1705 బెల్ట్‌ దుకాణాలపై కేసులు

Cases On 1705 Belt Shops - Sakshi

విజయనగరం రూరల్‌ : ఏడాది కాలంలో ప్రొహిబిషన్‌ అండ్‌ ఎక్సైజ్‌ శాఖ అధికారులు జిల్లా వ్యాప్తంగా 1705 బెల్ట్‌ దుకాణాలపై కేసులు నమోదు చేశారని జిల్లా ప్రొహిబిషన్‌ అండ్‌ ఎక్సైజ్‌శాఖ డిప్యూటీ కమిషనర్‌ పి.సురేంద్రప్రసాద్‌ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. గతేడాది జూలై 1నుంచి 2018 జూన్‌ 30 వరకు జిల్లాలోని 13 ఎక్సైజ్‌ స్టేషన్ల పరిధిలో 1705 బెల్ట్‌ దుకాణాలపై కేసులు నమోదు చేసి 1726 మందిపై కేసులు నమోదు చేసినట్లు చెప్పారు.

 నిందితుల నుంచి 6759 లీటర్ల మద్యాన్ని, 995 లీటర్ల బీరును స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. బెల్ట్‌ దుకాణాలకు మద్యం తరలిస్తున్న 21 లైసెన్స్‌డ్‌ మద్యం దుకాణాలను గుర్తించి శాఖపరమైన చర్యలు తీసుకున్నామన్నారు. నిబంధనలకు విరుద్ధంగా బ్రాండ్‌ మిక్సింగ్, చిల్లర అమ్మకాలు చేపడుతున్న 10 మద్యం దుకాణాలపై కేసులు నమోదు చేసి, ఒక్కో దుకాణదారుడికి రూ. లక్ష  అపరాధ రుసుం విధించామన్నారు.

ఎంఆర్‌పీకి మించి అమ్మకాలు చేపడుతున్న రెండు మద్యం దుకాణాల లైసెన్స్‌ రద్దు చేసి లక్ష రూపాయల చొప్పున అపరాధ రుసుం విధించామన్నారు. 98 మద్యం దుకాణాల్లో సాంకేతిక పరమైన సమస్యలు గుర్తించి 98 మందిపై కేసులు నమోదు చేశామని తెలిపారు. నవోదయం కార్యాక్రమంలో భాగంగా నాటుసారా తయారీ, రవాణా, విక్రయాలు సాగిస్తున్న గ్రామాల్లో469 మందిని అరెస్ట్‌ చేసి 511 కేసులు నమోదు చేసినట్లు తెలిపారు.

వీరి నుంచి 12,286 లీటర్ల సారాతో పాటు తయారీకి ఉపయోగించే 58, 095 లీటర్ల బెల్లం ఊటను స్వాధీనం చేసుకుని ధ్వంసం చేశామన్నారు. అలాగే నాటుసారా రవాణాకు ఉపయోగించిన 90 వాహనాలను సీజ్‌ చేసినట్లు తెలిపారు. 80 గ్రామాల్లో నవోదయం కార్యక్రమంలో భాగంగా బైండోవర్‌ కేసులు పెట్టి గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించామన్నారు.

అలాగే జిల్లాలో గంజాయి సాగులేకున్నా తనిఖీల ద్వారా ఏడు కేసులు నమోదు చేసి అక్రమంగా గంజాయి తరలిస్తున్న 11 మందిని అరెస్ట్‌ చేయడంతో పాటు రెండు వాహనాలు, 47.3 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నామన్నారు. బెల్ట్‌ దుకాణాల నిర్మూలన, నాటుసారా తయారీ, రవాణా, కేసుల నమోదుపై 13 ఎక్సైజ్‌ స్టేషన్ల పరిధిలో ప్రతి నెలా రెండో శనివారం అవగాహన ర్యాలీలు నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top