తీగలాగితే డొంక కదిలింది

Fake Cotton Seeds Caught In Adilabad - Sakshi

రూ.1.30 కోట్ల విలువైన నకిలీ పత్తి విత్తనాలు స్వాధీనం

బెల్లంపల్లి: మొక్కజొన్నల మాటున అక్రమంగా రవాణా చేస్తున్న నకిలీ పత్తి విత్తనాలను పట్టుకున్న ఘటన మరువకముందే బెల్లంపల్లి పోలీ సులు మరో గుట్టును రట్టు చేశారు. బుధవారం ఆంధ్ర ప్రాంతానికి వెళ్లి ఏకంగా ఓ గోదాంపై దాడిచేసి పెద్ద ఎత్తున నకిలీ విత్తనాలను స్వాధీనం చేసుకున్నారు. మేడ్చల్‌ జిల్లా ఆర్టీసీ కాలనీలో నివాసం ఉంటున్న మెడిశెట్టి గోవింద్‌ అనే యువకుడు మొక్కజొన్నల మాటున హైదరాబాద్‌ నుంచి ఓ ఆటో ట్రాలీలో ఆసిఫాబాద్‌కు సోమవారం 800 నకిలీ పత్తి విత్తనాల ప్యాకెట్లు (నాలుగు క్వింటాళ్లు) రవాణా చేస్తుండగా బెల్లంపల్లి టూటౌన్‌ ఎస్సై వినోద్‌కుమార్‌ ఆటోట్రాలీని ఆపి తనిఖీ చేయడంతో నకిలీ విత్తనాల గుట్టు వెలుగుచూసిన సంగతి తెలిసిందే. వెంటనే నిందితుడు గోవింద్‌ను అదుపులోకి తీసుకుని విచారణ చేయగా కొన్ని విషయాలు వెల్లడించడంతో ఆ దిశగా పోలీసులు కేసు దర్యాప్తు ప్రారంభించారు. బెల్లంపల్లి ఏసీపీ బాలుజా దవ్‌ ఆదేశాల మేరకు  సోమవారం టూటౌన్‌ ఎస్సై పోలీసు బృందంతో ఆంధ్రప్రాంతానికి వెళ్లింది. గుంటూరు జిల్లా దాచేపల్లి మండలం నడికుడి గ్రామంలో ఉన్న ఓ జిన్నింగ్‌ మిల్లుపై బెల్లంపల్లి పోలీసులు ఆకస్మికంగా దాడి చేయగా, అక్కడ తయారు చేస్తున్న నకిలీ విత్తనాల ను చూసీ నిర్ఘాంతపోయారు. జిన్నింగ్‌ మిల్లు ను స్థావరంగా చేసుకుని పెద్ద ఎత్తున ఫ్యాకెట్లలో విత్తనాలు నింపి సీజ్‌ చేస్తుండగా నింది తులు అడ్డంగా పోలీసులకు  దొరికిపోయారు.

జిన్నింగ్‌ మిల్లు స్థావరంగా..
జిన్నింగు మిల్లును ప్రధాన స్థావరంగా చేసుకుని పెద్ద ఎత్తున నకిలీ బీజీ–3 పత్తి విత్తనాలను తయారు చేస్తుండటాన్ని బెల్లంపల్లి పోలీసుల బృందం కనిపెట్టింది. వెంటనే దాడి చేసి తయారీదారులను రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. జిన్నింగ్‌ మిల్లులో బస్తాల కొద్ది విత్తనాలను సిద్ధం చేసుకుని ప్యాకెట్లలో నింపడానికి సిద్ధంగా ఉంచిన, ప్యాకెట్లలో నింపుతున్న నకిలీ బీజీ–3 పత్తి విత్తనాలు 142 బస్తాలను (10 టన్నులు) స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ బహిరంగ మార్కెట్‌లో రూ.1.30 కోట్ల వరకు ఉంటుందని అంచనా వేశారు. నకిలీ పత్తి విత్తనాలు పట్టుబడిన వెంటనే అక్కడి ఏడీఏ రవికుమార్‌కు టూటౌన్‌ ఎస్సై వినోద్‌కుమార్‌ సమాచారం అందించి ఘటనాస్థలికి రప్పించారు. వెంటనే ఆ విత్తనాలను సీజ్‌ చేయించారు.

ప్రధాన సూత్రధారి మల్లికార్జున్‌రావు?
నకిలీ పత్తి విత్తనాలను ఆ ప్రాంతానికి చెందిన దొండపాటి మల్లికార్జునరావు అనే వ్యక్తి తయారు చేయిస్తున్నట్లు పోలీసులు పసిగట్టారు. వెంటనే అతడిని ఎంతో చాకచక్యంగా అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. మల్లికార్జునరావు  రహస్యంగా నకిలీ విత్తనాలను తయారు చేయించి, ఆ విత్తనాలను ప్యాకెట్లలో పొందుపర్చి బోల్‌గార్డ్‌ (బీజీ)–3  పేరుతో విక్రయిస్తున్నట్లు గుర్తించారు. అతడి నుంచి మరింత సమాచారం సేకరించే పనిలో పోలీసులు ఉన్నారు. నడికుడిలో తయారు చేసిన నకిలీ విత్తనాలను మల్లికార్జున్‌రావు ఎంతో నేర్పుగా ప్యాకెట్ల రూపంలో కుమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాలకు సరఫరా చేయడం గమనార్హం.  కొందరు స్థానికులు, ఆంధ్ర వలసవాదులు, ఈ ప్రాంత రైతులతో సంబంధాలు ఏర్పాటు చేసుకుని దందా చేస్తున్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. లోతుగా విచారణ జరిపితే మరిన్ని వాస్తవాలు వెలుగు చూడటంతోపాటు దందాలో భాగస్వాములెవరనేది బయటపడే అవకాశం ఉంది.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top