ఆగని అక్రమాలు

GHMC Bill Collector Caught Demanding Bribe in Hyderabad - Sakshi

జీహెచ్‌ఎంసీలో వసూళ్ల పర్వం  

తాజాగా ఏసీబీకి చిక్కిన బిల్‌ కలెక్టర్‌  

సాక్షి, సిటీబ్యూరో: అవినీతికి పాల్పడినా, రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడినా తగిన చర్యలంటూ లేకపోవడంతో జీహెచ్‌ఎంసీలో అక్రమాలు ఆగడం లేదు. ఇందుకు ఊతమిస్తూ తాజాగా సోమవారం కూకట్‌పల్లి బిల్‌
కలెక్టర్‌ మహేంద్రనాయక్‌ రూ.36 వేలు లంచంతీసుకుంటూ ఏసీబీకి  దొరికాడు. ఓ ఎలక్ట్రానిక్‌ దుకాణానికి ఆస్తి పన్ను తగ్గించేందుకు ఈ మొత్తం డిమాండ్‌ చేశాడు. ఇటీవల ఆస్తి పన్ను మదింపు, మ్యుటేషన్ల పేరుతో ఆయా సర్కిళ్లలో పలువురు పట్టుబడినప్పటికీ ట్యాక్స్‌ సెక్షన్‌ సిబ్బంది మారలేదని చెప్పడానికి ఇదే ఉదాహరణ. వసూళ్లలో వ్యత్యాసాన్ని తగ్గించేందుకు రూ.1200 నుంచి రూ.లక్ష వరకు ఆస్తి పన్ను ఉన్న దుకాణాలను తనిఖీలు చేసి చెల్లింపుల్లో తేడాలుంటే సవరించాల్సిందిగా జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ దానకిశోర్‌ ఈ నెల తొలి వారంలో ఆదేశించారు. నెలాఖరులోగా తనిఖీలు పూర్తి చేయాలన్నారు. ఆయా దుకాణదారుల నుంచి డబ్బులు తీసుకుంటున్న పలువురు ట్యాక్స్‌ సెక్షన్‌ సిబ్బంది... ఈ చర్యలతో తమ పై ఆదాయానికి అడ్డుకట్ట పడుతుందని భావించారు. ఈ నేపథ్యంలో ఎండలు ఎక్కువగా ఉన్నాయనే సాకుతో తనిఖీలు చేయలేమని, వచ్చే నెలలో చేస్తామని కమిషనర్‌కు విన్నవించారు. అయినప్పటికీ ఉదయం, సాయంత్రం వేళల్లో తనిఖీలు చేయాలని ఆయన సూచించారు. చేతివాటానికి అలవాటు పడిన సిబ్బంది తమకు అప్పగించిన బాధ్యతల్ని నెరవేర్చే క్రమంలోనూ వసూళ్లకు పాల్పడుతున్నారు. 

ఏళ్లుగా ఇంతే...  
జీహెచ్‌ఎంసీ ఆస్తి పన్ను మదింపులో అక్రమాలు ఏళ్ల తరబడిగా సాగుతున్నాయి. వారి అక్రమాలతో జీహెచ్‌ఎంసీకి ఏటా కనీసం రూ.500 కోట్ల వరకు గండి పడుతోందని అంచనా. దుకాణం అసలు విస్తీర్ణం తక్కువగా చూపడం, వాణిజ్య భవనాలను నివాస గృహాలుగా పేర్కొనడం తదితర పనులతో జీహెచ్‌ఎంసీని ముంచుతున్నారు. ట్యాక్స్‌ ఇన్‌స్పెక్టర్లు, బిల్‌ కలెక్టర్లు తాము చేయాల్సిన పనులకు ప్రైవేటు వ్యక్తుల్ని వినియోగించుకుంటూ వేతనాలు కూడా చెల్లిస్తున్నారంటే వారి ఆదాయమెంతో అంచనా వేసుకోవచ్చు. ఇలా ఈజీ మనీతో ముజ్రా పార్టీల్లో  పోలీసులకు పట్టుబడిన సంఘటనలు కూడా గతంలో ఉన్నాయి. ఆస్తిపన్ను మదింపు సక్రమంగా జరిగితే ప్రజలపై భారం మోపకుండానే వెయ్యి కోట్ల వరకు ఆస్తి పన్ను వసూళ్లు పెరిగే అవకాశం ఉంది. అందులో భాగంగానే తొలుత వాణిజ్య దుకాణాలను తనిఖీ చేయాల్సిందిగా కమిషనర్‌ ఆదేశించారు. 

అడ్డుకట్ట పడేనా?
జీహెచ్‌ఎంసీలో 20లక్షలకు పైగా భవనాలున్నాయి. ఇందులో 16లక్షల భవనాల నుంచి మాత్రమే ఆస్తిపన్ను వసూలవుతోంది. అందులోనూ వాణిజ్య భవనాలు కేవలం 2.07 లక్షలే ఉండడం, బహుళ వినియోగ భవనాలు దాదాపు 26వేలే ఉండడం నమ్మశక్యంగా లేదు. వీటి యజమానుల నుంచి ఏటా మామూళ్లు తీసుకుంటున్న ట్యాక్స్‌ సెక్షన్‌ సిబ్బంది చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. విస్తీర్ణాన్ని అసలు కంటే ఎక్కువగా చూపుతూ ఆస్తి పన్ను ఎక్కువ పడుతోందని బెదిరించి, వారి నుంచి మామూళ్లు ముడితే వాస్తవ విస్తీర్ణానికే ఆస్తిపన్ను వేసేవారు ఒకరైతే... ఉన్న విస్తీర్ణం కంటే తక్కువ విస్తీర్ణానికి ఆస్తిపన్ను విధిస్తూ జీహెచ్‌ఎంసీ కొంపముంచేవారు మరికొందరున్నారు. వీటన్నింటికీ చెక్‌ పెట్టేందుకే కమిషనర్‌ వాణిజ్య భవనాల రీసర్వేకు ఆదేశించారు. ఏ రోజుకారోజు తనిఖీలు నిర్వహించి క్షేత్రస్థాయి నుంచే అప్‌లోడ్‌ చేసేందుకు మొబైల్‌ యాప్‌ను కూడా వినియోగంలోకి తెచ్చే ప్రయత్నాల్లో ఉన్నారు. ఎన్ని చేసినా జీహెచ్‌ఎంసీ ఆస్తిపన్ను విభాగంలో అవినీతికి అడ్డుకట్ట పడుతుంతో లేదోననే అనుమానాలున్నాయి.

ఏసీబీ వలలో జీహెచ్‌ఎంసీ బిల్‌ కలెక్టర్‌
కూకట్‌పల్లి: ఆస్తి పన్ను తగ్గించేందుకు ఓ షాపు యజమాని వద్ద డబ్బులు డిమాండ్‌ చేసిన ఓ బిల్‌ కలెక్టర్‌ను ఏసీబీ అధికారులు సోమవారం రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. కూకట్‌పల్లి సర్కిల్‌–24లోని ఆస్‌బెస్టాస్‌కాలనీ ప్రాంతంలో బిల్‌ కలెక్టర్‌గా పనిచేస్తున్న మహేంద్రనాయక్‌ కాలనీలోని రాజ్‌ ఎలక్ట్రానిక్స్‌ షోరూంకు సంబంధించి ఆస్తి పన్నును తగ్గించేందుకు రూ.36 వేలు డిమాండ్‌ చేశాడు. దీంతో షాపు యజమాని నాగరాజు ఏసీబీ అధికారులను సంప్రదించాడు.  అధికారుల సూచన మేరకు సోమవారం నాగరాజు మహేంద్రనాయక్‌కు డబ్బులు ఇస్తుండగా ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అతడిపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top