భర్తే హంతకుడు

Husband Killed Wife in PSR Nellore - Sakshi

వివాహేతర సంబంధం బయటపడడంతో దంపతుల మధ్య గొడవలు

భార్యను హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించే యత్నం

పోలీసుల విచారణతో వెలుగులోకి వాస్తవాలు

భర్తను అరెస్ట్‌ చేసిన పోలీసులు    

నెల్లూరు(క్రైమ్‌): పెళ్లికి ముందు తన భర్తకు ఓ మహిళతో వివాహేతర సంబంధం ఉండేదని భార్యకు తెలిసింది. దీంతో దంపతుల మధ్య గొడవలు మొదలయ్యాయి. అతను భార్యను అడ్డుతొలగించుకునేందుకు దారుణంగా హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో నవాబుపేట పోలీసులు శనివారం రాత్రి భర్తను నెల్లూరులోని ప్రశాంతినగర్‌ వద్ద అరెస్ట్‌ చేసి విచారించగా వాస్తవాలు బయటపడ్డాయి.  నెల్లూరులోని తన కార్యాలయంలో ఆదివారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో నగర డీఎస్పీ ఎన్‌బీఎం మురళీకృష్ణ వివరాలను వెల్లడించారు. కోడూరుపాడుకు చెందిన జె.మహేష్‌ సౌత్‌రాజుపాళెంలోని ఓ రైస్‌మిల్లులో మెషిన్‌ ఆపరేటర్‌గా పనిచేసేవాడు. అక్కడ సంధ్య అనే మహిళతో అతనికి పరిచయమైంది. అది ప్రేమగా మారింది. ఇద్దరూ పెద్దలను ఒప్పించి 2016 సంవత్సరం డిసెంబర్‌లో వివాహం చేసుకుని ప్రశాంతినగర్‌లో కాపురం ఉంటున్నారు. వారికి పది నెలల బాబు ఉన్నాడు.

తరచూ గొడవలు..
మహేష్‌ వివాహానికి ముందు శ్రీకాకుళంకు చెందిన ఓ మహిళతో సన్నిహితంగా ఉండేవాడు. దీంతో అప్పట్లో గొడవలు సైతం జరిగాయి. పెద్దమనుషులు ఆమెను శ్రీకాకుళానికి పంపివేశారు. ఈ విషయం ఇటీవల సంధ్యకు తెలిసింది. అప్పటి నుంచి దంపతుల నడుమ విభేదాలు పొడచూపాయి. తరచూ సంధ్య, మహేష్‌లు గొడవలు పడేవారు. ఈ క్రమంలో ఈనెల 10వ తేదీన మ«ధ్యాహ్నం వారిద్దరి మధ్య మరోమారు తీవ్ర ఘర్షణ జరిగింది. సంధ్య సాయంత్రం మరోమారు భర్తతో గొడవకు దిగింది. దీంతో అతను ఆమెపై విచక్షణారహితంగా దాడిచేశాడు. ఈ నేపథ్యంలో ఆమె డబుల్‌కాట్‌ మంచం చెక్కపై పడడంతో గొంతుకు బలమైన గాయమై తీవ్ర రక్తస్రావమైంది. మహేష్‌ కనికరం లేకుండా ఆమెపై మరోమారు దాడిచేయడంతో స్పృహ తప్పిపడిపోయింది. ఎలాగైనా భార్యను అంతమొందించాలని నిర్ణయించుకుని కుమారుడి ఊయలకు ఉపయోగించే చీరను సంధ్య మెడకు చుట్టి గట్టిగా లాగడంతో ఆమె అక్కడికక్కడే మృతిచెందింది.

ఉరేసుకుందని నమ్మించాడు
భార్య చీరతో ఉరివేసుకుందని ఆత్మహత్యగా చేసుకుందని స్థానికంగా ఉన్నవారిని మహేష్‌ నమ్మించాడు. సంధ్యను చికిత్స నిమిత్తం నారాయణ హాస్పిటల్‌కు తరలించారు. ఆమెను పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతిచెందిందని నిర్ధారించారు. దీంతో మహేష్‌ అక్కడ నుంచి పరారయ్యాడు. సంధ్యను ఆమె భర్త మహేష్‌ హత్యచేసి ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నాడని బాధిత అన్న అప్పారావు నవాబుపేట ఇన్‌స్పెక్టర్‌ శ్రీనివాసరావుకు ఫిర్యాదు చేశాడు. హత్య కేసుగా నమోదు చేసిన ఇన్‌స్పెక్టర్‌ మహేష్‌ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. శనివారం సాయంత్రం నిందితుడు ప్రశాంతినగర్‌ వద్ద ఉన్నాడనే సమాచారం అందుకున్న ఇన్‌స్పెక్టర్‌ శ్రీనివాసరావు అతడిని అదుపులోకి తీసుకుని పోలీసు స్టేషన్‌కు తరలించారు. అనంతరం తమదైన శైలిలో విచారించగా హత్య చేశానని అంగీకరించడంతో నిందితుడిని అరెస్ట్‌ చేసినట్లు డీఎస్పీ మురళీకృష్ణ వెల్లడించారు. సమావేశంలో నవాబుపేట ఇన్‌స్పెక్టర్‌ కట్టా శ్రీనివాసరావు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.  

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top