డబ్బుపై ఆశే ప్రాణం తీసింది

Family Commits Mass Suicide in Chittoor - Sakshi

కూల్‌డ్రింక్‌లో పురుగుమందు కలిపి.. 

భార్య, బిడ్డలకు తాగించి, తానూ ఆత్మహత్య

ముగ్గురు కుటుంబసభ్యుల మృతి.. ఇంకొకరు సేఫ్‌

చిత్తూరులో విషాదకర సంఘటన

చిత్తూరు అర్బన్‌ : రూపాయి రూపాయి ఏం చేస్తావ్‌ అంటే.. అయినవాళ్లను విడదీస్తాను. తోబుట్టువుల మధ్య రక్తపాతం సృష్టిస్తాను. బంధాలను సైతం బూడిద చేస్తానని చెప్పిందట. ఇదే కోవలో కట్టుకున్న భార్య కన్నబిడ్డ భవిష్యత్తును అదే రూపాయిల కోసం చిదిమేసి తనువు చాలించాడో వ్యక్తి. అర్ధరాత్రి కూల్‌డ్రింక్‌ తాపించడానికి నిద్రలేపుతుంటే కన్నతండ్రి, కట్టుకున్న భర్తపై ఉంచిన నమ్మకంతో అందులో కలిపి ఉన్న విషాన్ని గ్రహించలేక మృత్యుఒడికి చేరుకున్నారు. చిత్తూరు నగరంలోని ఓబనపల్లె హౌసింగ్‌ కాలనీలో చోటుచేసుకున్న హృదయవిదారక ఘటన అందరినీ కన్నీళ్లుపెట్టించింది. చిత్తూరు నగరంలోని సంతపేట సమీపంలో ఉన్న ఓబనపల్లె హౌసింగ్‌ కాలనీకి చెందిన కల్లూరు రవి (50).. అతని భార్య కల్లూరు భువనేశ్వరి (45), కుమార్తె కల్లూరు గాయత్రి (9)కి పురుగులమందు కలిపిన కూల్‌డ్రింక్‌ తాగించి తాను కూడా ఇదే పానీయాన్ని తాగడంతో ముగ్గురు మృతి చెందారు. ఆదివారం అర్ధరాత్రి జరిగిన ఈ ఘటన సోమవారం వెలుగుచూసింది.

చిత్తూరు డీఎస్పీ ఈశ్వర్‌రెడ్డి, టూటౌన్‌ సీఐ యుగంధర్‌ ఈ ఘటనకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. రవి మొదటి భార్య గౌరి 15 ఏళ్ల క్రితం మృతిచెందింది. వీరికి భార్గవి అనే పాప ఉంది. గౌరి మృతి తరువాత బెంగళూరుకు చెందిన భువనేశ్వరితో పెద్దలు రవికి వివాహం చేశారు. వీరికి గాయత్రి, నాగేశ్వరసాయి (6)అనే ఇద్దరు పిల్లలున్నారు. రవి తల్లి కల్లూరు జయలక్ష్మి ఎల్‌ఐసీలో పనిచేస్తూ ఇటీవల రిటైరయ్యారు. కాస్త డబ్బులు రావడంతో రవి ఆ డబ్బు కోసం నిత్యం తల్లితో వాదులాడేవాడు. పైగా ఓబనపల్లె కాలనీలో ఉన్న ఇంటిని తన పేరిట రిజిస్ట్రేషన్‌ చేయించాలని పలుమార్లు గొడవ కూడా పెట్టుకున్నాడు. అయితే మద్యానికి బానిసైన కొడుకు ఇంటిని పోగొట్టుకుంటాడని భావించిన జయలక్ష్మి.. ఇంటిని మనవడి పేరిట రాస్తామంటూ చెబుతూ వచ్చేది. కుటుంబ పోషణ అంతంతమాత్రంగా ఉండటంతో భువనేశ్వరిని ఆర్థికంగా ఆదుకునేది. ఇది నచ్చని రవి, తన భార్యతో కూడా తగాదాలు పెట్టుకునేవాడు. ఈ నేపథ్యంలో నిద్రిస్తున్న భార్య, పిల్లల్ని అర్థరాత్రి లేపి, పురుగుల మందు కలిపిన కూల్‌డ్రింక్‌ తాగించాడు. కొద్దిసేపు తరువాత తాను కూడా తాగి స్పృహ కోల్పోయాడు. ముగ్గురూ చనిపోయారు.

ఇద్దరి రాత బాగుండటంతో...
రవి తన కొడుకు నాగేశ్వరసాయికి కూడా పురుగుల మందు కలిపిన కూల్‌డ్రింక్‌ తాగించాడు. కొద్దిగా తాగిన సాయి, తనకు వద్దని చెప్పి పడుకునేశాడు. కొంతసేపటికి లేచి చూస్తే తల్లిదండ్రులు, అక్క అపస్మారక స్థితిలో పడుంటడాన్ని గమనించాడు. ఇంట్లో కింది అంతస్తులో పడుకున్న నానమ్మకు సమాచారమిచ్చాడు. ఆమె పైకివెళ్లి చూడటంతో అందరూ విగతజీవులుగా ఉన్నారు. స్థానికుల సాయంతో 108 అంబులెన్సులో ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అప్పటికే ముగ్గురూ చనిపోయినట్లు వైద్యులు పేర్కొన్నారు. సాయి మాత్రం ప్రాణా పాయం నుంచి బయటపడ్డాడు. రవి మొదటి భార్య కుమార్తె భార్గవి, నానమ్మ వద్ద పడుకోవడంతో ఎలాంటి ప్రాణహాని జరగలేదు. మృతుల కుటుంబాన్ని చిత్తూరు ఆర్డీవో రేణుక పరామర్శించారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top