మాంజా పంజా

Boy Died With Manja Thread Cut Throat in Tamil nadu - Sakshi

ఒక్కగానొక్క కుమారుడిని కోల్పోయిన కుటుంబం

బాలుడి మృతితో అధికారుల అప్రమత్తం

గాలి పటాల దుకాణాల్లో తనిఖీలు

ఇద్దరి అరెస్టు ∙కఠిన చర్యలు తప్పవని హెచ్చరిక

ప్రాణాలుపోయాక అధికారుల్లో కదలిక

సాక్షి, చెన్నై : రాజధాని నగరంలో ‘మాంజా’దారం పంజా విసిరింది. ఎక్కడి నుంచో గాలి పటం ద్వారా వచ్చిన ఆ దారం ఓ బాలుడి గొంతు కోసింది. తల్లిదండ్రులతో ఆనందంగా మోటార్‌ సైకిల్‌ మీద వెళ్తున్న మూడేళ్ల ఆ బాలుడు సంఘటనా స్థలంలోనే విగత జీవి అయ్యాడు. కళ్లెదుటే ఒక్కగానొక బిడ్డను మాంజా బలికొనడంతో ఆ తల్లిదండ్రుల వేదన వర్ణణాతీతం. ఇక, ఏదేని ఘటన జరిగినప్పుడే తాము మేల్కొంటామని మరో మారు పోలీసులు, అధికారులు నిరూపించుకున్నారు. గాలి పటాల దుకాణాల్లో తనిఖీలు చేపట్టి ఇద్దర్ని అరెస్టు చేశారు.

గాలి పటాలు ఎగర వేయడం అంటే అందరికీ సరదా. కొన్ని సార్లు ఈ సరదా ప్రాణాలును బలితీసుకుంటోంది. గాజు పెంకులను పొడి చేసి, వాటిని జిగురు(గమ్‌)లో కలిపి, దారానికి పూసి ఎండ బెట్టి మరీ విక్రయిస్తున్నారు. వీటి వల్ల ఆస్పత్రి పాలయ్యే వాళ్లు ఎక్కువే. 2006లో ఈ మాంజా రూపంలో తొలి మరణం చోటు చేసుకోవడం, ఆ తదుపరి క్రమంగా మరణాల సంఖ్య పెరగడంతో వ్యవహారం కోర్టుకు చేరింది. మాంజా దారాలను నిషేధించాల్సిందేని కోర్టు ఆదేశించినా, అమలు పరిచే వారు లేకపోయారు. దీంతో చాప కింద నీరులా మాంజా దారాల విక్రయాలు సాగుతూ వస్తున్నాయి. ఏదేనా సంఘటన జరిగినప్పుడే తాము మేల్కొంటామన్న చందంగా ప్రస్తుతం ఘటన చోటు చేసుకోవడంతో మాంజా దారాల విక్రయదారుల పట్టుకునేందుకు పోలీసు యంత్రాంగం రంగంలోకి దిగింది.

చిన్నారిని మింగిన మాంజా
రాజస్థాన్‌ నుంచి ఉద్యోగ నిమిత్తం చెన్నైకు వచ్చిన గోపాల్‌ కొండితోపులో భార్య సుమిత్ర, కుమారుడు అభినేష్‌(3)తో కలిసి నివాసం ఉంటున్నారు. ఆదివారం సెలవు కావడంతో సాయంత్రం బంధువుల ఇంటికి మోటారు సైకిల్‌ మీద బయలు దేరారు. తల్లిదండ్రులతో ఆనందంగా వెళ్తున్న సమయంలో ఎక్కడి నుంచి వచ్చిందో మాంజా మృత్యు పంజాగా మారింది. కొరుక్కుపేట మీనాంబాల్‌నగర్‌ వంతెన మీద మోటారు సైకిల్‌ పయనిస్తున్న సమయంలో ఎక్కడి నుంచో వచ్చిన మాంజా దారం ఆ బాలుడి గొంతు కోసింది. క్షణాల్లో బాలుడు తూలి పడటంతో తండ్రి గోపాల్‌ అప్రమత్తమైన మోటారు సైకిల్‌ను పక్కగా ఆపేశాడు. ఏమి జరిగిందో అన్నది తెలియని పరిస్థితి. తనయుడి గొంతు తెగి రక్తం దారాల పారడంతో ఆందోళనకు లోనయ్యాడు. అక్కడున్న వాళ్లు సాయంతో, ఆస్పత్రికి తరలించే యత్నం చేయగా, అప్పటికే బాలుడు మరణించాడు. దీంతో ఆ తల్లిదండ్రుల వేదన వర్ణణాతీతం. మూడేళ్ల బాలుడి బలితో మాంజాదారం నిషేధం పోలీసులకు గుర్తుకొచ్చినట్టుంది. ఎక్కడ కోర్టు చేత అక్షింతలు వేయించుకోవాల్సి వస్తుందోనన్న ఆందోళనలో పడ్డ పోలీసులు పరుగులు తీసే పనిలో పడ్డారు.

11 మంది పిల్లల బలి..
2006 నుంచి ఇప్పటి వరకూ మాంజా దారం రూపంలో 11 మంది పిల్లలు బలి అయ్యారు. వీరిలో ఎక్కువ మంది తల్లిదండ్రులతో మోటార్‌ సైకిల్‌ మీద వెళ్లున్నప్పుడు గొంతు కోయబడి మరణించిన వారే. అభినేష్‌ మరణంతో రాజస్థానీయుల్లో ఆగ్రహం రేగింది. అర్థరాత్రి పోలీసు స్టేషన్‌ను ముట్టడించడంతో తొలుత మెతక వైఖరి అనుసరించినా, ఆర్కేనగర్‌ పోలీసులు సోమవారం ఉదయాన్నే మాంజా మీద కొరడా ఝుళిపించే విధంగా దూకుడు పెంచారు. కొరుక్కుపేట కామరాజర్‌ నగర్‌కు చెందిన నాగరాజ్, 15 ఏళ్ల బాలుడ్ని అదుపులోకి తీసుకున్నారు. మాంజాను నిల్వ ఉంచిన ఓ వ్యాపారిని అదుపులోకి తీసుకున్నారు. నగరంతో పాటుగా ఉత్తర చెన్నై పరిధిలోని అన్ని దుకాణాల్లో తనిఖీలు ముమ్మరం చేశారు. ఎవరైనా మంజా విక్రయించినా, వాటితో గాలిపటాలు ఎగరేసినా నాన్‌ బెయిలబుల్‌ కేసులు నమోదు చేయాలనే డిమాండ్‌ తెరపైకి వచ్చింది.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top