
అదృశ్యమైన బాలుడు అంకిత్
సీసీ ఫుటేజీలు పరిశీలిస్తున్న పోలీసులు
బంజారాహిల్స్: ఖైరతాబాద్ సమీపంలోని చింతల్‌బస్తీలో నివసించే అయిదేళ్ళ బాలుడు ఎస్. అంకిత్‌కుమార్‌ను ఓ యువకుడు కిడ్నాప్ చేసి ఆటోలో తీసుకెళ్ళాడు. దీంతో చింతల్‌బస్తీలో విషాదఛాయలు అలుముకున్నాయి. వివరాలు.. చింతల్‌బస్తీలో నివసించే రంజిత్‌కుమార్–అపర్ణ దంపతుల కుమారుడు అంకిత్ స్థానిక రేడియంట్ స్కూల్‌లో ఎల్‌కేజీ చదువుతున్నాడు. ఈ నెల 20న అమ్మమ్మ ఈశ్వరమ్మ మనవడు అంకిత్‌తో కలిసి మెహిదీపట్నం రైతు బజార్‌కు కూరగాయలకు వెళ్ళింది. సాయంత్రం 5.30 గంటల ప్రాంతంలో కూరగాయలు తీసుకున్న తర్వాత మనవడికి సోడా తాగిద్దామని బయటకు రోడ్డు పక్కన ఆగింది. అదే సమయంలో ఓ యువకుడు అక్కడికి వచ్చి నమస్తే అమ్మా..! అంటూ పరిచయం చేసుకున్నాడు. నువ్వు ఫలానా టెంటుహౌజ్ అంకుల్ భార్యవు కదా అంటూ అడిగాడు. దాంతో ఆమె అవునని చెబుతుండగానే మనవడు టాయ్‌లెట్ వస్తుందంటూ పక్కకు వెళ్ళి మూత్ర విసర్జన చేస్తున్నాడు.
ఒక వైపు ఆ యువకుడు మాట్లాడుతూనే ఆమె తేరుకునేలోపు సిద్ధంగా ఉంచిన ఆటోలో అంకిత్‌ను ఎక్కించుకొని పరారయ్యాడు. ఈ ఘటనతో ఆమె షాక్‌కు గురైంది. కుటుంబ సభ్యులకు సమాచారం అందించగా హుటాహుటిన అంతా అక్కడికి చేరుకొని చుట్టుపక్కల గాలించారు. ఫలితం లేకపోవడంతో స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి సీసీ ఫుటేజీలను పరిశీలించారు. ఓ యువకుడు ఆటోలో అంకిత్‌ను ఎక్కించుకొని పరారవుతున్న దృశ్యాలు సీసీ ఫుటేజీలో కనిపించాయి. వారం రోజుల నుంచి తల్లిదండ్రులతో పాటు పోలీసులు బాలుడి కోసం అణువణువు గాలిస్తున్నారు. ఇంత వరకు ఆచూకీ దొరకలేదని బాధితులు వాపోయారు. బాలుడిని కిడ్నాప్ చేసిన వ్యక్తి బంజారాహిల్స్ ప్రాంతానికి చెందిన వాడై ఉంటాడని బాధితులు అనుమానిస్తున్నారు. తెలిసిన వ్యక్తే తమను అనుసరిస్తూ పక్కా ప్రణాళిక ప్రకారం కిడ్నాప్‌చేసి ఉంటాడని పేర్కొన్నారు. ఆచూకి తెలిసిన వారు 7337420266 నంబర్‌లో సంప్రదించాలని కోరారు.