బ్రాందీ అటు.. గుట్కా ఇటు

Brandi And Gutka Smuggling In Passanger Train Karimnagar - Sakshi

ప్యాసింజర్‌ రైలే         ప్రయాణ మార్గం  

కుప్పలు తెప్పలుగా పట్టుబడుతున్న గుట్కా నిల్వలు

రూటు మారిన         బియ్యం దందా  

నివ్వెరపోతున్న టాస్క్‌ఫోర్స్‌  

పెద్దపల్లి: చంద్రాపూర్‌లో బ్రాందీ దొరకడం కష్టం.. అక్కడి ప్రభుత్వం మద్యంపై మూడు జిల్లాల్లో నిషేధం విధించింది. తెలంగాణ ప్రభుత్వం బ్రాందీ వ్యాపారానికి అనుమతించింది. కాని గుట్కాపై మాత్రం సీరియస్‌గా వ్యవహరిస్తోంది. మహారాష్ట్రలో ఎక్కడైనా గుట్కా పాకెట్లు సంచుల కొద్ది అమ్ముకోవచ్చు. ఇక్కడ కఠినం.. అక్కడ సులభతరం.. జిల్లాకు చెందిన కొందరికి ఇదో వ్యాపార సూత్రం. అనువైన చోట వ్యాపారాన్ని చేసుకునేందుకు వీలుగా జిల్లాలోని పెద్దపల్లి, కొత్తపల్లి, రామగుండం రైల్వేస్టేషన్‌ల నుంచి బ్రాందీని రాత్రివేళ వెళ్లే ప్యాసింజర్‌ రైలులో మహారాష్ట్రకు తరలిస్తున్నారు. ఉదయం 6గంటలకు జిల్లాలో ప్రవేశించే ప్యాసింజర్‌ రైలులో గుట్కా సంచులను చాలా సులభంగా తీసుకొస్తున్నారు. గడిచిన నెల రోజుల్లో జిల్లా టాస్క్‌ఫోర్స్‌ పోలీస్‌ యంత్రాంగం పలు చోట్ల దాడులు చేపట్టి, సుమారు రూ. 50లక్షలకు పైగా విలువైన గుట్కా పాకెట్లను పట్టుకున్నా ఇంకా దందా కొనసాగుతుందంటే మహారాష్ట్రలో సులభంగా దొరుకుతున్న సంచులను ఇక్కడికి తరలించడమే ప్రధాన కారణం.

మహిళలే కీలకం..  
మహిళలను సోదా చేయడం ఇబ్బందికరమైన విషయం. అందుకే గుట్కా తరలింపు, బ్రాందీ తరలింపు వ్యవహారాల్లో మహిళలే తమ ఉపాధి మార్గంగా ఈ దందాను ఎంచుకున్నారు. రెండు సూట్‌కేసుల్లో బ్రాందీ బాటిళ్లను తీసుకెళ్లి.. అదే సమయంలో అక్కడ సిద్ధంగా ఉన్న వారి నుంచి గుట్కా పాకెట్లను బ్రీఫ్‌కేసుల్లో ఇక్కడికి తరలిస్తూ స్థానిక వ్యాపారులకు అందిస్తున్నారు. దీంతో మహిళలు చేస్తున్న ఈ దందాపై పోలీసులు పెద్దగా దృష్టి సారించక పోవడం వల్ల వ్యాపారం సజావుగా కొనసాగిస్తున్నారు.

కేరాఫ్‌ ఖానాపూర్‌  
పెద్దపల్లి జిల్లాకు వస్తున్న గుట్కా బ్యాగుల్లో సగానికి పైగా ఆదిలాబాద్‌ జిల్లాలోని ఖానాపూర్‌కు చెందిన ఓ వ్యాపారి ఇక్కడికి సరఫరా చేస్తున్నారు. పెద్దపల్లికి చెందిన పలువురు వ్యాపారులు ఐదారుసార్లు అరెస్టయి జైలుకు వెళ్లినప్పటికి ఇదే దందాను కొనసాగిస్తున్నారంటే వారికి లభిస్తున్న లాభం ఏపాటిదో అర్ధం చేసుకోవచ్చు. జైలు నుంచి విడుదలైన ఓ వ్యాపారి మాట్లాడుతూ అందరి ఖర్చులు పోగా తమకు ఇంకా లాభాసాటిగానే ఈ వ్యాపారం ఉందని, అందుకే అరెస్టులకు కూడా భయపడకుండా వ్యాపారాన్ని కొనసాగిస్తున్నట్లు తెలిపారు. 

కాదేదీ దాపరికానికి చోటు  
గుట్కా బ్యాగులను శనివారం పెద్దపల్లిలో పట్టుకున్న పోలీసులు ఒక్కసారిగా నివ్వెరపోయారు. సుమారు రూ. 3లక్షలకు పైగా గుట్కా బ్యాగులు ఏకంగా సెప్టిక్‌ ట్యాంకులో దాచిపెట్టిన వ్యాపారి ఎత్తుగడను గమనించిన పోలీసులు అతన్ని పట్టుకునేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. గతంలో సదరు వ్యాపారి ఐదారు సార్లు జైలుకెళ్లి తిరిగి వచ్చారు. తిరిగి అతనే ఈ దందా నిర్వహించడం పోలీసులు సైతం జీర్ణించుకోలేక పోయారు. వ్యాపారి బొడ్ల రమేశ్‌పై గతంలో రౌడీషీట్‌ సైతం ఓపెన్‌ చేశారు. అయినా దందా మారకపోవడం ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

పాత నేరస్తులపై నిఘా..  
మహారాష్ట్ర, బీదర్‌ ప్రాంతాల నుంచి గుట్కా దిగుమతి అవుతున్నట్లు సమాచారం ఉంది. పాత నేరస్థులపై నిఘా పెంచుతున్నాం. ఎప్పటికప్పుడు కట్టడి చేసేందుకు అరెస్టుల పరంపర కొనసాగిస్తున్నాం. ఇప్పటివరకు జిల్లాలో పెద్ద ఎత్తున గుట్కా బ్యాగులను పట్టుకున్నాం. కొత్తగా దందాలో ప్రవేశించే వారిపైనా దృష్టి పెడుతున్నాం.  – విజయసారథి,టాస్క్‌ఫోర్స్‌ ఏసీపీ 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top