అనుష్క ఫొటో పెట్టి.. రూ.1.1 లక్షలు కాజేసి..

Cyber Criminals Cheat Young Man With Anushka Profile Photo - Sakshi

ఫేస్‌బుక్‌ ద్వారా ఎర వేసిన సైబర్‌ నేరగాళ్ళు

సైబర్‌ క్రైమ్‌ ఠాణాలో బాధితుడి ఫిర్యాదు

సాక్షి, సిటీబ్యూరో: సినీనటి అనుష్క ఫొటోను ఫేస్‌బుక్‌లో ప్రొఫైల్‌ పిక్చర్‌గా పెట్టిన సైబర్‌ నేరగాడు నగరానికి చెందిన యువకుడికి ఫ్రెండ్‌ రిక్వెస్‌ పంపించి రూ.1.1 లక్షలు కాజేశాడు. దీనిపై బాధితుడు మంగళవారం సిటీ సైబర్‌ క్రైమ్‌ ఠాణాలో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. నగరంలోని అశోక్‌నగర్‌ ప్రాంతానికి చెందిన ఓ యువకుడు బీటెక్‌ పూర్తి చేసి ప్రస్తుతం కాంపిటేటివ్‌ ఎగ్జామ్స్‌కు సిద్ధమవుతున్నాడు. ఇతడికి ఆరు నెలల క్రితం ఫేస్‌బుక్‌ ద్వారా ఫ్రెండ్‌ రిక్వెస్ట్‌ వచ్చింది.

యువతి పేరుతో, అనుష్క ఫొటో ప్రొఫైల్‌ పిక్చర్‌గా ఉండటంతో అతడు దాన్ని యాక్సెప్ట్‌ చేశాడు. ఆపై అవతలి వ్యక్తి యువతి మాదిరిగానే ఆరు నెలల పాటు చాటింగ్‌ చేశారు. ఆపై అసలు కథ ప్రారంభించి తన ఉద్యోగం పోయిందని, తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నానంటూ చాట్‌ చేసింది. దీనికి యువకుడు కరిగిపోవడంతో కాస్త డబ్బు సాయం చేయమంటూ ఒక్కో దఫా రూ.వెయ్యి నుంచి రూ.3 వేల వరకు పేటీఎం ద్వారా బదిలీ చేయించుకున్నారు. మొత్తం రూ.1.1 లక్షలు బదిలీ చేసిన యువకుడు కనీసం ఒక్కసారి కూడా యువతిగా చెప్పుకొన్న వారితో మాట్లాడలేదు. తన తల్లిదండ్రులు ఇచ్చిన పాకెట్‌ మనీ మొత్తం ఇచ్చేసి మోసపోయాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు ఇన్‌స్పెక్టర్‌ మధుసూదన్‌ దర్యాప్తు చేపట్టారు.   

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top