళి, సీసీఎస్‌ ఎస్సై కనకయ్య, ఏఎస్సై వీరయ్య, శ్రీనివాస్, హసన్, నరేందర్, అంజయ్య,పాల్, యాసిన్,లక్ష్మిపతి,సాగర్, షరీఫ్, సిబ్బందిని సీపీ కమలాసన్‌రెడ్డి అభినందించి రివార్డులు అందించారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top