సీన్‌ రివర్స్‌!

Hyderabad Family Cheat NRI Groom Three Crore Case Filed - Sakshi

ఎన్‌ఆర్‌ఐ వరుడికి నగర కుటుంబం టోకరా

దఫ దఫాలుగా రూ.3 కోట్లు వసూలు  

కేసు దర్యాప్తు చేపట్టిన  సీసీఎస్‌ పోలీసులు

సాక్షి, సిటీబ్యూరో: వివిధ మాట్రిమోనియల్‌ సైట్స్‌లో ఎన్‌ఆర్‌ఐ వరుల మాదిరిగా రిజిస్టర్‌ చేసుకునే సైబర్‌ నేరగాళ్లు నకిలీ ప్రొఫైల్స్‌తో నగరవాసుల నుంచి అందినకాడికి దండుకొని  నిండా ముంచుతున్న కేసుల్ని చూస్తూనే ఉంటాం. అయితే ఇక్కడ సీన్‌ రివర్స్‌ అయింది. నగరానికి చెందిన ఓ కుటుంబం ఎన్‌ఆర్‌ఐకి పెళ్లి పేరుతో ఎర వేసి.. దఫ దఫాలుగా అతడి నుంచి రూ.3 కోట్ల వరకు వసూలు చేసింది. దీనిపై ఉస్మానియా యూనివర్శిటీ ఠాణాలో నమోదైన కేసు తదుపరి దర్యాప్తు నిమిత్తం నగర నేర పరిశోధన విభాగానికి (సీసీఎస్‌) బదిలీ అయింది. పోలీసుల కథనం ప్రకారం.. హబ్సిగూడకు చెందిన సత్యనారాయణరావు కుమారుడు సుధీర్‌ అమెరికాలో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌. వివాహం చేసుకునే ఉద్దేశంతో మంచి సంబంధం కోసం ఈయన తెలుగు మాట్రిమోనీ సైట్‌లో రిజిస్టర్‌ చేసుకున్నాడు. ఈ ప్రొఫైల్‌ చూసిన నగరానికి చెందిన ఓ యువతి డాక్టర్‌ నియతి వర్మగా రిజిస్టర్‌ చేసుకుంది. సుధీర్‌ ప్రొఫైల్‌లోని ఫోన్‌ నంబర్‌కు కాల్‌ చేసి తాను అతడిని వివాహం చేసుకోవడానికి సిద్ధమని చెప్పింది. ఈ ఫోన్‌ నంబర్‌ సత్యనారాయణ వద్ద ఉండటంతో ఆయన విషయాన్ని అమెరికాలోని తన కుమారుడికి తెలిపి యువతి ఫోన్‌ నంబర్‌ను కూడా అతడికి పంపాడు.

ఆ నెంబర్‌కు సుధీర్‌ కాల్‌ చేయగా... హార్వర్డ్‌ యూనివర్శిటీ నుంచి పల్మనాలజీలో పోస్టు గ్రాడ్యుయేషన్‌ చేసినట్లు నియతి వర్మ చెప్పింది. ఈమె ప్రొఫైల్‌ నచ్చడంతో సుధీర్‌ కొన్నాళ్లు మాటలు, చాటింగ్స్‌ కొనసాగించాడు. ఈ నేపథ్యంలోనే నియతి వర్మగా చెప్పుకున్న యువతి తాను స్థితి మంతురాలినైనా తనకు ఉన్న ఆస్తులు వారసత్వ గొడవల్లో ఉన్నాయని, మనశ్శాంతి కోసం తాను ఓ అనాథాశ్రమాన్ని నిర్వహిస్తున్నానని నమ్మబలికింది. దాని నిర్వహణ కోసం నిధులు అవసరమని చెప్పి..  2016 నుంచి దఫ దఫాలుగా అతడి నుంచి రూ.3 కోట్లు బదిలీ చేయించుకుంది. రెండుమూడు సందర్భాల్లో వివాహం విషయం నియతి వర్మ కుటుంబీకులుగా చెప్పుకున్న వాళ్లూ సత్యనారాయణతో మాట్లాడారు. ఆ తర్వాత ఆయన పెళ్లి ప్రస్తావన తీసుకొస్తే దాటవేయడం మొదలెట్టారు.

దీంతో   ఆయనకు అనుమానం వచ్చి ఆరా తీయగా..  తమతో నియతి వర్మగా మాట్లాడింది దేవతి మాళవిక అనే మహిళగా తేలింది.   కుటుంబీకులు దేవతి శ్రీనివాస్, దేవతి ప్రణవం, దేవతి గజలక్షిఓమ నగదు వసూలు చేసేందుకు ఆమెకు సహకరించారని తెలుసుకున్నారు. ఈ విషయం సత్యనారాయణకు తెలిసిందని గుర్తించిన నిందితురాలి సహా వారి కుటుంబీకులు అంతా తమ సెల్‌ఫోన్లు స్విచ్ఛాఫ్‌ చేసుకున్నారు. దీంతో పథకం ప్రకారం అంతా కలిసి తమను మోసం చేశారని గుర్తించిన ఆయన గత నెలలో ఉస్మానియా యూనివర్శిటీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న అధికారులు దర్యాప్తు నిమిత్తం ఈ కేసును సీసీఎస్‌కు బదిలీ చేశారు. ఈ కేసును అధికారులు  రీ–రిజిస్టర్‌ చేసి దర్యాప్తు ప్రారంభించారు. 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top