
పోలీసులు స్వాధీనం చేసుకున్న నకిలీ శానిటైజర్ బాటిళ్లతో నిందితులు
సాక్షి. సిటీబ్యూరో: కరోన వైరస్ నేపథ్యంలో హ్యాండ్ శానిటైజర్లకు భారీగా పెరిగిన డిమాండ్‌ను క్యాష్ చేసుకోవడానికి ఓ ముఠా రంగంలోకి దిగింది. ఎలాంటి అనుమతులు, ప్రమాణాలు లేకుండా వీటిని తయారు చేస్తూ జెర్మ్ ఎక్స్ బ్రాండ్ పేరుతో మెడికల్ షాపులకు విక్రయిస్తోంది. దీనిపై సమాచారం అందుకున్న దక్షిణ మండల టాస్క్ ఫోర్స్ పోలీసులు శుక్రవారం దాడి చేశారు. ఇద్దరు నిందితులను అరెస్టు చేశామని అదనపు డీసీపీ చక్రవర్తి గుమ్మి వెల్లడించారు. సాధారణంగా శానిటైజర్ చేతికి రాసుకున్న వెంటనే ఆవిరి అవుతుందని, వీరు తయారు చేసిన నకిలీవి అలా కావని ఆయన పేర్కొన్నారు. శాస్త్రీపురం ప్రాంతానికి చెందిన ఒమర్ ఫారూఖ్ ప్రైవేట్ ఉద్యోగి. అలాగే రూపాల్‌బజార్ వాసి మహ్మద్ అబ్దుల్ ఖద్దూస్ ఆర్టిఫిషియల్ నగలు అమ్ముతూ ఉంటాడు. ప్రస్తుతం కరోనా భయం నేపథ్యంలో హ్యాండ్ శానిటైజర్లకు డిమాండ్ పెరగడంతో వాటిని తయారు చేయాలని వీరిద్దరూ పథకం వేశారు.
ఎలాంటి అనుమతులు లేకుండా, సరైన ప్రమాణాలు పాటించకుండా తాను సేకరించిన పెట్రోలియం జెల్లీ, రోజ్ వాటర్‌లను కలిపి శానిటైజర్లు రూపొందిస్తున్నారు. వీటిని చిన్న చిన్న ప్లాస్టిక్ డబ్బాల్లో నింపి జెర్మ్ ఎక్స్ పేరుతో ఉన్న లేబుళ్లు వేసి ఆ బ్రాండ్స్‌గా తయారు చేస్తున్నారు. వీటిని పాతబస్తీలో ఉన్న మెడికల్ షాపులకు విక్రయిస్తున్నారు. డిమాండ్ నేపథ్యంలో అధిక ధరకు అమ్ముతూ క్యాష్ చేసుకుంటున్నారు. దీనిపై సమాచారం అందుకున్న దక్షిణ మండల టాస్క్ ఫోర్స్ ఇన్‌స్పెక్టర్ ఎస్.రాఘవేంద్ర ఆధ్వర్యంలో ఎస్‌ఐలు వి.నరేందర్, ఎన్.శ్రీశైలం, మహ్మద్ థకియుద్దీన్ తమ టీమ్‌లతో దాడి చేశారు. ఇద్దరినీ అరెస్టు చేసి తదుపరి చర్యల నిమిత్తం శాలిబండ పోలీసులకు అప్పగించారు. వీరి నుంచి 570 శానిటైజర్ డబ్బాలను స్వాధీనం చేసుకున్నారు. ఇలాంటి శానిటైజర్ల కారణంగా అలర్జీల వస్తాయని, ఖరీదు చేసే ముందు సరిచూసుకోవలని పోలీసులు హెచ్చరిస్తున్నారు.