అనుమానంతో పెళ్లైన ఐదు నెలలకే...

The Husband Who Murdered A Two Month Pregnant Woman On Suspicion - Sakshi

రెండు నెలల గర్భిణిని హతమార్చిన భర్త 

అనంతరం ఆత్మహత్యాయత్నం

సాక్షి, ఎమ్మిగనూరురూరల్‌: వివాహం జరిగి ఐదు నెలలు కూడా కాలేదు...పెళ్లి ముచ్చట్లు తీరలేదు.. భార్యపై పెంచుకున్న అనుమానం పెనుభూతంగా మారింది... నిత్యం అనుమానిస్తూ హతమార్చాలనుకున్నాడు...నేను ఒక్కడినే చావను నిన్ను చంపి చస్తానంటుడేవాడు.. అన్నట్లుగానే అలాగే చేశాడు. ఆదివారం తెల్లవారుజామున భార్యను హత్యచేసి, తానూ ఒంటిపై పెట్రోల్‌ పోసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంఘటన చోటు చేసుకుంది.. కుటుంబ సభ్యులు, పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. మంత్రాలయం మండలం వగురూరు గ్రామానికి చెందిన నజీర్, దాదాబీలకు నలుగురు కుమారులు, వారిలో రెండో వాడు మహబుబ్‌బాషా. కొన్ని నెలల క్రితం గ్రామం నుంచి పట్టణంలోని ఎన్టీఆర్‌ కాలనీ బోర్డు లైన్‌లో ఇంటిని అద్దెకు తీసుకొని జీవనం సాగిస్తున్నారు. మహబూబ్‌ బాషా బీరువాలు తయారు చేసే షాప్‌లో పనిచేసేవాడు.

కుమారుడికి పెళ్లి చేయాలని మహబూబ్‌ బాషా తండ్రి నజీర్‌ ఆదోని మండలం సంతకుడ్లూరు గ్రామానికి చెందిన ఉసేనిసాబ్, గౌసియాల కుమార్తె రజియా (20)తో పెళ్లి నిశ్చియించారు. ఈ ఏడాది మార్చి 14న పెళ్లి జరిపించారు. ఉసేన్‌సాబ్‌కు ఆరుగురు కుమార్తెలు కాగా.. రజియా చివరిది. పెళ్లి జరిగినప్పటి నుంచి మహబుబ్‌బాషా పనికి సరిగా వెళ్లకుండా ఇంటి దగ్గర ఉండేవాడు. పెళ్లి జరిగిన రెండు నెలలకే భార్య గర్భం దాల్చటంపై అనుమానం పెంచుకొని రోజు వేధించేవాడు. అయితే శుక్రవారం మహబూబ్‌ బాషా, రజియా వగురూరు దర్గాకు వెళ్లి పూజలు చేసుకొచ్చారు. శనివారం రాత్రి భోజనం చేసి అందరూ పడుకున్న తరువాత భార్య,భర్తల మధ్య గొడవ మొదలైంది. భర్త అనుమానంపై రజియా సీరియస్‌ కావటంతో సహనం కోల్పోయిన మహబూబ్‌ బాషా రజియా గొంతు నులిమి చంపేశాడు. చనిపోయిందని తెలుసుకొని భయంతో బయటకు వచ్చాడు. బయట గదిలో ఉన్న తల్లిదండ్రులు  ఎక్కడికి వెళ్తున్నావని ప్రశ్నించగా, నమాజ్‌కు వెళ్తున్నానని చెప్పి బయటకు వచ్చి, స్కూటర్‌లోని పెట్రోల్‌ బాటిల్‌లోకి తీసుకొని ఇంట్లోకి వెళ్లి తలుపులు వేసుకొని నిప్పంటించుకున్నాడు.

మంటలు తాళలేక కేకలు వేయటంతో తల్లిదండ్రులు, అన్నదమ్ములు తలుపు బద్దలు కొట్టి మంటలు ఆర్పివేశారు. అప్పటికే విగతజీవిగా ఉన్న రజియాను చికిత్స కోసం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. మంటలు ఆర్పివేసి కుమారుడిని తాడుతో కట్టేసి పోలీస్‌లకు సమాచారం అందించారు. టౌన్‌ సీఐ శ్రీధర్, ఎస్‌ఐ కె. శ్రీనివాసులు, ఏఎస్‌ఐ బందెనవాజ్‌ సంఘటనా స్థలానికి చేరుకొని మృతికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మహబుబ్‌బాషాను చికిత్స కోసం స్థానిక ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లగా పరిస్థితి విషమంగా ఉండటంతో ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన చికిత్స కోసం కర్నూల్‌కు తరలించారు. కుమార్తె మృతి చెందిన విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు పెద్ద సంఖ్యలో ప్రభుత్వాసుపత్రికి చేరుకొని బోరున విలపించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు మహబూబ్‌ బాషాపై హత్యకేసు నమోదు చేశామని సీఐ వి. శ్రీధర్‌ తెలిపారు.   

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top