గోడకు కొట్టి చిన్నారి దారుణ హత్య

Girl Murder In Chennai Hit Into Wall - Sakshi

సాక్షి, చెన్నై: నైవేలి సమీపంలో శుక్రవారం చిన్నారిని గోడకుకొట్టి దారుణంగా హత్య చేసిన మహిళతో సహా ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు. విల్లుపురం జిల్లా కళ్లమేడు గ్రామానికి చెందిన ఉత్తండి భార్య రాజేశ్వరి (32). వీరికి హంసవల్లి (7), మీనా (5), కనకవల్లి (3) పిల్లలు ఉన్నారు. వీరు కుటుంబంతో కడలూర్‌ జిల్లా నైవేలి సమీపంలో ఉన్న మేలకుప్పమ్‌ రోడ్డు వీధికి చెందిన రాజమాణిక్కమ్‌ భార్య కమలమ్‌ (59) ఇంట్లో ఉంటూ, వ్యవసాయ పనిచేస్తూ వస్తున్నారు. రెండేళ్లుగా వీరిని బయటకి ఎక్కడికీ పంపకుండా, బానిసలుగా కమలమ్‌ చూసింది. గత 26వ తేదీ సాయంత్రం కమలమ్‌ తన ఇంటి మిద్దెపై వేరుశనగ గింజలు ఎండబెడుతోంది. ఆ సమయంలో అక్కడకు చిన్నారి మీనా వెళ్లింది. బాలిక వేరుశనగలను తొక్కినట్టు తెలుస్తోంది. దీన్నిగమనించిన కమలమ్‌ ఆవేశంతో ఆ చిన్నారి తల వెంట్రుకలను పట్టుకుని లాగి, మిద్దె గోడకేసి బాదింది. తలపై తీవ్రగాయాలయ్యాయి. మీనా సంఘటనా స్థలంలోనే మృతి చెందింది.

అనంతరం హత్యని కమలమ్‌ దాచిపెట్టడానికి తన కుమారుడు అరుల్‌మురుగన్, కుమార్తె అంజలై (34), ఈమె స్నేహితుడు అయ్యప్పన్‌ (31) రంగంలోకి దిగారు. వీరితో విరుదాచలం సమీపంలో ఉన్న జీడిపప్పు తోటకి తన కారులో మీనా మృతదేహాన్ని తీసుకుని వెళ్లారు. అక్కడ చిన్నారి మృతదేహాన్ని పాతిపెట్టి ఇంటికి వచ్చారు. మీనా కోసం తల్లి రాజేశ్వరి తీవ్రంగా గాలించారు. కానీ కమలమ్‌ వారిని బయటకి ఎక్కడికీ వెళ్లి వెతకనివ్వకుండా అడ్డుకొని, ఇంట్లోనే పెట్టి హింసించినట్లు తెలుస్తోంది. ఈ స్థితిలో శుక్రవారం తన బిడ్డ హత్యకు గురైందన్న సమాచారం రాజేశ్వరికి తెలిసింది.

అనంతరం ఆమె తన మిగతా ఇద్దరు పిల్లలతో ఇంటి నుంచి తప్పించుకుని, తెర్మల్‌ పోలీసు స్టేషన్‌కి వచ్చి ఫిర్యాదు చేసింది. పోలీసులు మేలకుప్పమ్‌కి వెళ్లి కమలమ్‌ని పట్టుకుని విచారణ చేశారు. ఇందులో ఆమె మీనాని హత్య చేసినట్లు ఒప్పుకుంది. కమలమ్‌ని ముదనైకి తీసుకెళ్లి జీడిపప్పుతోటలో పాతిపెట్టిన చిన్నారి మృతదేహాన్ని బయటకి తవ్వి తీశారు. పోస్టుమార్టం తరువాత చిన్నారి మృతదేహాన్ని అక్కడే పాతిపెట్టారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి కమలమ్, అంజలై, అయ్యప్పన్‌ ముగ్గురినీ అరెస్టు చేశారు. అజ్ఞాతంలో ఉన్న అరుల్‌ మురుగన్‌ కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. కమలమ్‌ ఇంట్లో ఉన్న రాజేశ్వరి భర్త ఉత్తండి కనపడడం లేదు. అతను ఎక్కడికి వెళ్లాడో తెలియని పరిస్థితి. అతనిని వెదికే పనుల్లో కుటుంబీకులు నిమగ్నులయ్యారు. ఇంకా ఉత్తండికి కమలమ్‌ తరఫున ఏదైనా దారుణం జరిగి ఉండవచ్చా..?అని పోలీసులు శోధిస్తున్నారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top