న్యాయం చేయండి.. లేకపోతే దూకుతా

Cheated Woman Demand Justice  - Sakshi

ప్రేమికుడు మోసం చేశాడంటూ ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించిన మహిళ

వాటర్‌ ట్యాంక్‌ ఎక్కి హల్‌చల్‌..

ఏఎస్పీ జోక్యంతో కిందకు దిగిన బాధితురాలు

సాలూరు : ప్రేమించానని.. పెళ్లి చేసుకుంటానని నమ్మించి.. శారీకంగా అనుభవించి ఇప్పుడేమో పెళ్లి చేసుకోకుండా తప్పించుకోవాలని చూస్తున్న యువకుడితో వివాహం జరిపించాలని డిమాండ్‌ చేస్తూ ఓ మహిళ వాటర్‌ట్యాంక్‌ ఎక్కి హల్‌చల్‌ చేసిన సంఘటన సాలూరు మండలం మజ్జలపేటలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. మండలంలోని మావుడి గ్రామానికి చెందిన పెదపల్లి కృష్ణవేణి సాలూరు పట్టణంలోని మజ్జలపేట తాగునీటి రిజర్వాయర్‌పైకి గురువారం ఉదయం ఎక్కి ఆత్మహత్యాయత్నానికి సిద్ధపడింది. విషయం తెలుసుకున్న పట్టణ, రూరల్‌ ఎస్సైలు ఫకృద్దీన్, గణేష్‌తో పాటు అగ్నిమాపకాధికారి నోమేశ్వరరావు కూడా సిబ్బందితో కలిసి సంఘటనా స్థలానికి చేరుకున్నారు.

కిందకు దిగాలని నచ్చజెప్పేందుకు ప్రయత్నించినా ఆమె తనకు చావే శరణ్యమని, తనను మోసగించిన యువకుడితో వివాహం చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటానని స్పష్టం చేసింది.  దీంతో పట్టణ ఎస్సై సమాచారాన్ని ఏఎస్పీ దీపికా పాటిల్‌కు ఫోన్‌లో సమాచారం అందించారు. ఆమె ఫోన్‌లో నేరుగా బాధిత మహిళతో మాట్లాడుతూ, ఆ యువకుడితో వివాహం చేయిస్తానని హామీ ఇవ్వడంతో బాధితురాలు కిందకు దిగింది. వెంటనే ఆమెను   పట్టణ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. కొద్దిసేపటికే పార్వతీపురం నుంచి పట్టణ పోలీస్‌స్టేషన్‌కు చేరుకున్న ఏఎస్పీ బాధిత మహిళకు కౌన్సెలింగ్‌ చేశారు.

మోసం చేయాలని చూస్తున్నాడు
వాటర్‌ ట్యాంకు నుంచి కిందకు దిగిన అనంతరం కృష్ణవేణి మాట్లాడుతూ, తనకు ఇదివరకే వివాహమై ఒక కుమారుడు కూడా ఉన్నాడన్నారు. అయితే వారితో వేరుపడి జీవిస్తున్నానని, ఈ నేపథ్యంలో తాను హైదరాబాద్‌లో ప్రైవేటు ఉద్యోగం చేసుకునేందుకు వెళ్తుండగా.. విశాఖ బస్టాండ్‌లో శ్రీకాకుళం జిల్లా టెక్కలి మండలం సీతాపురం గ్రామానికి చెందిన దుంపల అప్పారావుతో పరిచయం ఏర్పడిందని తెలిపారు. తనను ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకుంటానని చెప్పి శరీరకంగా దగ్గరవడమే కాకుండా అతని ఇంటికి కూడా తీసుకువెళ్లాడని చెప్పింది. అలాగే తన ఇంటికి కూడా వారి కుటుంబ సభ్యులు వచ్చి వెళ్లేవారని తెలిపింది.

అయితే కొంతకాలంగా తనను దూరంపెడుతున్నారని, పెళ్లి చేసుకోవాలంటే రూ. 5 లక్షల కట్నం, 2 ఎకరాల భూమి ఇవ్వాలని డిమాండ్‌ చేస్తున్నారని వాపోయింది. దీంతో తనకు న్యాయం చేయాలని ఆరు రోజుల కిందట రూరల్‌ పోలీస్టేషన్‌లో ఫిర్యాదు చేశానని తెలిపింది. పోలీసులు వారికే వత్తాసు పలుకుతున్నారే తప్ప తనకు న్యాయం చేయడం లేదని ఆరోపించింది. అందుకే ఆత్మహత్య చేసుకుందామని నిర్ణయించుకుని వాటర్‌ ట్యాంక్‌ ఎక్కానని వివరించింది.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top