పసిమొగ్గలపై పైశాచికం

CBI takes over probe into Muzaffarpur shelter home case - Sakshi

బాలికలకు మత్తు మందిచ్చి రేప్‌

గర్భం దాల్చితే అబార్షన్లు చేసేందుకు ప్రత్యేక ఏర్పాట్లు

న్యూఢిల్లీ: బిహార్‌లోని ముజఫర్‌పూర్‌లో ఓ అనాథ శరణాలయంలో 34 మంది మైనర్‌ బాలికలపై నిర్వాహకులు లైంగికదాడికి పాల్పడిన దేశవ్యాప్తంగా కలకలం రేపిన సంగతి తెలిసిందే. ముంబైకి చెందిన టాటా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫండమెంటల్‌ సైన్సెస్‌(టిస్‌) చేపట్టిన సోషల్‌ ఆడిట్‌తో ఈ దారుణం బయటపడింది. ముజఫర్‌పూర్‌కు చెందిన బ్రజేష్‌ ఠాకూర్‌కు చెందిన సంకల్ప్‌ ఏవం సమితి అనే ఎన్జీవోకు 2013, అక్టోబర్‌ 21న ఈ అనాధాశ్రమ నిర్వహణకు సాంఘిక సంక్షేమ శాఖ అనుమతి ఇచ్చింది.

దీంతో నవంబర్‌ 1న ఇది పనిచేయడం ప్రారంభించింది. గతేడాది బిహార్‌ అంతటా ఉన్న 115 ప్రభుత్వ అనాధాశ్రమాల(షెల్టర్‌ హోమ్స్‌) స్థితిగతులపై టిస్‌ తనిఖీలు చేపట్టింది. ఇందుకు సంబంధించిన నివేదికను 2018, ఏప్రిల్‌లో ప్రభుత్వానికి సమర్పించింది. నివేదికలో బ్రజేష్‌ ఠాకూర్‌ బాలికలపై లైంగికదాడికి పాల్పడినట్లు తేలడంతో సాంఘిక సంక్షేమశాఖ డిప్యూటీ డైరెక్టర్‌ దివేశ్‌ కుమార్‌ అతడిపై మే 31న ముజఫర్‌పూర్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటన వెలుగులోకి వచ్చిన సమయంలో ఈ ఆశ్రమంలో 44 మంది బాలికలు ఉన్నారు.

రహస్య మెట్ల దారులు.. అబార్షన్‌ గది
పోలీసులు అనాధాశ్రమంలో తనిఖీలు చేపట్టడంతో విస్తుపోయే వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. ఆశ్రమం నుంచి నిర్వాహకుడు బ్రజేష్‌ ఇంటికి నేరుగా మూడు మెట్ల మార్గాలు ఉండటాన్ని పోలీసులు కనుగొన్నారు. బాలికలపై అత్యాచారానికి పాల్పడేందుకు వచ్చే దుండగులు ఎవ్వరికీ కన్పించకుండా రహస్యంగా వచ్చేందుకు ఈ ఏర్పాటు చేసుంటారని అనుమానిస్తున్నారు. అలాగే ఇక్కడి బేస్‌మెంట్‌లో మత్తుమందుల్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దుండుగులు గర్భం దాల్చిన నలుగురు బాలికలకు ఇక్కడే అబార్షన్‌ చేశారని పోలీస్‌ ఉన్నతాధాకారి ఒకరు తెలిపారు.

వణికిస్తున్న బాధితుల వాంగ్మూలాలు
మైనర్‌ బాలికలు కోర్టుకు ఇచ్చిన వాంగ్మూలాలు ఒళ్లు గగుర్పొడిచేలా ఉన్నాయి. బ్రజేష్, అతని స్నేహితులు భోజనంలో మత్తుమందు కలిపి ఇచ్చి తమపై లైంగికదాడికి పాల్పడేవారని ఓ బాలిక(10) తెలిపింది. ఎదురు తిరిగిన అమ్మాయిల్ని తీవ్రంగా కొట్టి, అన్నం పెట్టకుండా, సిగరెట్లతో కాల్చేవారంది. ప్రతీరోజు తమపై ఈ దారుణం కొనసాగేదని, ఇది తట్టుకోలేని మరో బాలిక గాజు ముక్కతో మణికట్టు కోసుకుని ఆత్మహత్యాయత్నం చేసిం దని పేర్కొంది. తమను రోజూ నగ్నంగా పడుకోమని ఒత్తిడి చేసేవారనీ, ఒప్పుకోకుంటే తీవ్రంగా కొట్టేవారని ముందు వాపోయింది. ఈ నీచుల దాడిలో ఓ అమ్మాయి చనిపోతే.. మృతదేహాన్ని గుట్టుచప్పుడు కాకుండా రిక్షాలో తీసుకెళ్లి ఎక్కడో పడేసి వచ్చారని చెప్పింది. మరోవైపు 34 మంది బాలికలపై లైంగికదాడి జరిగిందని పరీక్షలు నిర్వహించిన పట్నా వైద్య కళాశాల డాక్టర్లు ధ్రువీకరించారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top