ఫోరెన్సిక్‌ డాక్టర్‌తో పోస్టుమార్టం చేయించండి | Do the Postmortem with forensic doctor | Sakshi
Sakshi News home page

ఫోరెన్సిక్‌ డాక్టర్‌తో పోస్టుమార్టం చేయించండి

Mar 3 2018 3:48 AM | Updated on Aug 31 2018 8:40 PM

Do the Postmortem with forensic doctor - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ, ఛత్తీస్‌గఢ్‌ సరిహద్దుల్లో శుక్రవారం జరిగిన ఎన్‌కౌంటర్‌కు సంబంధించి భద్రాచలానికి తీసుకొచ్చిన మృతదేహాలకు ఫోరెన్సిక్‌ డాక్టర్‌తో పోస్టుమార్టం నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ఈ పోస్టుమార్టం మొత్తాన్ని వీడియో తీయాలని, అనంతరం ఆ మృతదేహాలను మృతుల కుటుంబీకులకు అప్పగించాలని స్పష్టం చేసింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే) జస్టిస్‌ రమేశ్‌ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్‌ కొంగర విజయలక్ష్మితో కూడిన ధర్మాసనం శుక్రవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.

తొండపాల అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్‌కౌంటర్‌పై ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌) లేదా సీబీఐతో దర్యాప్తు జరిపించాలని, ఎన్‌కౌంటర్‌లో పాల్గొన్న పోలీసులపై ఐపీసీ సెక్షన్‌ 302 కింద కేసు నమోదు చేయడంతోపాటు మృతదేహాలను భద్రాచలం ఏరియా ఆసుపత్రి నుంచి వరంగల్‌ ఎంజీఎం లేదా ఉస్మానియా ఆసుపత్రికి తరలించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ పౌర హక్కుల కమిటీ అధ్యక్షుడు ప్రొఫెసర్‌ గడ్డం లక్ష్మణ్‌ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్‌) దాఖలు చేశారు. లంచ్‌మోషన్‌ రూపంలో అత్యవసరంగా దాఖలు చేసిన వ్యాజ్యంపై ఏసీజే నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది. పిటిషనర్‌ తరఫు న్యాయవాది వి.రఘునాథ్‌ వాదనలు వినిపించేందుకు సిద్ధమయ్యారు. మీ సమయంలో అదనపు అడ్వొకేట్‌ జనరల్‌ (ఏఏజీ) జె.రామచంద్రరావు జోక్యం చేసుకుంటూ, ఎన్‌కౌంటర్‌ జరిగిన ప్రాంతం ఛత్తీస్‌గఢ్‌ పరిధిలోకి వస్తుందని, ఈ వ్యవహారంలో జోక్యం చేసుకునే న్యాయ పరిధి ఈ హైకోర్టుకు లేదని వివరించారు.

ఎన్‌కౌంటర్‌లో మృతి చెందిన ఓ మావోయిస్టు, ఓ పోలీసు మృతదేహాలను భద్రాచలం తీసుకొచ్చారని రఘునాథ్‌ ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. మృతుల్లో ఇప్పటి వరకు ఇద్దరిని గుర్తించడం జరిగిందని, ఆ రెండు మృతదేహాలను ఛత్తీస్‌గఢ్‌ పోలీసుల విన్నపం మేరకు భద్రతా కారణాలరీత్యా పోస్టుమార్టం నిమిత్తం భద్రాచలం ఏరియా ఆసుపత్రికి తీసుకురావడం జరిగిందని రామచంద్రరావు వివరించారు. దీనికి ధర్మాసనం స్పందిస్తూ, భద్రాచలం ఈ హైకోర్టు న్యాయపరిధిలోకి వస్తుంది కాబట్టి, ఆ రెండు మృతదేహాల విషయంలో జోక్యం చేసుకునే పరిధి తమకు ఉందని స్పష్టం చేసింది. మృతుల్లో ఎంత మంది తెలంగాణ ప్రాంతానికి చెందిన వారు ఉన్నారని ధర్మాసనం ప్రశ్నించగా, హరిభూషణ్‌ తెలంగాణ వ్యక్తేనని రఘునాథ్‌ చెప్పారు. భద్రాచలం ఆసుపత్రిలో ఫోరెన్సిక్‌ డాక్టర్లు లేరని, అందుకే ఎంజీఎంకి తరలించాలని కోరుతున్నామన్నారు. భద్రాచలం ఆసుపత్రిలో అన్ని సౌకర్యాలున్నాయని, అందుకే ఆ మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం అక్కడకు తీసుకురావడం జరిగిందని అదనపు ఏజీ చెప్పారు. ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం, భద్రాచలం తీసుకొచ్చిన మృతదేహాలకు ఫోరెన్సిక్‌ డాక్టర్‌తో పోస్టుమార్టం చేయించాలని ఆదేశించింది. ఈ ప్రక్రియను వీడియో తీశాక, మృతదేహాలను వారి కుటుంబీకులకు అప్పగించాలని ఆదేశించింది. ఈ ఎన్‌కౌంటర్‌లో మరణించిన వారిలో ఎవరి మృతదేహాన్నైనా తెలంగాణ ప్రాంత పరిధిలోకి తీసుకొస్తే, ఆ మృతదేహాల విషయంలోనూ ఇదే ప్రక్రియను అనుసరించాలని ప్రభుత్వానికి తేల్చిచెప్పింది. తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement