బ్రెయిన్‌ డెడ్‌ వ్యక్తి అవయవాలు మాయం!

Brain dead person Organs taken by Hospital created sensation in Visakha - Sakshi

బీమా క్లెయిమ్‌ తిరస్కరణతో వెలుగులోకి

మృతుడి భార్య ఫిర్యాదుతో కేసు నమోదు.. విశాఖలో కలకలం

సాక్షి, విశాఖపట్నం: రోడ్డు ప్రమాదంలో బ్రెయిన్‌ డెడ్‌ అయిన వ్యక్తి నుంచి ఓ ప్రముఖ ఆస్పత్రి అవయవాలను సేకరించిన వ్యవహారం విశాఖలో వివాదాస్పదంగా మారుతోంది. ఒడిశాకు చెందిన మృతుడి తల్లిదండ్రులు, బంధువులను మభ్యపెట్టి అవయవాలను తీసుకున్నట్లు అందిన ఫిర్యాదుపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. విశ్వసనీయ సమాచారం మేరకు వివరాలిలా ఉన్నాయి..

డబ్బులు లేవనడంతో..
2016 డిసెంబరు 13న ఒడిశాలోని గంజాం జిల్లా జాగాపూర్‌ గ్రామానికి చెందిన కడియాల సహదేవ్‌ (32) ఇచ్ఛాపురం వద్ద రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. బైక్‌పై వెళ్తూ డివైడర్‌ను ఢీకొట్టి పడిపోవడంతో తలకు బలమైన గాయమైంది. చికిత్స కోసం బాధితుడిని విశాఖలోని ఓ ఆసుపత్రికి బంధువులు తెచ్చారు. ఐదు రోజుల పాటు వైద్యం అందించిన అనంతరం బ్రెయిన్‌ డెడ్‌ అయినట్లు ఆస్పత్రి యాజమాన్యం పేర్కొంది. నిరుపేదలమైన తాము వైద్య చికిత్స వ్యయాన్ని చెల్లించలేమని బాధితుడి తల్లిదండ్రులు, బంధువులు పేర్కొనడంతో అవయవాలు దానం చేస్తే డబ్బులు కట్టకుండా మృతదేహాన్ని తీసుకెళ్లవచ్చని ఆసుపత్రి సిబ్బంది సూచించారు. అనంతరం వారి నుంచి సంతకాలు తీసుకుని బ్రెయిన్‌ డెడ్‌ అయిన సహదేవ్‌ నుంచి కిడ్నీలు, కాలేయం, రెండు కార్నియాలను సేకరించారు.

 అనుమతి తీసుకున్నాకే సర్జరీ చేశాం..
ఈ విషయమై ఆసుపత్రి యాజమాన్యం ప్రతినిధి మోహన్‌ మహరాజ్‌ను వివరణ కోరగా ఈ కేసు ఇప్పటికే కోర్టులో ఉందని, నోటో(నేషనల్‌ ఆర్గాన్‌ టిష్యూ ట్రాన్స్‌ప్లాంటేషన్‌ ఆర్గనైజేషన్‌) యాక్ట్‌ ప్రకారం, జీవన్‌దాన్‌ అనుమతితో అన్ని నియమాలు అనుసరించి ఈ సర్జరీ నిర్వహించినట్లు పేర్కొన్నారు. ‘అన్నిటికీ మృతుడి తల్లిదండ్రుల అనుమతి తీసుకున్నాం. గర్భిణి కావడంతో మృతుడి భార్య రాలేదని చెప్పారు. మృతుడి అవయవాలను జీవన్‌దాన్‌ అలాట్‌మెంట్‌ ప్రకారం వేరే ఆసుపత్రికి తరలించాం. కార్నియాని మోసిన్‌ ఐ బ్యాంక్‌ మృతుడి తల్లిదండ్రుల అంగీకారంతో తీసుకుంది. పోలీస్‌ అనుమతి, ఫోరెన్సిక్‌ ఇంటిమేషన్, పంచనామా, పోస్టుమార్టం అన్నీ జరిగాయి’ అని చెప్పారు.

బీమాకు దరఖాస్తుతో షాక్‌..
ప్రమాదం జరిగిన సమయంలో గర్భిణిగా ఉన్న బాధితుడి భార్య లక్ష్మీయమ్మ ఆసుపత్రికి రాలేదు. భర్త అంత్యక్రియల అనంతరం బీమా క్లెయిమ్‌ కోసం దరఖాస్తు చేయగా తిరస్కరణకు గురైంది. పోస్టుమార్టం నివేదిక ప్రకారం సహదేవ్‌ మృతదేహంలో అవయవాలు లేవని బీమా సంస్థ పేర్కొనడంతో నివ్వెరపోయిన ఆమె జాతీయ మానవహక్కుల కమిషన్‌ను ఆశ్రయించారు. దీనిపై కమిషన్‌ ఆదేశాల మేరకు మూడో పట్టణ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఆసుపత్రి యాజమాన్యంపై ఏపీ ట్రాన్స్‌ప్లాంటేషన్‌ ఆఫ్‌ హ్యూమన్‌ ఆర్గాన్స్‌ యాక్ట్‌ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ కోరాడ రామారావు తెలిపారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top