తాగిన మైకంలో దారుణం | Conflicts With Wife And Murder | Sakshi
Sakshi News home page

తాగిన మైకంలో దారుణం

Mar 17 2018 11:39 AM | Updated on Jul 30 2018 8:41 PM

Conflicts With Wife And Murder  - Sakshi

సుజాత, భర్త వెంకటఅప్పన్నదొర ఇద్దరు కూతుళ్లు (ఫైల్‌ఫొటో) , సుజాత మృతదేహాన్ని పరిశీలిస్తున్న డీఎస్పీ రమణ తదితరులు

తాగిన మైకంలో వారు రాక్షసులుగా మారారు. ఒకర కట్టుకున్న భార్యను, మరొకరు సొంత బావమరిదిని  తలపై మోది హత్య చేశారు. చోడవరం మండలం కన్నంపాలెం గ్రామంలో భార్యను భర్త హత్య చేయగా, అనకాపల్లి మండలం రేబాక ఎస్సీ కాలనీలో బావను, బావమరిది కొట్టడంతో అతను చికిత్స పొందతూ మృతి చెందాడు

చోడవరం : నిద్రిస్తున్న భార్య తలపై మంచం కోడుతో కొట్టి ఓ వ్యక్తి హత్య చేశాడు. వివరాలు ఇలా ఉన్నాయి. కన్నంపాలెం గ్రా మానికి చెందిన బైన వెంకట అప్పన్న దొరకు పాయకరావుపేట మండలం నర్సాపురానికి చెందిన పలెల్ల వెంకటేశ్వరరావు కుమార్తె సుజాతకు ఏడేళ్లు క్రితం వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. నాలుగేళ్లుగా భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. ఎప్పటిలాగే గురువారం రాత్రి కూడా  వెంకట అప్పన్నదొర మద్యం సేవించి సుజాతను చితక బాదాడు. తరువాత బయటకు వెళ్లిపోయాడు. తిరిగి అర్ధరాత్రి ఇంటికి వచ్చి, నిద్రిస్తున్న సుజాత(33)తలపై మంచం కోడుతో తీవ్రంగా కొట్టాడు. దీంతో సుజాత అక్కడికక్కడే మృతి చెందింది. శుక్రవారం ఉదయం ఈ విషయం గ్రామంలోని వారికి తెలిసింది ఎంపీటీసీ బైన ఈశ్వరరావు పొలీసులకు ఫిర్యాదు చేసి, మృతురాలి తల్లి దండ్రులకు సమాచారం అందించారు. డీఎ స్పీ వెంకటరమణ, సీఐశ్రీనువాసరావు, ఎస్‌ఐ మల్లేశ్వరరావు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. సుజాతతండ్రి వెంకటేశ్వరరావు ఫిర్యా దు మేరకు కేసు నమోదు చేసి, భర్త వెంకటప్పన్నదొరను అరెస్టు చేసినట్టు ఎస్‌ఐ తెలిపారు. తల్లి మృతి చెందడంతో కుమార్తెలు సాయిపావని, రోహిణిలు తీవ్రంగా విలపించారు.  

తుమ్మపాల(అనకాపల్లి): అక్కాబావల గొడవలో కలుగుజేసుకుని, మద్యం మత్తులో బావమరిది దాడిచేయడంతో ఓ వ్యక్తి మృతి చెందాడు.  పోలీసుల కథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి. 15న ఎస్‌.కోటలో జరిగిన పండుగకు వెళ్లేందుకు  మండలంలో రేబాక గ్రామం ఎస్సీ కాలనీలో నివసిస్తున్న కొండమ్మ 14న సిద్ధమవుతుండగా, తాను వస్తానని ఆమె కొడుకు మారాం చేశాడు. అయితే ఆమె అంగీకరించలేదు. దీంతో తన తండ్రి పొట్నూరి అప్పారావు(35)కు చెప్పాడు. కొడుకును ఎస్‌.కోట తీసుకెళ్లవలసిందిగా కొండమ్మకు అప్పారావు సూచించాడు. అయితే ఆమె అంగీకరించలేదు. దీంతో కొండమ్మ, అప్పారావు మధ్య గొడవ జరిగింది.  భార్యపై అప్పారావు చేయిచేసుకున్నాడు.  వీరద్దరి మధ్య గొడవ పెరగడంతో  స్థానికులు, కొండమ్మ తల్లిదండ్రులు యర్రంశెట్టి అప్పారావు, వెంకయ్యమ్మలు వచ్చి సర్ది చెప్పారు. ఈ సమయంలో వచ్చిన మద్యం మత్తులో ఉన్న అప్పారావు బావమరిది రాము  కర్రతో తలపై బలంగా కొట్టి గాయపరిచాడు.  దీంతో తీవ్ర రక్తస్రావం జరిగింది. స్థానికులు  ఎన్టీఆర్‌ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో   కేజీహెచ్‌కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ అప్పారావు శుక్రవారం మృతి చెందాడు.   మృతుడి తండ్రి అప్పన్న అనకాపల్లి రూరల్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు.  మృతుడి బావమరిది యర్రంశెట్టి రాము, భార్య కొండమ్మ, అత్తమామలు యర్రంశెట్టి అప్పారావు, వెంకయ్యమ్మపై కేసు పెట్టాడు. రూరల్‌ ఎస్‌ఐ ఆదినారాయణరెడ్డి కేసు నమోదు చేసి, వివరాలు సేకరించారు. నిందితుడు రాము పరారీలో ఉన్నాడని, అతన్ని పట్టుకుని  రిమైండ్‌కు తరలిస్తామని ఎస్‌ఐ చెప్పారు.  అప్పారావు దంపతులకు కుమార్తె, కొడుకు ఉన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement