
సాక్షి, నిజామాబాద్ : నిజామాబాద్ నగరంలో దారుణం చోటుచేసుకుంది. నగరంలోని కోటగల్లీ ప్రాంతానికి చెందిన మైనర్ బాలికను బెదిరించి గత ఏప్రిల్ 25న పక్కింటి అబ్బాయి అత్యాచారం చేశారు. ఆ దృశ్యాలను తన సెల్‌ఫోన్‌లో చిత్రీకరించి.. అప్పటినుంచి బాలికను బ్లాక్‌మెయిల్‌ను చేస్తున్నాడు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అంతకుముందు ఆరు నెలల కిందట బర్త్ డే పార్టీ పేరుతో మాయమాటలు చెప్పి నిందితుడు మరో ముగ్గురితో కలిసి.. బాలికను తమ వెంట తీసుకెళ్లాడు.
నాగారం ప్రాంతానికి తీసుకెళ్లిన నలుగురు నిందితులు బాలికపై సామూహిక అత్యాచార యత్నం చేశారు. బాలిక ఎలాగోలా వారి నుంచి తప్పించుకుంది. ఈ ఘటన గురించి బాలిక తన తల్లిదండ్రులకు చెప్పడంతో ఆలస్యంగా ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనపై పోలీసులకు బాధితురాలు ఫిర్యాదు చేశారు. దీంతో సంపత్ అనే నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతని ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై బాలలపై లైంగిక నేరాల నిరోధక చట్టం కింద అభియోగాలు నమోదుచేసినట్టు నిజామాబాద్ సీఐ సుభాష్ చంద్రబోస్ తెలిపారు.