మద్యం మత్తులో ఘర్షణ

Four Members Injured in Alcohol Conflicts East Godavari - Sakshi

నలుగురికి తీవ్ర గాయాలు

తూర్పుగోదావరి , కాకినాడ క్రైం: మద్యం షాపులో తలెత్తిన చిన్నపాటి ఘర్షణ కొట్లాటకు దారి తీసింది. ఒకరిపై ఒకరు బీరు సీసాలతో దాడికి తెగబడడంతో నలుగురు వ్యక్తులు తీవ్రంగా గాయపడి కాకినాడ జీజీహెచ్‌లో చికిత్స పొందుతున్నారు. ఈ సంఘటనపై సర్పవరం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వారి కథనం ప్రకారం.. కాకినాడ సాంబమూర్తినగర్‌ సమీపంలోని పావురాల తూము వద్ద ఉన్న సూర్య రెస్టారెంట్‌ అండ్‌ బార్‌ లో దుమ్ములపేటకు చెందిన కొయ్యా పెద బూసియ్య, గరికిన రాజు, వసుపిల్లి యల్లారావు అనే ముగ్గురు మత్స్యకారులు మద్యం తాగుతున్నారు. అదే సమయంలో దుమ్ములపేట సమీపంలోని కొత్తపాకలు ప్రాంతానికి చెందిన పిండ్రాల పరమేష్‌ అదే షాపులో మద్యం తాగుతున్నాడు. మత్స్యకారులు మద్యం మత్తులో మద్యం గ్లాసులను పగుల కొడుతున్నారు. ఆ సమయంలో పక్కనే మద్యం తాగుతున్న పరమేష్‌ వారిని గ్లాసులను ఎందుకు పగలుకొడుతున్నారని, దీని వల్ల ఇతరులకు ఇబ్బంది అని ప్రశ్నించాడు.

దీంతో మద్యం మత్తులో ఉన్న వారు పరమేష్‌ను నోటిపై బలంగా గుద్దాడు. దీంతో కింద పడిపోయిన పరమేష్‌ పైకి లేచి అతడిని కొట్టిన మత్స్యకారుడిపై దాడికి దిగాడు. దీంతో ముగ్గురు మత్స్యకారులు కలసి పరమేష్‌పై దాడి చేసి కొట్టారు. దీంతో ఆగ్రహించిన పరమేష్‌ అక్కడ తాను తాగుతున్న బీరు సీసాలను బద్దలు కొట్టి పెద బూసియ్య, గరికిన రాజు, వసుపిల్లి యల్లారావులపై దాడి చేశాడు. అదే సమయంలో ముగ్గురు వ్యక్తులు కలసి పరమేష్‌పై రాళ్లతో దాడి చేశారు. ఈ ఘర్షణలో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. కొయ్యా పెద బూసియ్యకు మెడ ఎడమ భాగంలో గాయం కాగా, గరికిన రాజుకు తలకు కిందిభాగంలో చెవి పక్కన కోసుకుపోయింది. వసుపల్లి యల్లారావుకు తలకు, కంటిపైభాగంలో రక్తపుగాయమైంది. పరమేష్‌ కింది పెదవి సగభాగం తెగి కిందపడిపోయిందని సర్పవరం పోలీసులు వివరించారు. మత్స్యకారులపై దాడిని ఆగ్రహించిన వారి బంధువులు సూర్య బార్‌ అండ్‌ రెస్టారెంట్‌ వద్ద ధర్నా నిర్వహించారు. రాకపోకలను స్తంభింపజేశారు. గాయపడిన వ్యక్తులను సర్పవరం ఎస్సైలు ఎండీ ఎంఆర్‌ ఆలీఖాన్, సత్యనారాయణరెడ్డి కాకినాడ జీజీహెచ్‌లో పరామర్శించి సంఘటన వివరాలను తెలుసుకున్నారు. దీనిపై ఇరువర్గాలపై కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం నలుగురు వ్యక్తులు చికిత్స పొందుతున్నారు. బాధితులను, వారి కుటుంబ సభ్యులను సిటీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు పరామర్శించి, మెరుగైన వైద్యం అందజేయాలని వైద్యులను కోరారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top