ఉసురుతీసిన అప్పులు

Debts killed the farmers - Sakshi

రైతు దంపతుల ఆత్మహత్య

సాక్షి, జనగామ: అన్నం పెట్టే చేతులకు జీవం లేదు.. భూమినే నమ్ముకొని జీవనం సాగిస్తున్న ఆ రైతు దంపతుల గుండె ఆగిపోయింది. సాగు కోసం చేసిన అప్పులు చివరికి వారి ప్రాణాల మీదకు తెచ్చాయి. తడిసిమోపెడైన అప్పులను తీర్చలేమని మనోవేదనకు గురై సొంత వ్యవసాయ బావి వద్ద చెట్టుకు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు. పోలీసుల కథనం ప్రకారం.. జనగామ మండలం సిద్ధేంకి గ్రామానికి చెందిన ఆవుల నర్సిరెడ్డి(55), లక్ష్మి(51) దంపతులకు ఆరెకరాల వ్యవసాయ భూమి ఉంది. కూతుళ్ల పెళ్లి కోసం నాలుగెకరాల భూమిని అమ్ముకోగా ప్రస్తుతం రెండు ఎకరాల భూమిని సాగు చేస్తున్నారు.

పెట్టుబడి కోసం రూ. 10 లక్షల వరకు అప్పులు చేశారు. అయితే ఆశించిన పంట దిగుబడి రాకపోవడం.. మరోవైపు అప్పులు భారంగా మారడంతో నర్సిరెడ్డి, లక్ష్మీ దంపతులు తీవ్ర మనోవేదనకు గురయ్యారు. అప్పు తీర్చే మార్గం కానరాక గురువారం పొలం వద్దకు వెళ్లి చెట్టుకు ఉరి వేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం జనగామ ఏరియా ఆస్పత్రికి తరలించారు. పెద్దకుమార్తె స్వాతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కాగా, మృతదేహాలను పీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య సందర్శించి నివాళులర్పించారు. రైతు కుటుంబానికి ప్రభుత్వం రూ.20 లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని డిమాండ్‌ చేశారు. జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి మృతుల కుటుంబసభ్యులను పరామర్శించి అంతిమయాత్రలో పాల్గొన్నారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top