డేటింగ్‌ పేరుతో ‘డ్యాష్‌’ 

fraud in the name of dating - Sakshi

యువకుడికి రూ. 4.08 లక్షలు టోకరా 

సాక్షి,సిటీబ్యూరో: సైబర్‌ నేరగాళ్లు నగర యువకుడికి డేటింగ్‌ పేరుతో ‘డ్యాష్‌’ ఇచ్చారు... ఓ వెబ్‌సైట్‌లో రిజిస్ట్రేషన్‌ చేయించుకోవడంతో యువతితో ఫోన్‌ చేయించి ఎర వేశారు... వివిధ దఫాల్లో మొత్తం రూ.4.08 లక్షలు కాజేశారు. చివరకు మోసపోయినట్లు గుర్తించిన బాధితుడు సోమవారం ఫిర్యాదు చేయడంతో సిటీ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. బోయిన్‌పల్లికి చెందిన అభిషేక్‌ ఉద్యోగం కోసం ఆన్‌లైన్‌లో అనేక వెబ్‌సైట్లను పరిశీలిస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే అతడి కన్ను డ్యాషీడేటింగ్‌.ఇన్‌ వెబ్‌సైట్‌పై పడింది. ఆ సైట్‌లోకి ప్రవే«శించిన అతను తన పేరు రిజిస్టర్‌ చేసుకున్నాడు. ఆ తర్వాత అతడి సెల్‌కు ఓ మహిళ కాల్‌ చేసి తన పేరు పూనంగా పరిచయం చేసుకుంది. వెబ్‌సైట్‌లో రిజిస్టర్‌ చేసుకున్నందున రూ.1000 తమ ఖాతాలో డిపాజిట్‌ చేస్తే రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ పూర్తవుతుందని, ఆపై డేటింగ్‌కు అవకాశాలు వస్తాయని చెప్పింది.

దీంతో అభిషేక్‌ ఆమె చెప్పిన ఖాతాలో డబ్బు డిపాజిట్‌ చేశాడు. ఆపై మరోసారి కాల్‌ చేసిన పూనం రూ. 20,800 డిపాజిట్‌ చేయాలని కోరడంతో అలానే చేశాడు. ఇలా పలుమార్లు ఆమె నుంచి ఫోన్లు కావడంతో అభిషేక్‌ డబ్బు డిపాజిట్‌ చేసుకుంటూ పోయాడు. ఇలా వివిధ దఫాలుగా మొత్తం రూ.4,08,798 వివిధ బ్యాంకు ఖాతాల్లో డిపాజిట్‌ చేశాడు. ఇంత మొత్తం చెల్లించినా డేటింగ్‌ కోసం వెబ్‌సైట్‌ నిర్వాహకుల నుంచి ఎలాంటి సమాచారం అందకపోవడంతో అనుమానించిన అభిషేక్‌ వారిని సంప్రదించడానికి ప్రయత్నించాడు. పూనం కాల్‌ చేసిన సెల్‌ఫోన్లు అన్నీ స్విచ్ఛాఫ్‌లో ఉండటంతో మోసపోయినట్లు గుర్తించాడు. నగర సైబర్‌ క్రైమ్‌ ఠాణాలో ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసుకున్న పోలీసులు అభిషేక్‌ డబ్బు డిపాజిట్‌ చేసిన బ్యాంకు ఖాతాల వివరాల సహా వివిధ కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.  

‘ఎమ్మెల్సీ’ కేసు దర్యాప్తు ముమ్మరం... 
క్రెడిట్‌ కార్డు అప్‌డేట్‌ చేయాలంటూ బీజేపీ ఎమ్మెల్సీ ఎన్‌.రాంచందర్‌రావు నుంచి రూ.58 వేలు కాజేసిన కేసులో సైబర్‌ క్రైమ్‌ పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఎమ్మెల్సీ రాంచందర్‌రావుకు గత నెల 31న ఓ వ్యక్తి ఫోన్‌ చేసి తన పేరు రవిగా పరిచయం చేసుకుని తాను ఆర్‌బీఎల్‌ బ్యాంకు ఎగ్జిక్యూటివ్‌నని, మీ క్రెడిట్‌ కార్డు గడువు కొద్దిరోజుల్లో ముగుస్తుందని అప్‌డేట్‌ చేసుకోవాలంటూ సూచించాడు. అతని మాటలు నమ్మిన ఎమ్మెల్సీ తన క్రెడిట్‌ కార్డులకు సంబంధించిన కార్డు నెంబర్లు, వాటి గడువు తేది, సీవీవీ నెంబర్లు చెప్పేశారు. మరుసటి రోజు వివిధ బ్యాంకు ఖాతాల నుంచి రూ.58 వేలు డ్రా అయినట్లు సమాచారం అందడంతో తాను మోసపోయినని గుర్తించిన ఆయన ఫిర్యాదు చేయడంతో సీసీఎస్‌ ఆధీనంలోని సైబర్‌ క్రైమ్‌ ఠాణాలో కేసు నమోదైంది. నిందితుడు వినియోగించిన సెల్‌ఫోన్‌ నెంబర్‌తో పాటు ఇతర అంశాలను పరిగణలోకి తీసుకుని కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top