రోడ్డు ప్రమాదంలో అన్నాచెల్లెళ్ల దుర్మరణం

Brother And Sister Deceased in Car Accident Srikakulam - Sakshi

ఆగి ఉన్న లారీని ఢీకొన్న కారు

ఘటనలో మరో ఇద్దరికి తీవ్ర గాయాలు   

శ్రీకాకుళం, రణస్థలం: సోమవారం తూరుపు తెల్లారకముందే ఇద్దరి జీవితాలు తెల్లారిపోయాయి. టైర్‌ పంక్చర్‌ అయ్యిందని ఓ డ్రైవర్‌ లారీని నిర్లక్ష్యంగా రోడ్డు పక్కన రోజుల తరబడి నిలిపివేస్తే.. మరో డ్రైవర్‌ అంతకంటే నిర్లక్ష్యంతో అతివేగంగా బండి నడుపుతూ ఆగి ఉన్న లారీని ఢీకొన్నాడు. వీరిద్దరి అలసత్వం కారణంగా రెండు ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. రణస్థలం మండలం కోష్ట వద్ద సోమవారం తెల్లవారుజామున జరిగిన ఈ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారిని మందస మండలం చిన్న నారాయణపురానికి చెందిన మడియా ఢిల్లీశ్వరరావు(22), మడియా వసంత(20)గా గుర్తించారు. ఈ ఘటనలోనే డ్రైవర్‌ మూర్తి, పాప కుసుమ(8)లకు తీవ్ర గాయాలయ్యాయి. జేఆర్‌ పురం పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల మేరకు..

 రోడ్డుపై నిలిపి ఉన్న లారీని ఢీకొన్న కారు 
చిన్న నారాయణపురానికి చెందిన ఢిల్లీశ్వరరావు, వసంతలు వరుసకు అన్నాచెల్లెళ్లు. వీరు డిగ్రీ, డైట్‌ పూర్తి చేసి వేసవిలో శిక్షణ తీసుకుందామని విశాఖలోని మేనమామ తులసీదాస్‌ ఇంటికి వెళ్లారు. ఇంతలో లాక్‌డౌన్‌ ప్రకటించడంతో చాలా రోజులు అక్కడే ఉండిపోవాల్సి వచ్చింది. రెండు రోజుల ముందే ఇంటికి వద్దామని అక్కడి సిటీ కమిషనర్‌ అనుమతి తీసుకున్నారు. అన్నాచెల్లెళ్లతో పాటు మేనమామ కూతురు కుసుమ కూడా బయల్దేరింది. సోమవారం ఉదయం 3.30 గంటల సమయంలో డ్రైవర్‌ వీరిని తీసుకుని కారులో మందస మండలానికి పయనమయ్యారు. రణస్థలం మండలం కోష్ట గ్రామానికి సమీపానికి వచ్చేసరికి.. జాతీయ రహదారిపై రోడ్డు పక్కన ఆపి ఉన్న లారీని వీరి కారు అతివేగంగా వచ్చి బలంగా ఢీకొంది. దీంతో వెనుక సీటులో ఉన్న ఢిల్లీశ్వరరావు, వసంతలు అక్కడికక్కడే మృతి చెందారు. ముందుసీట్లలో ఉన్న డ్రైవర్‌ మూర్తి, కుసుమలకు తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదాన్ని గుర్తించిన స్థానికులు మేమున్నాం సేవా సంస్థ అంబులెన్స్‌లో క్షతగాత్రులను శ్రీకాకుళం రిమ్స్‌కు తరలించారు. జేఆర్‌పురం ఎస్‌ఐ ఇ.శ్రీనివాస్‌ ఘటనా స్థలాన్ని పరిశీలించి మృతదేహాలకు రిమ్స్‌లోనే శవ పంచనామా చేయించారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఆయన తెలిపారు.  

చిన్ననారాయణపురంలో విషాద ఛాయలు
మందస: మండలంలోని చిన్ననారాయణపురానికి చెందిన మడియా పాపారావు కుమారుడు ఢిల్లీశ్వరరావు, మడియా త్రినాథ్‌ కుమార్తె వసంతలు రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నా యి. పాపారావు, త్రినాథ్‌ అన్నదమ్ములు. ఉన్న త ఉద్యోగాలు చేసి కుటుంబాలకు అండగా నిలబడతారని అనుకుంటే ఇలా యుక్త వయసులో నే వదిలేసి వెళ్లిపోయారని కుటుంబ సభ్యులు రోదించారు. వసంత తల్లిదండ్రులు బెంగళూరులో ఉండడంతో సమాచారం వారికి చేరవేశారు. అక్కడి పోలీసుల నుంచి అనుమతి లభించడంతో వారు జిల్లాకు ప్రయాణమయ్యారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top