ఏమ్మా.. శర్మాజీ ఇల్లెక్కడ? | Gangster Ramchandra who was Caught to the Jaipur police | Sakshi
Sakshi News home page

ఏమ్మా.. శర్మాజీ ఇల్లెక్కడ?

Jun 12 2019 1:34 AM | Updated on Jun 12 2019 1:34 AM

Gangster Ramchandra who was Caught to the Jaipur police - Sakshi

జైపూర్‌ పోలీసుల అదుపులో నిందితుడు రామ్‌చంద్ర బవారియా

సాక్షి, హైదరాబాద్‌: ఇతడో కాస్ట్‌లీ నేరగాడు. విమానాల్లో వస్తాడు. ఖరీదైన ప్రాంతాలకు వెళ్తాడు. మహిళల మెడలోని బంగారు గొలుసులను తస్కరిస్తాడు. ఈవిధంగా దేశవ్యాప్తంగా 11 నగరాల్లో 150 నేరాలకు పాల్పడ్డాడు. ఎట్టకేలకు రాజస్తాన్‌ పోలీసులకు ఆదివారం చిక్కాడు. అతడే రామ్‌చంద్ర బవారియా. ఉత్తరప్రదేశ్‌లోని శామ్లీ ప్రాంతానికి చెందిన ఇతడు పదిహేడేళ్ల ప్రాయం నుంచే నేరాల బాటపట్టాడు. 13 ఏళ్లుగా తప్పించుకు తిరుగుతున్నాడు. ఇతడు హైదరాబాద్‌లోనూ నేరాలు చేసినట్లు అక్కడి పోలీసులు అనుమానిస్తున్నారు.
 
150కిపైగా నేరాలు: తొలినాళ్లలో ఇళ్లలో చోరీలు, దోపిడీలు చేసిన బవారియా కొన్నేళ్లుగా కేవలం చైన్‌స్నాచింగ్స్‌కు పాల్పడుతున్నాడు. దేశవ్యాప్తంగా ఉన్న 11 నగరాల్లో ఇప్పటి వరకు 150కి పైగా నేరాలు చేశాడు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, హరియాణా, రాజస్తాన్, ఉత్తరప్రదేశ్‌ల్లో ఇతడికి నెట్‌వర్క్‌ ఉంది. ఒక్కడే ఆయా రాష్ట్రాల్లోని నగరాలకు విమానాల్లో వెళ్తుంటాడు. తాత్కాలిక నివాసం ఏర్పాటు చేసుకుని అక్కడున్న బంధువులు, స్నేహితుల సాయంతో హైస్పీడ్‌ బైక్‌లు సమీకరించుకుంటాడు. స్నాచింగ్‌కు వెళ్లేప్పుడు వాహనం వెనుక కూర్చునే (పిలియన్‌ రైడర్‌) ఇతడు ఖరీదైన ప్రాంతాల్లోనే ఎక్కువగా చేతివాటం ప్రదర్శిస్తాడు. 

శర్మాజీ పేరుతో ‘వెతుకులాట’..
నేరం చేయడానికి వెళ్లే ప్రతిసారీ కచ్చితంగా టోపీ పెట్టుకుంటాడు. అందుకే ఇతడికి నేర ప్రపంచంలో టోపీవాలా అనే పేరు కూడా ఉంది. బైక్‌ను ఆపి చిరునామా వెతుకుతున్నట్లు నటిస్తూ ‘టార్గెట్‌’దగ్గరకు వెళ్తాడు. ‘శర్మాజీ ఇల్లు ఎక్కడ?’అంటూ వారిని ప్రశ్నిస్తాడు. సమాధానం చెప్పిన ఆ మహిళలు వెనక్కి తిరగ్గానే మెడలోని చైన్‌ లాక్కుని బైక్‌పై ఉడాయిస్తాడు. కొన్ని సందర్భాల్లో మాత్రం రాణాజీ ఇల్లు ఎక్కడ? అని కూడా అడుగుతుంటాడని పోలీసులు చెప్తున్నారు. స్నాచింగ్‌ చేసిన వెంటనే దొంగసొత్తుతో తన స్వస్థలానికి వెళ్లిపోతుంటాడు. 

జైపూర్‌ పోలీసులకు ముప్పుతిప్పలు... 
ఐదు నెలలుగా రాజస్తాన్‌లోని జైపూర్‌లో షెల్టర్‌ ఏర్పాటు చేసుకున్న టోపీవాలా అక్కడి పోలీసులను ముప్పుతిప్పలు పెట్టాడు. అదే ప్రాంతానికి చెందిన తన బంధువుతోపాటు మరో ఇద్దరితో కలసి 50 నేరాలు చేశాడు. ఒక్కోరోజు ఏకంగా ఎనిమిది నేరాలు చేసేవాడు. బోగస్‌ పత్రాలను వినియోగించి, సొత్తు విలువలో 50 నుంచి 70 శాతం వచ్చేలా ఫైనాన్స్‌ కంపెనీల్లో తాకట్టు పెడతాడు. ఒకవేళ తాను పోలీసులకు చిక్కినా రికవరీ ఉండకూడదనే ఇలా చేస్తుంటాడని పోలీసులు చెప్తున్నారు. ఓ సీసీ కెమెరా ఫుటేజ్‌లో చిక్కిన ఆధారంతో రామ్‌చంద్రను పోలీసులు గుర్తించారు. 

విమాన ప్రయాణాల ఆధారంగా... 
ప్రత్యేక పోలీసు బృందం రంగంలోకి దిగి జైపూర్‌లో అతడిని పట్టుకుంది. ఇతడి ఆర్థిక లావాదేవీలు, ఇతర అంశాలను పరిశీలించగా చెన్నై, బెంగళూరు, సూరత్, హైదరాబాద్‌కు అనేకసార్లు విమానంలో ప్రయాణించినట్లు తేలింది. దీని ఆధారంగా అతడు ఆయా నగరాల్లో నేరాలు చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. కోర్టు అనుమతితో కస్టడీలోకి తీసుకున్నాక లోతుగా విచారించాలని భావిస్తున్నారు. హైదరాబాద్‌లోని మూడు పోలీసు కమిషనరేట్ల పరిధిలో ఎక్కడ నేరం చేశాడో తెలుసుకోవడానికి జైపూర్‌ పోలీసులు ప్రయత్నిస్తున్నారు. దీనికి సంబంధించి త్వరలో ఇక్కడి అధికారుల్ని సంప్రదించి రామ్‌చంద్ర వివరాలు అందించాలని భావిస్తున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement