పోస్ట్‌ చేశారు.. పోలీసులకు పట్టుబడ్డారు!

Fake News Posts In Facebook boys Arrest In Kurnool - Sakshi

వదంతులు ప్రచారం చేసినముగ్గురు బాలురు అరెస్ట్‌

మూడు సెల్‌ఫోన్లు, సిమ్‌కార్డుల స్వాధీనం

పుకార్లు పుట్టిస్తే కఠిన చర్యలు–ఎస్పీ

కర్నూలు: జిల్లాలో పార్థి, చెడ్డీ, బిహార్‌ గ్యాంగ్‌లున్నాయంటూ సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసిన ముగ్గురు బాలురను నంద్యాల పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఈసందర్భంగా వారి నుంచి మూడు సెల్‌ఫోన్లు, సిమ్‌లు స్వాధీనం చేసుకున్నారు. ఆదివారం సాయంత్రం జిల్లా పోలీసు కార్యాలయంలోని వ్యాస్‌ ఆడిటోరియంలో ఎస్పీ గోపీనాథ్‌ జట్టి నంద్యాల డీఎస్పీ గోపాలకృష్ణ, రూరల్‌ సీఐ రామకృష్ణారెడ్డి, ఎస్‌బీ డీఎస్పీ నజీముద్దీన్‌లతో కలిసి వివరాలు వెల్లడించారు.

పోస్ట్‌ ఇలా..: ‘పిల్లలను చంపి మెదడు తినే మద్రాసుకు చెందిన 50 మంది గ్యాంగ్‌లో ఒక వ్యక్తిని పట్టుకొని కొట్టాం. అతడి పేరు జాన్‌కొల్లి, ఇంకొందరు వ్యక్తులను కోడూరులో పట్టుకున్నారు. మహానంది మండలం తిమ్మాపురం వాసులు వ్యక్తిని పట్టుకొని విచారిస్తున్న ఫొటోను జతపరిచి దానికి వాయిస్‌ను పైవిధంగా జతచేసి వాట్సప్, సామాజిక మాధ్యమాల ద్వారా సుమా రు 31 మంది పరిచయస్తులకు షేర్‌ చేశారు.

పుకార్లు నమ్మొద్దు...: సోషల్‌ మీడియాలో వస్తున్న పుకార్లను నమ్మొద్దని జిల్లా ప్రజలకు ఎస్పీ విజ్ఞప్తి చేశారు. ఎలాంటి గ్యాంగులు జిల్లాలో తిరగడంలేదన్నారు. వదంతుల నమ్మి మానసిక స్థితి సరిగా లేనివారిపైనా, అమాయకులపైనా భౌతిక దాడులకు పాల్పడి హాని కలిగించవద్దన్నారు.

జిల్లా ప్రశాంతంగా ఉందని సాయుధులైన ప్రత్యేక పోలీసు బృందాలతో గస్తీ ముమ్మరం చేసినట్లు వెల్లడించారు. జిల్లా వ్యాప్తంగా ఇప్పటివరకూ జరిగిన సంఘటనలపై విచారించగా ఆయా గ్రామాల్లో ప్రజలకు పట్టుబడిన వారంతా మతిస్థిమితం లేనివారు, భిక్షగాళ్లు, చిన్నచిన్న వ్యాపారులుగా గుర్తించామన్నారు. ఇక ఆదోనిలో ప్రజల సామూహిక దాడిలో మృతి చెందిన వ్యక్తి కూడా ఓ అమాయకుడేనని తేలిందన్నారు. గ్యాంగ్‌ల గురించి సోషల్‌ మీడియాలో పుకార్లు పుట్టించిన బాలురపై మహానంది పోలీసు స్టేషన్‌లో కేసు నమోదుచేసి కర్నూలు బీక్యాంపులోని జువైనల్‌ హోమ్‌కు అప్పగించినట్లు ఎస్పీ వెల్లడించారు. 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top