హీరా పెదవి విప్పేనా..? | Sakshi
Sakshi News home page

హీరా పెదవి విప్పేనా..?

Published Wed, Jan 9 2019 12:22 PM

Heera Group Case Mystery Still Pendin  - Sakshi

చిత్తూరు అర్బన్‌: షేక్‌ నౌహీరా– మనీ సర్క్యులేషన్‌ సామ్రాజ్యంలో దేశ వ్యాప్తంగా మార్మోగిన పేరిది. రూ.6 వేల కోట్ల డిపాజిట్లు, దేశవ్యాప్తంగా 1.35 లక్షల మందికి పైగా వినియోగదారులున్న సంస్థను హీరా ఒంటి చేత్తో నడిపించింది. అయితే కాలక్రమంలో చెల్లింపుల విషయంలో జిల్లాలోని పలువురు డిపాజిటర్ల నమ్మకం కోల్పోయింది. బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దేశ వ్యాప్తంగా ఇదే తరహా కేసులు నమోదయ్యాయి. మహారాష్ట్ర పోలీసులు హీరాను అరెస్టు చేశారు. ఇక, తెలుగు రాష్ట్రాల్లో నమోదైన కేసులు రాష్ట్ర సీబీసీఐడీ పోలీసులకు బదిలీ అయ్యాయి. హీరా ను విచారణ నిమిత్తం మూడు రోజుల పాటు సీబీసీఐడీ పోలీసుల కస్టడీకి అప్పగిస్తూ చిత్తూరు జిల్లా సెషన్స్‌ న్యాయస్థానం మంగళవారం ఆదేశాలు జారీ చేసింది. దీంతో సర్వత్రా ఆసక్తి నెలకొం ది. పోలీసుల విచారణలో హీరా పెదవి విప్పుతుం దా? డిపాజిట్ల సేకరణ ఎలా సాధ్యం..? ఇందులో విదేశీ సంస్థలున్నాయా..? అనే కోణాల్లో సమాచారం రాబట్టేందుకు పోలీసులు సిద్ధమయ్యారు.

కరువు మండలం నుంచి అంచెలంచెలుగా..
జిల్లాలోని పులిచెర్ల మండలం కరువుతో సతమతవుతోంది. డార్క్‌ ఏరియాలో ఉన్న ఈ మండలంలోని కోటపల్లెలో నౌహీరా తన తొలి మనీ సర్క్యులేషన్‌ వ్యాపారాన్ని ప్రారంభించారు. ఆమె స్వస్థలం అదే కావడంతో పులిచెర్లతోపాటు కలకడ, వాల్మీకిపురం, బి.కొత్తకోట, సదుం, కలికిరి, పీలేరు మండలాలతోపాటు తిరుపతి ప్రాంతాలకు వ్యాపారం విస్తరించింది. తక్కువ కాలంలోనే ఈ వ్యాపారం తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలోని పలు రాష్ట్రాలకు పాకింది. విదేశాల్లోని పలు సంస్థలు సైతం హీరా గ్రూపులో పెట్టుబడులు పెట్టేంత నమ్మకాన్ని చూరగొంది. బంగారంపై డిపాజిట్లు పెడితే వడ్డీ ఇస్తామని చెప్పిన హీరా మాటలకు అన్ని ప్రాంతాల ప్రజలు నమ్మారు. చెప్పినట్లుగానే ప్రతినెలా డిపాజిటర్ల బ్యాంకు ఖాతాల్లో డబ్బులు జమ అయ్యేవి. అయితే దేశ వ్యాప్తంగా జీఎస్టీ అమల్లోకి రావడంతో డిపాజిటర్లకు ఇవ్వాల్సిన డబ్బులు ఆలస్యమయ్యాయి. ప్రతినెలా ఖాతాల్లో జమ అయ్యే డబ్బులు మూడు నెలలైనా వాటి ఊసే లేకపోవడంతో డిపాజిట్‌ చేసినవాళ్లు అనుమానించారు. కలకడలో నౌహీరాపై గత ఏడాది సెప్టెంబర్‌ 25న పోలీసులకు ఫిర్యాదు అందడంతో హీరా సంస్థకు తొలిదెబ్బ తగిలింది. ఆ తరువాత తిరుపతిలో సైతం బాధితులు కేసు పెట్టారు. ఇలా వరుసగా తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలోని పలుచోట్ల హీరా సంస్థల్లో డిపాజిట్లు చేసినవాళ్లు పోలీసులకు ఆశ్రయించారు. కేసు దర్యాప్తును సీబీసీఐడీ పోలీసులకు అప్పగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడంతో తెలుగు రాష్ట్రాల్లోని కేసులను విచారణ చేస్తున్నారు.

ఉగ్ర సంస్థల పెట్టుబడులు ఉన్నాయా?
రూ.వేల కోట్ల పెట్టుబడితో సాగుతున్న హీరా గ్రూపు వ్యాపారాల్లో భారీగా విదేశీ సంస్థలున్నట్లు సీబీసీఐడీ పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. హీరా గ్రూపు కంపెనీలకు చెందిన బ్యాంకుల్లో జరిగిన లావాదేవీలే ఇందుకు సాక్ష్యమని పోలీసులు చెబుతున్నారు. ఇలాంటి తరుణంలో ఐఎస్‌ఐ, ఇతర ఉగ్రవాద సంస్థలు ఏదైనా హీరా గ్రూపులో పెట్టుబడులు పెట్టాయా? అనే కోణంలో పోలీసులు కూపీ లాగే పనిలో పడ్డారు. గతేడాది అక్టోబర్‌ 17న హైదరాబాద్‌ పోలీసులు హీరాను అరెస్టు చేయగా.. మహారాష్ట్రలో నమోదైన కేసులో ఆమె ముంబయ్‌ మహిళా సెంట్రల్‌ జైలులో రిమాండు ఖైదీగా ఉన్నారు. ప్రిజనర్‌ ట్రాన్స్‌ఫర్‌ (పీటీ) వారెంటు కింద కడకడలో నమోదైన కేసులో హీరాను చిత్తూరు జిల్లా కోర్టుకు తీసుకురాగా, ప్రస్తుతం ఈమె చిత్తూరు జిల్లా జైల్లో ఉన్నారు. ఈమెతో పాటు మరో ఇద్దరు నిందితులు థామస్, బిజూ థామస్‌ను సైతం మూడు రోజుల సీబీసీఐడీ కస్టడీకి కోర్టు అనుమతించింది. మరి హీరా సీబీసీఐడీ విచారణలో ఏం చెబుతుందో వేచి చూడాలి.

Advertisement
Advertisement