పింకీ! నీవెలా చనిపోయావో చెప్పమ్మా..

Chittoor Police Investigation Of Suspicious Death - Sakshi

హత్య కాదట.. ఆత్మహత్య కూడా కాదట!

పోలీసుల దర్యాప్తు పేలవం

పింకీ వెంట ఓ యువకుడు ప్రదక్షిణ?

సాక్షి, తొట్టంబేడు : అదృశ్యమైన బాలిక శవమైంది..చెత్తకుప్పల నడుమ కాలిపోయిన స్థితిలో మృతదేహం వెలుగులోకి వచ్చింది..సహజంగానే మృతిపై ఎన్నో అనుమానాలు..అయితే హత్య కాదు..అలాగనీ ఆత్మహత్యా కాదని ప్రాథమిక విచారణలో తేలిందని సీఐ బాలసుబ్రమణ్యం చెప్పడం మృతురాలి తల్లిదండ్రులు, బంధువులకు అంతులేని వేదనను మిగిల్చింది. మండలంలోని చిలకా మహాలక్ష్మి ఆలయం వెనుక ఉన్న డంపింగ్‌ యార్డులో ఉత్తరప్రదేశ్‌కు చెందిన బాలిక పింకీ (16) మృతదేహాన్ని కాలిపోయిన స్థితిలో శుక్రవారం గుర్తించడం స్థానికంగా సంచలనం సృష్టించడం విదితమే. పోస్టుమార్టం నిమిత్తం పింకీ మృతదేహాన్ని శ్రీకాళహస్తి ఏరియా ఆస్పత్రికి తరలించారు.


విలేకరులతో మాట్లాడుతున్న పింకీ తల్లిదండ్రులు శ్రీచంద్ర, బూరీ 

పోస్టుమార్టం నివేదిక అందకనే పోలీసులు మాత్రం పింకీది హత్య కాదు.. ఆత్మహత్య కాదని తేల్చడం గమనార్హం! బతుకుదెరువు కోసం రాష్ట్రం కాని రాష్ట్రం, ఊరుకాని ఊరువచ్చిన కుటుంబానికి కుమార్తె అనుమానాస్పద మృతి అంతులేని దుఃఖాన్ని మిగిల్చింది. మృతురాలి తల్లిదండ్రులు, స్థానికులు మాత్రం పింకీది హత్యేనని తెగేసి చెబుతుండగా, పోలీసులు దీనికి భిన్నంగా చెప్పడం అనుమానాలకు తావిస్తోంది. పోలీసులు సక్రమంగా దర్యాప్తు చేయడం లేదని వాపోతున్నారు. ఇప్పుడే వస్తానంటూ తన అన్న రింకూకు చెప్పి గురువారం మధ్యాహ్నం 12.30 గంటల సమయంలో వెళ్లిన పింకీ శవమై వెలుగులోకి రావడం తెలిసిందే. వాస్తవానికి పోలీస్‌ జాగిలం డంపింగ్‌ యార్డులోని పింకీ మృతదేహం నుంచి కొంతదూరంలోని ఓ గోదాము వద్దకు వెళ్లి ఆగిపోయింది.

వివిధ కోణాల్లో పోలీసులు దర్యాపు చేయకుండా ఏకంగా పింకీది హత్య, ఆత్మహత్య కాదని చెప్పడం దారుణమని పింకీ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఈ రెండూ కానప్పుడు హత్య, ఆత్మహత్య కాకుంటే మరేమిటని తల్లిదండ్రులు కన్నీరు మున్నీరవుతున్నారు. పోలీస్‌ ఉన్నతాధికారులు నిష్పక్షపాతంగా, సమగ్ర దర్యాప్తు చేయాలని వేడుకుంటున్నారు. ఏడాదిగా పింకీ వెంట ఓ యువకుడు తిరుగుతున్నాడని స్థానికులు, కుటుంబ సభ్యులు చెబుతున్నారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top