ఇద్దరు పసివాళ్ల మృత్యువాత

Child Deaths In Ummidivaram East Godavari - Sakshi

మాయ రోగాలు ఆ ముక్కుపచ్చలారని పసికందులను బలితీసుకున్నాయి. కన్నవారికి గర్భశోకాన్ని మిగిల్చాయి. పుట్టిన రెండు నెలలకే పిల్లలు కన్నుమూయడంతో ఆ చిన్నారుల తల్లిదండ్రులు తల్లడిల్లిపోతున్నారు. 

సాక్షి, వీఆర్‌ పురం (తూర్పు గోదావరి): రెండురోజుల వ్యవధిలో ఇద్దరు పసికందులు మృతి చెందిన ఘటన మండలంలోని ఉమ్మిడివరం గ్రామంలో చోటు చేసుకొంది. గ్రామానికి చెందిన కురసం రవి, మంగవేణి దంపతులకు చెందిన రెండు నెలల బాబు అనారోగ్యంతో ఆదివారం మృతి చెందగా.. అదే గ్రామానికి చెందిన కుర్సం నాగరాజు, అశ్వని దంపతులకు చెందిన రెండు నెలల బాబు కూడా అనారోగ్యంతో సోమవారం ఉదయం మృతి చెందాడు. దీంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఈ విషయమై రేఖపల్లి పీహెచ్‌సీ మెడికల్‌ ఆఫీసర్‌ డాక్టర్‌  సుందర్‌ప్రసాద్‌ను వివరణ కోరగా.. మంగవేణికి మే నెలలో స్థానిక పీహెచ్‌సీలో కాన్పు జరిగిందన్నారు.

గత నెల 29వతేదీ తెల్లవారు జామున బాబు అనారోగ్యంగా ఉన్నాడని ఆస్పత్రికి తీసురావడంతో పరీక్షించగా గుండె నిమ్ముతో బాధపడుతున్నట్టు నిర్ధారణ కావడంతో భద్రాచలం ఆసుపత్రికి రిఫర్‌ చేశామన్నారు. అక్కడ ఏరియా ఆస్పత్రి వైద్యులు బాబుకు మెరుగైన చికిత్స అవసరం, వరంగల్‌ తరలించాలని చెప్పినా శిశువు తల్లిదండ్రులు మాత్రం అక్కడే వైద్యం అందించాలని కోరారన్నారు. ఈ క్రమంలో ఆ శిశువు ఆదివారం మృతి చెందాడన్నారు. అలాగే అదే గ్రామానికి చెందిన కురసం నాగరాజు అశ్వని దంపతులకు చెందిన రెండు నెలల బాబు నాలుగైదు రోజుల నుంచి విరేచనం కాక ఇబ్బంది పడుతున్నారన్నారు.

ఆ శిశువును గత శనివారం రేఖపల్లి పీహెచ్‌కి తీసుకురాగా అతడికి చికిత్స చేస్తే విరేచనం అయిందని చెప్పారు. శిశువుకు మెరుగైన వైద్యం అందించాలని చింతూరు ఆస్పత్రికి తీసుకెళ్లాలని చెప్పినా ఆ దంపతులు పట్టించుకోకుండా ఇంటికి తీసుకువెళ్లారన్నారు. ఆ శిశువు సోమవారం మృతి చెందాడని పేర్కొన్నారు. కాగా శిశువుల మృతితో తల్లడిల్లుతున్న తల్లిదండ్రులను వైఎస్సార్‌ సీపీ రాష్ట్ర నాయకులు మాచర్ల గంగులు, ఇతర నాయకులు బొడ్డు సత్యనారాయణ మాచర్ల వెంగళరావు, పిట్టా రామారావు, కడుపు రమేష్, చీమల కాంతారావు  పరామర్శించారు.

బాధిత కుటుంబాలకు ఏపీ చైల్డ్‌ రైట్స్‌ కమిషన్‌ సభ్యుడి పరామర్శ
ఉమ్మిడివరం గ్రామంలో రెండురోజుల వ్యవధిలో రెండు శిశు మరణాలు చోటు చేసుకున్న నేపథ్యంలో ఏపీ చైల్డ్‌ రైట్స్‌ కమిషన్‌ సభ్యుడు వి.గాంధీబాబు, ఐసీడీఎస్‌ పీడీ సుఖజీవన్‌బాబు సోమవారం బాధిత కుటుంబసభ్యులను పరామర్శించి జరిగిన ఘటనపై  విచారణ చేపట్టారు. మృతి చెందిన శిశువుల, తల్లుల ఆరోగ్య విషయాలపై ఆరా తీశారు. ఆశాకార్యకర్త చేసిన విజిట్స్‌పై, అంగన్‌వాడీ కేంద్రం ద్వారా అందించిన పోషకాహారాలపై వివరాలను సేకరించి నమోదు చేసుకున్నారు. ఏయే సమయాల్లో ఏయే ఆస్పత్రుల్లో చికిత్సలు పొందిందీ అడిగి తెలుసుకున్నారు. శిశు మరణాల విషయమై ఇంకా విచారణ చేపట్టాల్సి ఉందన్నారు. కార్యక్రమంలో సీడీపీఓ శంషాద్‌బేగం ఉన్నారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top