చింపాంజీలను అటాచ్‌ చేసిన ఈడీ!

Enforcement Directorate attaches chimpanzees, marmosets under PMLA - Sakshi

న్యూఢిల్లీ: ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) మూడు చింపాంజీలు, నాలుగు మార్మోసెట్ల (పొడవాటి తోక గల దక్షిణ అమెరికా కోతులు) ను అటాచ్‌చేసింది. ఈడీ చింపాంజీలను అటాచ్‌ చేయడమేంటి అనుకుంటున్నారా? మీరు చదివింది నిజమే. పశ్చిమ బెంగాల్‌కు చెందిన వన్యప్రాణి స్మగ్లర్‌పై మనీలాండరింగ్‌ కేసు దర్యాప్తులో భాగంగా వీటిని అటాచ్‌ చేసింది. స్మగ్లర్‌ ఇంటి నుంచి వాటిని కస్టమ్స్‌ అధికారులు స్వాధీనం చేసుకుని కోల్‌కతాలోని అలిపోర్‌ జంతుప్రదర్శన శాలలో ఉంచినట్లు కేంద్ర సంస్థ వెల్లడించింది. ఈ చింపాంజీలు సందర్శకులను ఆకర్షించడమే కాకుండా, జూకి ఒక మంచి ఆదాయ మార్గం అని చెప్పింది.

కాగా, కోతులను జంతు శాలలో ఉంచినట్లు తెలిపింది. ఈ విధంగా మనీ లాండరింగ్‌ చట్టంకింద జంతువులను అటాచ్‌ చేయడం మొదటి సారి అని ఈడీ పేర్కొంది. స్మగ్లర్‌ ఆ జంతువులను అక్రమంగా రవాణా చేసేందుకు ప్రయత్నించినట్లు ఆరోపించింది. మొత్తం ఏడు జంతువుల విలువ రూ.81 లక్షలు ఉంటుందని, ఒక్కో చింపాంజీ విలువ రూ.25 లక్షలు కాగా.. కోతుల విలువ రూ.1.5 లక్షలుంటుందని వెల్లడించింది. అడవి జంతువులను అక్రమంగా నిర్భంధించాడని స్మగ్లర్‌ సుప్రదీప్‌ గుహపై పశ్చిమ బెంగాల్‌ ప్రభుత్వం కేసు నమోదు చేసింది. గుహ ‘వ్యవస్థీకృత వన్యప్రాణుల అక్రమ రవాణా రాకెట్‌ను నడుపుతున్నట్లు తమ పరిశోధనలో వెల్లడైనట్లు ఈడీ తెలిపింది.  

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top