ఇంటర్‌ విద్యార్థిని అనుమానాస్పద మృతి

Inter Student Suspicious Death In Mahabubnagar - Sakshi

జడ్చర్ల టౌన్‌:  బాదేపల్లి పట్టణంలోని బీసీ మేనేజ్‌మెంట్‌ హాస్టల్‌ విద్యార్థిని అనుమానాస్పదంగా మృతి చెందింది. మంగళవారం రాత్రి ఈ సంఘటన జరిగింది. ఆమె మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది. తోటి విద్యార్థినులు, మృతురాలి సోదరి అనిత తెలిపిన వివరాల ప్రకారం...  ఇటిక్యాల మండలం సాసనూల్‌ గ్రామానికి చెందిన ఆంజనేయులు, ఈరమ్మ దంపతుల మొదటి కూతురు జి.వినీల(18) జడ్చర్ల వీఎస్‌ఆర్‌ జూనియర్‌ కళాశాలలో ఇంటర్‌ బైపీసీ రెండో ఏడాది చదువుతోంది. స్థానికంగా కోర్టు ఎదురుగా ఉన్న బీసీ మేనేజ్‌మెంట్‌ హాస్టల్‌లో ఉంటోంది. మంగళవారం సాయంత్రం 3గంటలకు కళాశాల నుంచి హాస్టల్‌కు వచ్చింది. సమీపంలో వినాయక నిమజ్జన వేడుకల్లో తోటి విద్యార్థినులతో కలిసి పాల్గొంది.

రాత్రి 11.30గంటల సమయంలో హాస్టల్‌గదిలో పడుకుంది. కొద్దిసేపటికే వాంతికి రావడంతో వాష్‌ రూంకు వెళ్లింది. ఆయాసంగా ఉండటంతో వంట మనిషికి చెప్పింది. వారు బాదేపల్లి ఆస్పత్రికి తీసుకెళ్లారు. చికిత్స అందిస్తున్న క్రమంలోనే మృత్యువాత పడింది. మృతురాలికి థైరాయిడ్‌ సమస్య, అస్థమా ఉందని తెలిసింది. అకస్మాత్తుగా గుండెనొప్పి వచ్చి ఉండవచ్చని బాదేపల్లి డాక్టర్లు తెలిపారని కులసంఘాల నాయకులు చెప్పారు. విద్యార్థిని అస్వస్థత, మృతి విషయం తెలియగానే వార్డెన్‌ స్వప్నారాణి అదేరాత్రి ఆస్పత్రికి చేరుకుంది. అప్పటికే కుటుంబ సభ్యులకు సమాచారం అందించటంతో వారుకూడా ఆస్పత్రికి చేరుకున్నారు. వినీల మృతదేహానికి బాదేపల్లి ప్రభుత్వ ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించి, అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించారు. మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది.

ఇవీ సందేహాలు  
విద్యార్థిని మృతిపట్ల పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి. హాస్టల్‌ పరిసర ప్రాంతాలు అపరిశుభ్రంగా ఉండటం, ఇటీవలే పట్టణంలో డెంగీ కేసులు అధికంగా రావటంతో మృతిపట్ల సందేహాలు వెల్లువెత్తుతున్నాయి. వాష్‌రూంకు వెళ్లిన సమయంలో ఏదైనా కరిచి ఉంటుందా అన్న అనుమానాలను తల్లిదండ్రులు వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై జడ్చర్ల సీఐ బాల్‌రాజ్‌యాదవ్‌ హాస్టల్‌కు చేరుకుని పంచనామా నిర్వహించారు. మృతురాలి తండ్రి ఆంజనేయులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.   

ఆర్థికసాయం చేసిన మంత్రి లక్ష్మారెడ్డి  విద్యార్థిని మృతి విషయం తెలుసుకున్న వైద్య ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్‌ లక్ష్మారెడ్డి విద్యార్థిని తల్లిదండ్రులకు రూ.25వేల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. బీసీ వెల్ఫేర్‌ డీడీ విద్యాసాగర్‌ ఘటనాస్థలానికి చేరుకుని వివరాలు తెలుసుకున్నారు. వినీల మృతిపట్ల ప్రభుత్వం విచారణ జరిపించాలని కేవీపీఎస్‌ జిల్లా అధ్యక్షులు జగన్, బీసీసేన ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు కృష్ణయాదవ్, ఎమ్మార్పీఎస్‌ రాష్ట్ర నాయకులు జంగయ్యమాదిగ తదితరులు డిమాండ్‌ చేశారు. మేనేజ్‌మెంట్‌ హాస్టల్‌లో వసతులు సక్రమంగా లేకపోవటం వల్లే ఘటన జరిగిందని ఆరోపించారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top