కూతురిని కాలువలోకి తోసిన కసాయి తండ్రి

Father Killed Daughter For Money in Karnataka - Sakshi

మద్యానికి డబ్బులివ్వలేదని నిత్యం గొడవ

హెచ్‌ఎల్‌సీలో మృతదేహం కోసం గాలింపు

సాక్షి,కర్ణాటక, బళ్లారి: మద్యం తాగుడుకు బానిసైన కసాయి తండ్రి నిత్యం కూతురిని తాగేందుకు డబ్బులు ఇవ్వాలని వేధించడంతో పాటు గొడవ పడుతూ కూతురినే హెచ్‌ఎల్‌సీలోకి తోసిన ఘటన చోటు చేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల మేరకు సోమవారం నగరంలోని బండిహట్టి ప్రాంతానికి చెందిన సూరి అలియాస్‌ ఆటో సూరి తన కూతురు పల్లవిని హెచ్‌ఎల్‌సీ కాలువలోకి తోసి పోలీసు స్టేషన్‌కి వచ్చి లొంగిపోయాడు. రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి శ్రీరాములు కార్యాలయంలో పని చేస్తున్న పల్లవి(22)ని ఆదివారం రాత్రి తాగేందుకు డబ్బులు ఇవ్వాలని గొడవకు దిగాడు. దీంతో ఆమె విసిగిపోయి ప్రతి రోజు తాగేందుకు డబ్బులు ఇవ్వాలని గొడవ చేస్తే ఎలా అని, నీతో కలిసి ఇంటిలో ఉండటం కంటే చావడం నయమని బెదిరించింది. రాత్రి కూడా గొడవ కొనసాగింది. సోమవారం ఉదయం కూడా అదే మాదిరిగా తాగేందుకు డబ్బులు ఇవ్వాలని మళ్లీ అడగటంతో ఆమె బెదిరించేందుకు పక్కనే ఉన్న హెచ్‌ఎల్‌సీ కాలువలోకి దూకుతానని బెదిరిస్తూ అక్కడికి వెళ్లింది.

వెంబడించిన తండ్రి కూడా కాలువ వద్దకు చేరుకున్నాడు. ఆమె బెదిరిస్తూ అలాగే నిలబడటంతో ఇలాంటి ఘటనలకు పాల్పడవద్దు అని చెప్పాల్సిన తండ్రి తానే కూతురిని కాలువలోకి తోసివేయడంతో పక్కనే ఉన్న ఓ యువకుడు చూసి తక్షణం రక్షించేందుకు ప్రయత్నించగా, కసాయి తండ్రి ఆ యువకుడితో కూడా గొడ వకు దిగాడు. అంతలోనే ఆమె నీటిలో కొట్టుకు పోయింది. ఈ విషయం పోలీసులకు తెలియడంతో అగ్నిమాపక సిబ్బంది. ఈతలో నైపుణ్యం ఉన్న యువకులను రప్పించి కాలువలో పల్లవి జాడ కోసం గాలింపు ప్రారంభించారు. మూడేళ్ల క్రితం సూరి వేధింపులకు అతని భార్య కూడా ఆత్మహత్య చేసుకుందని స్థానికులు చెబుతున్నారు. ఇతనికి రెండో కూతురు ఉంది. కాగా ఇదే వారంలో బళ్లారి తాలూకా గోడేహాల్‌లో పరువు హత్య జరిగింది. ఇందులో కూతురినే తండ్రి చంపేశాడు. ప్రస్తుతం తాగుడుకు బానిసైన తండ్రి ఏకంగా తన కూతురినే హెచ్‌ఎల్‌సీలోకి తోసేయడం ఈ ప్రాంత వాసులను కలిచివేసింది. ఈ ఘటనతో బండిహట్టిలో పల్లవి ఇంటి వద్ద బంధువులు, స్నేహితుల ఆర్తనాదాలు మిన్నంటాయి. స్థానిక బ్రూస్‌పేట పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top