మరో వ్యాపారి ఆత్మహత్య

Business Man Commits Suicide In Kamareddy - Sakshi

ఫైనాన్స్‌ వేధింపులే కారమంటూ సూసైడ్‌నోట్‌

కామారెడ్డి క్రైం: ఫైనాన్స్‌ భూతం మరో వ్యాపారిని పొట్టనపెట్టుకుంది. రావాల్సిన డబ్బులు సకాలంలో రాకపోవడం, ఫైనాన్స్‌ నిర్వాహకుల వేధింపులు పెరిగి పోవడంతో ఓ వ్యాపారి ఆత్మహత్య చేసుకున్నాడు. కామారెడ్డి శివారులోని కల్కినగర్‌ కాలనీలో బుధవారం రాత్రి చోటు చేసుకుందీ ఘటన. మెదక్‌ జిల్లా ఖాజాపూర్‌ గ్రామానికి చెందిన బొమ్మ నాగరాజు (40) పదిహేనేళ్ల క్రితం కామారెడ్డికి వచ్చి స్థిరపడ్డాడు. ఆయనకు భార్య రాజేశ్వరి, కుమారుడు శివగౌతమ్, కుమార్తె స్నేహ ఉన్నారు. శనివారం నాగరాజు పెళ్లి రోజు కావడంతో షాపింగ్‌ కోసం కుటుంబ సభ్యులను బుధవారం పట్టణంలోని ఓ వస్త్ర దుకాణానికి తీసుకెళ్లాడు. షాప్‌ ఎదుట ఫైనాన్స్‌ వ్యాపారి వినోద్‌ కలిసి అతడ్ని డబ్బులు అడిగినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. అక్కడి నుంచి వెళ్లి పోయిన నాగరాజు కుటుంబ సభ్యులను ఇంటికి తీసుకెళ్లేందుకు రాలేదు. ఫోన్‌ చేస్తే వస్తున్నాని చెప్పి పెట్టేశాడు. రాత్రి 9 గంటల సమయంలో భార్య, పిల్లలు ఇంటికి వెళ్లి చూడగా, ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించాడు. తన చావుకు ఫైనాన్షియర్ల వేధింపులే కారణమని సూసైడ్‌ నోట్‌ రాసి ఆత్మహత్య చేసుకున్నాడు. 

ఫైనాన్షియర్ల వేధింపులతోనే..
నాగరాజు ఓ శీతల పానీయాల కంపెనీకి సంబంధించి మాచారెడ్డి మండలానికి డిస్ట్రిబ్యూటర్‌గా పని చేసే వాడు. ఏడాది క్రితం కంపెనీ ప్రతినిధులు గోపాలకృష్ణ, బీఎన్‌ఎస్‌ రావు అతని డీలర్‌షిప్‌ను తొలగించారు. ఎన్నిసార్లు వారిని సంప్రదించినా వాయిదాలు వేయడమే తప్ప డీలర్‌షిప్‌ పునరుద్ధరించలేదు. వ్యాపారం చేస్తున్న కాలంలో పెట్టుబడి కోసం అతడు ఫైనాన్స్‌ల్లో అప్పు తీసుకున్నాడు. ఎనిమిదేళ్లుగా ప్రతి నెలా వడ్డీ కడుతున్నాడు. ఈ క్రమంలో రూ.10 లక్షలు అప్పులయ్యాయి. మరోవైపు ఫైనాన్షియర్ల వేధింపులు ఎక్కువయ్యాయి. దీంతో మనస్తాపం చెందిన అతడు ఆత్మహత్య చేసుకున్నాడు. పట్టణంలోని రామకృష్ణ మెడికల్‌ యజమాని మాధవ్, ఫైనాన్స్‌ వ్యాపారులు వినోద్, నరేశ్, శేఖర్‌ డబ్బుల కోసం వేధించడంతోనే తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్లు సూసైడ్‌ నోట్‌లో పేర్కొన్నాడు. 8 ఏళ్లుగా ప్రతి నెలా క్రమం తప్పకుండా వడ్డీ కట్టానని, కొంత సమయం ఇస్తే అప్పు తీర్చేస్తానని ఎంతగా వేడుకున్నా ఎవరూ కనికరం చూపలేదన్నారు. అప్పులు ఇచ్చిన వారు ఇంటి దగ్గరకు వచ్చి దుర్భాషలాడుతున్నారని, అందుకే మనస్తాపంతో ఆత్మహత్య చేసుకుంటున్నట్లు నోట్‌లో రాశాడు.

కుటుంబంతో కలిసి పెళ్లిరోజును సంతోషంగా జరుకోవాల్సిన నాగరాజు ఆత్మహత్య చేసుకోవడంతో వారి కుటుంబం విషాదంలో మునిగి పోయింది. కామారెడ్డి రూరల్‌ సీఐ భిక్షపతి, ఎస్‌ఐ సంతోష్‌కుమార్‌లు ఘటనా స్థలాన్ని పరిశీలించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఏరియా ఆస్పత్రికి తరలించారు. మృతుని భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top