ఐపీఎల్‌ హోరు.. బెట్టింగ్‌ల జోరు

IPL Cricket Bettings in Guntur - Sakshi

సత్తెనపల్లి నుంచి ఇతర రాష్ట్రాలకు భారీగా విస్తరణ

యువత, విద్యార్థులే లక్ష్యం

బెట్టింగ్‌ ఉచ్చులో చిక్కుకుని భవితను కోల్పోతున్న వైనం

గుంటూరు, సత్తెనపల్లి: చిన్నా, పెద్దా అందరూ క్రికెట్‌ అంటే అభిమానం చూపడం సాధారణ విషయమే.మ్యాచ్‌ వస్తుందంటే చాలు టీవీలకు అతుక్కు పోతుంటారు కొందరు. మూడు గంటల్లో అయిపోయే ఐపీఎల్‌ మ్యాచ్‌లకైతే ఆ క్రేజే వేరు. ఇదే అదునుగా ఆ జట్టు గెలుస్తుంది.. ఈ జట్టు గెలుస్తుందంటూ బెట్టింగ్‌లు జోరందుకుంటున్నాయి. గతంలో ఎన్నడూ చూడని విధంగా పాఠశాల విద్యార్థులు సైతం బెట్టింగ్‌లలో మునిగి పోతున్నారు. ఇంట్లో డబ్బులు తీసుకు వచ్చి మ్యాచ్‌లపై తోటి స్నేహితులు, పెద్ద వారితో బెట్టింగ్‌లు కాస్తున్నారు.  చిన్నప్పటి నుంచి ఈ  సంస్కృతి విద్యార్థులు, యువతలో పెద్ద వ్యసనంగా మారింది. గతంలో పేకాట జోరుగా సాగుతుండేది. రానురాను దానిపై యువతకు మోజు లేకుండా పోయింది. ఈ స్థానంలో ఐపీఎల్‌ బెట్టింగ్‌ పెద్ద వ్యసనంగా మారింది. పరిస్థితులు ఇలానే కొనసాగితే తీవ్ర పరిణామాలు సమాజంలో చోటు చేసుకంటాయని విద్యావేత్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

దుకాణాలే కేంద్రాలు
ఐపీఎల్‌ మ్యాచ్‌ల బెట్టింగ్‌లకు సత్తెనపల్లి కేంద్రంగా మారింది. పట్టణం తోపాటు నియోజకవర్గంలోని గ్రామాల్లో ముఖ్యంగా దుకాణాలే కేంద్రాలుగా మారి పోతున్నాయి. వాటి వద్దకు చేరే వ్యసనపరులు గుట్టుచప్పుడు కాకుండా బెట్టింగ్‌లు కాస్తున్నారు. మ్యాచ్‌ ఫలితాలపైనే కాకుండా ఓవర్‌కు ఎన్ని పరుగులు వస్తాయని బంతి, బంతికి పందేలే వేస్తున్నారు. క్రికెట్‌ బెట్టింగ్‌లు, బుకీలు ఎక్కడో ముంబై వంటి నగరాల్లో హోటళ్లలో కూర్చొని అన్నీ నడిపిస్తారు. కానీ ప్రస్తుతం చిన్నస్థాయి బుకీలు తయారయ్యారు. ఓడిపోతే డబ్బులు బెదిరించి మరీ తీసుకుంటున్నారు. గెలిస్తే మాత్రం చాలాచోట్ల డబ్బులు ఇవ్వడం లేదు. విద్యార్థులు చేసేదేమీ లేక పోలీసులకు ఫిర్యాదు చేస్తే సమస్యలు వస్తాయని భయపడి తమలో తాము మథనపడి వెళ్లిపోతున్నారు.

భారీ స్థాయి బెట్టింగ్‌లు
పల్నాడు ముఖద్వారమైన సత్తెనపల్లి నియోజకవర్గంలో ఐపీఎల్‌ క్రికెట్‌ బెట్టింగ్‌ భారీ స్థాయిలో జరుగుతున్నాయి. చేతిలో డబ్బు లేకపోయినా అప్పులు చేసి మరీ హోటళ్లు, స్నేహితుల గదుల్లో మకాం వేసి బెట్టింగ్‌లు కాస్తున్నారు. ఐపీఎల్‌ పందేల్లో సింహ భాగం పల్నాడులోని సత్తెనపల్లి వాసులదే. పోలీసుల నిఘా మరింత పటిష్టం కావాలని, ఈ బెట్టింగ్‌ల సంస్కృతిని సంపూర్ణంగా అరికట్టాలని పురప్రజలు కోరుతున్నారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top