సేవ ముసుగులో కుచ్చుటోపి

Fake Job Gang Arrests In Karimnagar - Sakshi

కరీంనగర్‌ క్రైం: కేసీఆర్‌ సేవాదళం స్వచ్ఛందసంస్థ పేరిట సేవాకార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ప్రచారం చేసుకుని, పలువురికి ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తానని మోసం చేసిన కట్కోజుల రమేశ్‌చారితో పాటు మరో ఇద్దరిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. కరీంనగర్‌ కమిషనరేట్‌లో బుధవారం సీపీ కమలాసన్‌రెడ్డి వివరాలు వెల్లడించారు. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం మల్లాపూర్‌కు చెందిన కట్కోజుల రమేశ్‌చారి ఇంటర్‌వరకు చదువుకున్నాడు. పీజీ చేశానని చెప్పుకుంటూ నకిలీ సర్టిఫికెట్లతో చలామణి అయ్యాడు. మూడేళ్ల క్రితం కేసీఆర్‌ సేవాదళం పేరుతో ఉన్న స్వచ్ఛంద సంస్థ లో చేరాడు.

దానికి ప్రధాన కార్యదర్శిగా చెప్పుకుంటూ పలు సామాజిక సేవలు చేస్తున్నట్లు ఫొటోలు దిగి.. సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేసుకున్నాడు. తనకు పలువురు ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు దగ్గరంటూ ప్రభుత్వ కార్యాలయాల్లో ఔట్‌సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగాలు ఇప్పిస్తానని నిరుద్యోగులను నమ్మించుకొచ్చాడు. ఇలా మూడేళ్లలో కరీంనగర్, సిద్దిపేట, వరంగల్‌ జిల్లాలలో సుమారు 40మంది నుంచి రూ.85 లక్షలు వసూలు చేశాడు. వారిని నమ్మించడానికి చెక్కులు, ప్రామీసరి నోట్లు రాసిచ్చేవాడు.
 
ఏజెంట్లను ఏర్పాటు చేసుకుని... 
జయశంకర్‌ భూపాపల్లి జిల్లా టేకుమట్ల మండలం గరిమెలపల్లి గ్రామానికి చెందిన సిద్దిజు రమేశ్‌చారిని ఏజెంటుగా ఏర్పాటు చేసుకున్నాడు. అక్కడి నిరుద్యోగులకు ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తామని రూ.5 లక్షలు వçసూలు చేసి ఇద్దరూ పంచుకున్నారు. అదే విధంగా నాంపెల్లి రాజ్‌కుమార్‌ ఐఎఫ్‌ఏ సంస్థను ఏర్పాటు చేసి ఉద్యోగాలు ఇప్పిస్తానని రమేశ్‌చారితో కలిసి మోసాలకు పాల్పడ్డాడు. నిరుద్యోగుల నుంచి రూ.6 లక్షలు వసూలు చేసి ఇద్దరు పంచుకున్నారు.

చొప్పదండి మండలం వెదురుగట్ల గ్రామానికి చెందిన అమరిశెట్టి రామచంద్రం రమేశ్‌చారికి రూ.12 లక్షలు వసూలు చేసిఇచ్చి, రూ.2లక్షలు కమీషన్‌గా తీసుకున్నాడు. జగిత్యాలకు చెందిన మహ్మద్‌ జునైద్‌ రమేశ్‌చారితో కలిసి రూ.10లక్షల వరకు నిరుద్యో గుల నుంచి వసూలు చేశాడు. వరంగల్‌ జిల్లా హసన్‌పర్తికి చెందిన అంజనేయులుతో కలిసి రూ.4.50 లక్షలు వసూలు చేశాడు. వీటిలో అంజనేయులు రూ.3లక్షలు తీసుకున్నాడు. హుస్నాబాద్‌కు చెందిన నూనే శ్రీనివాస్‌ రూ. 4.80లక్షలు వసూలు చేసి రూ.2లక్షలు కమీషన్‌గా తీసుకున్నాడు. హైదరాబాద్‌కు చెందిన రాజేంద్రప్రసాద్‌ నిరుద్యోగల నుంచి రూ. 25 లక్షలు వసూలు చేసి రమేశ్‌చారికి ఇచ్చాడు. ప్రస్తుతం రామచంద్రం, జునైద్, అంజనేయులు, నూనే శ్రీనివాస్, రాజేంద్రప్రసాద్‌ పరారీలో ఉన్నారు.

 తొమ్మిది కేసులు నమోదు 
కరీంనగర్, సిద్దిపేట, వరంగల్‌ జిల్లాలో సుమారు 40 మంది వరకూ బాధితులు ఉండగా కరీంనగర్‌లో 7, హుస్నాబాద్‌లో ఒకటి, వరంగల్‌లో ఒక కేసు నమోదైంది. మరికొంత మంది బాధితులు బయటకు వస్తే మరిన్ని కేసులు నమోదయ్యే అవకాశముందని సీపీ వెల్లడించారు.

పక్కా సమాచారంతో పట్టివేత 
కొంతకాలంగా రమేశ్‌చారిపై వరంగల్‌ జిల్లాలో విస్తృతంగా ప్రచారం సాగోతోంది. బాధితులు సైతం ఒక్కరొక్కరుగా వచ్చి ఫిర్యాదు చేస్తున్నారు. ఈ క్రమంలో కరీంనగర్‌లో పలుకేసులు నమోదయ్యాయి. విచారణ చేపట్టిన టాస్క్‌ఫోర్స్, చొప్పదండి పోలీసులు రమేశ్‌చారి కదిలికలపై నిఘా పెట్టారు. బుధవారం వేకువజామున చొప్పదండికి రాగా పక్కాగా సమాచారంతో రమేశ్‌తో పాటు సిద్జోజు రమేశ్‌చారి, నాంపల్లి రాజ్‌కుమార్‌ను పట్టుకున్నారు. వారి నుంచి పలు ఖాళీ ప్రామిసరీ నోట్లు, సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకుని , నిందితులను రిమాండ్‌ చేశారు.

మోసగాళ్లను నమ్మొద్దు
ప్రభుత్వ ఉద్యోగాల కోసం అటెండర్‌నుంచి ఉన్నతపోస్టు వరకు ఎవరిని నియమించాలన్నా ఓ పద్ధతి ఉంటుంది. ప్రైవేట్‌ కంపెనీలు కూడా ఇంటర్వ్యూలు నిర్వహించే ఉద్యోగులను నియమించుకుంటారు. ఎవరైనా ఉద్యోగాలు ఇప్పిస్తానని డబ్బులు వసూలు చేస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలి. ఈ కేసులో మరింత లోతుగా విచారణ చేయాల్సి ఉంది.
– కమలాసన్‌రెడ్డి, సీపీ, కరీంనగర్‌

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top