ఏం కష్టమొచ్చిందో...!

birth baby found in near pond  - Sakshi

శిశువు మృతదేహంతో కలకలం

గొల్లలములగాం పెద్ద చెరువు సమీపంలో లభ్యం  

ఆ కన్నతల్లికి ఏం కష్టమొచ్చిందో...అప్పుడే జన్మించిన శిశువును చెరువు సమీపంలో ఉన్న తుప్పల్లో విడిచి వెళ్లిపోయింది. అంతలోనే శిశువు ప్రాణం పోయింది. ముక్కుపచ్చలారని ఆ శిశువుకు నిండు నూరేళ్లు తల్లి గర్భం నుంచి వచ్చిన రోజే నిండిపోయాయి.  చూపరులను కంటతడి పెట్టించిన ఈ ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళ్తే...

విజయనగరం, చీపురుపల్లి రూరల్‌: మండలంలోని గొల్లలములగాం గ్రామంలో ఓ శిశువు మృతదేహం చెరువు సమీపంలోని తుప్పల్లో లభ్యమైంది. దీంతో ఆ ప్రాంతంలో కలకలం రేగింది. స్థానికులు అందించిన వివరాలు...గ్రామానికి ఆనుకొని ఉన్న పెద్ద చెరువు సమీప తుప్పల్లో  గురువారం మధ్యాహ్నం రెండు గంటల ప్రాంతంలో  ఓ శిశువు మృతదేహాం నిర్జీవంగా పడి ఉండడాన్ని పాఠశాల విద్యార్థుల కంట పడింది. పాఠశాలలకు గురువారం బంద్‌ కావడంతో చెరువుకు ఆటల కోసం పలువురు విద్యార్థులు వెళ్లారు. విద్యార్థులు ఆడుకునే క్రమంలో బంతి చెరువు ఒడ్డున ఉన్న తుప్పల సమీపానికి వెళ్లడంతో విద్యార్థులు బంతి కోసం అటుగా వెళ్లగా అక్కడ తుప్పల్లో శిశువు మృతదేహాన్ని చూశారు.

ఒక్కసారిగా ఆందోళనకు గురై గ్రామంలోకి పరుగులు తీశారు. చూసిన ఘటనను గ్రామస్తులకు చెప్పారు. గ్రామస్తులు ఘటన స్థలానికి వెళ్లి చూడగా అప్పుడే జన్మించిన మగ శిశువు మృతదేహం తుప్పల్లో పడి ఉండడాన్ని గుర్తించారు. దీంతో గ్రామస్తులు తల్లడిల్లిపోయారు. తమ గ్రామంలో ఎప్పుడూ ఇటువంటి ఘటన ఎదురు కాకపోవడంతో అంతా ఆవేదనకు గురై కంటతడి పెట్టుకున్నారు. ఏ తల్లి బిడ్డో ఇలా తుప్పల పాలైందని కన్నీరుమున్నీరయ్యారు. వేరే గ్రామానికి చెందిన వారెవరో ఇక్కడ ఇలా శిశువును పడేసి ఉంటారని స్థానికులు ఆవేదనగా చెప్పారు. చీపురుపల్లి పోలీస్‌స్టేషన్‌కు సమాచారం అందించారు. అనంతరం శిశువు మృతదేహాన్ని గ్రామస్తులు ఖననం చేశారు. ఇదిలా ఉండగా స్థానిక ఏఎన్‌ఎం గీతారాణి వద్ద ఈ విషయం ప్రస్తావించగా ఇటీవల కాలంలో జన్మించిన చిన్నారులంతా ఆరోగ్యంగా ఉన్నారని, ఒకటి రెండు రోజుల్లో ఎలాంటి జననాలు జరగలేదని వెల్లడించారు.  

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top