నేను ప్రేమించడం లేదు.. చస్తే చావు | Sakshi
Sakshi News home page

బాలికది ఆత్మహత్యే..

Published Wed, Feb 5 2020 1:18 PM

Inter Student Suicide Case Reveals Kashibugga Police Srikakulam - Sakshi

శ్రీకాకుళం, కాశీబుగ్గ: ప్రేమ వ్యవహారమే ఇంటర్‌ విద్యార్థిని మృతికి దారి తీసిందని.. ఈ కేసుకు సంబంధించి అన్ని కోణాల్లో పరిశీలించి.. సాక్ష్యాలు సేకరించిన తర్వాత ఆత్మహత్య చేసుకున్నట్లు నిర్ధారించామని కాశీబుగ్గ డీఎస్పీ శివరామిరెడ్డి విలేకర్లకు మంగళవారం వెల్లడించారు. ఆత్మహత్యకు కారణమైన బాలుడ్ని అరెస్టు చేసి జూనియర్‌ సివిల్‌ కోర్టులో హాజరుపరిచామన్నారు. తీవ్ర సంచలనం కలిగించిన ఈ కేసును పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేసి ఆత్యహత్యగా నిర్ధారించడంతో మిస్టరీ వీడింది.  

అసలేం జరిగింది..
కాశీబుగ్గ పోలీస్‌ స్టేషన్‌లో డీఎస్పీ తెలియజేసిన వివరాల ప్రకారం.. వజ్రపుకొత్తూరు మండలం ధర్మపురం గ్రామానికి చెందిన ఇంటర్‌ విద్యార్థిని జనవరి 26న గ్రామానికి సమీపంలోని రైల్వే ట్రాక్‌పై శవంగా కనిపించింది. బాలికను కిడ్నాప్‌ చేసి అత్యాచారం చేసిన తర్వాత రైల్వే ట్రాక్‌పై పడేశారనే అనుమానాలు వ్యక్తమయ్యాయి.  ఎస్పీ అమ్మిరెడ్డి ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకొని దర్యాప్తునకు ఆదేశించారు. ఈ కేసును పలాస రైల్వే పోలీసులు నమోదు చేసి కాశీబుగ్గ పోలీసులకు దర్యాప్తు బాధ్యతలు అప్పగించారు. 8 రోజులపాటు అన్ని కోణాల్లో కాశీబుగ్గ సీఐ వేణుగోపాలరావు ఆధ్వర్యంలో దర్యాప్తు నిర్వహించారు.
ఈ క్రమంలో ప్రభుత్వ ఆస్పత్రి నుంచి పోస్టుమార్టం రిపోర్టు కూడా రావడంతో దర్యాప్తు వేగవంతమైంది. బాలికపై ఎటువంటి అఘాయిత్యం జరగలేదని స్పష్టం కావడంతో హత్య కోణంపై దర్యాప్తు ప్రారంభించారు. ఇందులో కూడా ఎటువంటి ఆధారాలు లభ్యం కాకపోవడంతో ఆత్మహత్య కోణంపై దర్యాప్తు సాగింది. మొత్తం 50 మంది ప్రత్యక్ష సాక్షులను విచారించిన తర్వాత బాలిక ఆత్మహత్య చేసుకున్నట్లు నిర్ధారణకు వచ్చారు. నిందితుడిగా అనుమానిస్తున్న ఇంటర్‌ విద్యార్థిని ప్రశ్నించారు. కాల్‌ డేటా, మెసేజ్‌లు, వాట్సాప్‌ చాటింగ్‌లు పరిశీలించారు. ఈ విద్యార్థి వ్యవహారం వల్లే బాలిక మృతి చెందినట్లు భావించారు. నిందితుడిపై సెక్షన్‌ 305 కింద కేసు నమోదు చేశారు.

వివరాలు వెల్లడిస్తున్న డీఎస్పీ శివరామిరెడ్డి, సీఐ వేణుగోపాలరావు  
నిన్ను ప్రేమించడం లేదు..  
ప్రియుడిగా అనుమానిస్తున్న విద్యార్థితో బాలికకు మూడు నెలల నుంచి ప్రేమ వ్యవహారం నడుస్తోంది. గత నెల 23వ తేదీన చివరి సందేశంలో ‘నేను ప్రేమించడం లేదు. చస్తే చావు’ అని చేప్పాడు. ప్రేమించడం లేదని చెప్పడంతో బాలిక తీవ్ర మనస్తాపానికి గురైంది. దీంతో 25న అర్ధరాత్రి దాటిన తర్వాత బహిర్భూమికని వెళ్లి రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడింది.  ఆత్మహత్యకు ప్రేరేపించిన నేరానికి విద్యార్థిని అరెస్టు చేశామని, విద్యార్థి మైనర్‌ కావడంతో జువైనల్‌  కోర్టులో హాజరుపరిచామన్నారు. ఈ కేసును ఛేదించిన సిబ్బందిని అభినందించారు. విలేకరుల సమావేశంలో సీఐ వేణుగోపాల్‌రావు సిబ్బంది ఉన్నారు.  

బంధువులు, గ్రామస్తుల ఆందోళన
విద్యార్థిని జువైనెల్‌ కోర్టుకు పోలీసులు తరలిస్తున్నారన్న విషయం తెలుసుకున్న బంధువులు, గ్రామస్తులు కాశీబుగ్గ పోలీసు స్టేషన్‌ వద్దకు చేరుకున్నారు. పోలీసుల అదుపులో వారం రోజులకుపైగా స్టేషన్‌లోనే ఎందుకు ఉంచారని ఆందోళన వ్యక్తం చేశారు. బాలుడిని తరలిస్తున్న వాహనాన్ని అడ్డుకున్నారు. కొద్దిసేపటి తర్వాత బాలుడ్ని చూపించడంతో పట్టువిడిచారు.  అనంతరం శ్రీకాకుళం కోర్టుకు వాహనంలో తరలించారు.  

Advertisement
Advertisement