ప్రేమ పేరుతో ఆడిన నాటకంలో...

Boyfriend Cheated In Mahabubnagar - Sakshi

వనపర్తి రూరల్‌ (మహబూబ్‌నగర్‌): ప్రేమ పేరుతో ఆడిన నాటకంలో ఓ బాలిక ప్రమాదవశాత్తు బావిలో పడి మృత్యువాతపడింది.  స్థానికంగా సంచలనం రేకెత్తించిన ఈ దుర్ఘటన మంగళవారం రాత్రి వనపర్తి జిల్లా కేంద్రంలో చోటుచేసుకుంది. పోలీసులు, బాధితుల కథనం మేరకు.. పట్టణంలోని ప్యాటగడ్డ కాలనీకి చెందిన దంపతులకు ముగ్గురు కూతుళ్లు. తల్లిదండ్రులు కూలీ పనులు చేసుకుంటుండగా ఇద్దరు కూతుళ్లు సరిత, శ్రీలత(17) స్థానికంగా వస్త్ర దుకాణంలో పనిచేస్తూ కుటుంబానికి చేదోడు వాదోడుగా ఉంటున్నారు. అయితే వనపర్తి మండలం మెట్‌పల్లికి చెందిన శ్రీకాంత్‌ శ్రీలతతో, ప్యాటగడ్డకు చెందిన నరేష్‌ సరితతో రెండేళ్లుగా ప్రేమ పేరుతో సన్నిహితంగా ఉంటున్నారు.

ఈ క్రమంలో మంగళవారం రాత్రి 8 గంటల సమయంలో శ్రీకాంత్‌ తన బైక్‌పై శ్రీలత, సరితను ఎక్కించుకుని పట్టణ శివారులోని ఖాసీంనగర్‌ అటవీ ప్రాంతంలోకి తీసుకెళ్లాడు. విషయం తెలుసు కున్న నరేష్‌ తన స్నేహితుడు శేఖర్‌తో కలిసి ద్విచక్రవాహనంపై శ్రీకాంత్‌ వద్దకు వెళ్లాడు. ఈ వి షయం గమనించిన కొందరు ప్యాటగడ్డ యువకులు వారిని అనుసరించారు. ఖాసీంనగర్‌ సమీ పంలోని వ్యవసాయం పొలం వద్ద బైక్‌లు ఉండటాన్ని గమనించిన యువకులు చుట్టుపక్కల వెతికారు. వీరి రాకను గమనించిన శ్రీలత, సరిత, శ్రీకాంత్, నరేష్, శేఖర్‌ పారిపోయారు. ఈ క్రమంలోనే శ్రీలత చీకట్లో ప్రమాదవశాత్తు బావిలో పడిపోయింది. మిగతా వారు పరారయ్యారు. అయితే తన సోదరి కనిపించడం లేదని సరిత ఇంటికి వచ్చి జరిగిన విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పింది.

మృతదేహం వెలికితీత
సమాచారం అందుకున్న వనపర్తి డీఎస్పీ సృజన, సీఐ సూర్యనాయక్, పట్టణ ఎస్‌ఐ నాగశేఖరరెడ్డి, రూరల్‌ ఎస్‌ఐ రాఘవేందర్‌రెడ్డి పోలీస్‌ సిబ్బందితో అక్కడికి చేరుకుని బావిలో గాలించారు. ఈ క్రమంలో వ్యవసాయ బావిలో నుంచి శ్రీలత మృతదేహాన్ని వెలికితీశారు. బుధవారం ఉదయం పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించగా ప్రజా, కుల సంఘాల నాయకులు, కాలనీవాసులు అడ్డుకున్నారు. బాలిక మృతికి కారణమైన యువకులపై చర్యలు తీసుకుని ప్రభుత్వపరంగా ఆదుకోవాలని స్థానికులు వెంకటేష్, వెంకటస్వామి, చంద్రశేఖర్‌ తదితరులు డిమాండ్‌ చేశారు. ఈ విషయమై అనుమానాస్పద మృతిగా కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు రూరల్‌ ఎస్‌ఐ తెలిపారు. అలాగే ముగ్గురు యువకులపై కూడా కేసు నమోదు చేశామన్నారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top