తుపాకీతో కాల్చుకున్న కానిస్టేబుల్‌

Constable shot himself with a gun - Sakshi

వ్యక్తిగత కారణాలా.. ప్రమోషన్‌లో జాప్యమా! 

కామారెడ్డి క్రైం: విధుల్లో ఉన్న ఓ కానిస్టేబుల్‌ తన వద్ద ఉన్న తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ ఘటన కామారెడ్డిలో శుక్రవారం సాయంత్రం కలకలం రేపింది. వరంగల్‌ జిల్లాకు చెందిన శ్రీనివాస్‌గౌడ్‌ కామారెడ్డిలో ఏఆర్‌ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నాడు. శుక్రవారం పాత తహసీల్దార్‌ కార్యాలయ భవనంలో ఉన్న ట్రెజరీ కార్యాలయ గార్డుగా విధులు నిర్వహిస్తున్నాడు. సాయంత్రం 7 గంటల సమయంలో తన వద్ద ఉన్న తుపాకీతో కాల్చుకున్నాడు. ఎడమ చంక కింది భాగంలో నుంచి బుల్లెట్‌ దూసుకువెళ్లింది. అతడిని వెంటనే ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఎస్పీ శ్వేత, డీఎస్పీ లక్ష్మీనారాయణ ఆసుపత్రి వద్దకు చేరుకున్నారు.

సహచర కానిస్టేబుళ్లు, శ్రీనివాస్‌గౌడ్‌ కుటుంబ సభ్యులతో ఎస్పీ మాట్లాడారు. జరిగిన ఘటనకు గల కారణాలపై ఆరా తీశారు. అనంతరం డీఎస్పీ విలేకరులతో మాట్లాడుతూ.. వ్యక్తిగత కారణాలతోనే కానిస్టేబుల్‌ తుపాకీతో ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడని తెలిపారు. పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌లోని యశోద ఆస్పత్రికి తరలించామన్నారు. కానిస్టేబుల్‌ ఆత్మహత్యాయత్నానికి ఎందుకు పాల్పడ్డాడో స్పష్టమైన కారణాలు తెలియాల్సి ఉందని డీఎస్పీ పేర్కొన్నారు. మొదట నిజామాబాద్‌ ఏఆర్‌ విభాగంలో పనిచేసిన శ్రీనివాస్‌గౌడ్‌.. జిల్లాల పునర్విభజనలో భాగంగా రెండున్నర యేళ్ల క్రితం కామారెడ్డికి వచ్చాడు. ప్రమోషన్‌ రావడంలో ఆలస్యం జరుగుతోందన్న మనస్తాపంతో అతడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడి ఉండవచ్చని చెబుతున్నారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top