సముద్రంలో గల్లంతైన యువకుడి మృతదేహం గుర్తింపు

Identification of Dead Body of a Young Man chirala - Sakshi

సాక్షి, ఒంగోలు : చీరాల రామాపురం బీచ్‌లో రెండు రోజుల క్రితం గల్లంతైన కార్తీక్‌రెడ్డి మృతదేహం గురువారం చీరాల వాడరేవుకు కొద్ది దూరంలోని విజయలక్ష్మీపురం సముద్ర తీరానికి కొట్టుకొచ్చింది. మృతదేహం రెండు రోజుల పాటు సముద్రపు నీటిలో ఉండటంతో చీకిపోయింది. కార్తీక్‌రెడ్డి శరీరాన్ని చేపలు కొరుక్కు తినడంతో శరీరంపై అక్కడక్కడా గాయాలు ఏర్పడ్డాయి పడ్డాయి. తెలంగాణ రాష్ట్రం నల్గొండ టీచర్స్‌ కాలనీకి చెందిన చల్లమల్లి వెంకట నారాయణరెడ్డి కుమారుడు కార్తీక్‌రెడ్డి (28) ఓ హోటల్లో పనిచేస్తుంటాడు.

ఈ క్రమంలో కార్తీక్‌రెడ్డి తన నలుగురు స్నేహితులతో కలిసి చీరాల రామాపురం బీచ్‌కు సరదాగా గడిపేందుకు వచ్చాడు. సోమవారం రాత్రి వారంతా కలిసి హైదరాబాద్‌ నుంచి బయల్దేరి 18న ఉదయం చీరాల రామాపురం బీచ్‌కు చేరుకున్నారు. అంతా కలిసి సరదాగా సముద్రంలో స్నానం చేస్తుండగా అలల తాకిడికి కార్తీక్‌రెడ్డి గల్లంతయ్యాడు. ఆందోళన చెందిన అతని స్నేహితులు సమీపంలోని మత్స్యకారులకు తెలుపగా వారు సముద్రంలో వెతికారు. ఫలితం లేకపోవడంతో తల్లిదండ్రులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న తండ్రి వెంకట నారాయణరెడ్డి వచ్చి ఈపురుపాలెం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు కార్తీక్‌రెడ్డి ఆచూకీ కోసం సముద్ర తీరంలో గాలిస్తుండగా విజయలక్ష్మీపురం సముద్ర తీరానికి కార్తీక్‌రెడ్డి మృతదేహం కొట్టుకొచ్చింది. మృతదేహాన్ని గుర్తించిన పోలీసులు పోస్టుమార్టం కోసం చీరాల ప్రభుత్వాస్పత్రికి తరలించారు.  

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top