ఉద్యోగంలో ఇమడలేకనే..

attender Srikanth suicide reasons is cant Adjusting father job - Sakshi

లేఖలో రాసినట్టు తండ్రి దగ్గరే శ్రీకాంత్‌రెడ్డి సమాధి

కన్నీరుమున్నీరైన తల్లి, సోదరి

చిత్తూరు, బి.కొత్తకోట : తండ్రి మరణంతో డీఈవోలో వచ్చిన అటెండర్‌ ఉద్యోగంలో ఇమడలేకనే డి.శ్రీకాంత్‌రెడ్డి (27) ఆత్మహత్యకు పాల్పడినట్టు స్పష్టమైంది. మృతు ని తల్లి డి.రమాదేవి పోలీసులకిచ్చిన ఫిర్యాదులో ఈ విషయం వెల్లడించారు. దీంతో కేసు నమోదు చేసినట్టు ఇన్‌చార్జ్‌ ఎస్‌ఐ కేవీహెచ్‌ నాయుడు శుక్రవారం తెలిపారు. మృతుడి తల్లి రమాదేవి కథనం మేరకు.. శ్రీకాంత్‌రెడ్డి మిత్రులతో సరదాగా గడిపేవాడు. ఏడాదిన్నర క్రితం టీచరైన తండ్రి వెంకటరెడ్డి మృతిచెందగా శ్రీకాంత్‌రెడ్డికి డీవోఈ కార్యాలయంలో అటెండర్‌ ఉద్యోగం వచ్చింది. ఏడు నెలలుగా విధుల్లో ఉన్నప్పటికీ అందులో ఇమడలేకపోయాడు. తల్లితో ఫోన్లో మాట్లాడినప్పుడు ఇదే విషయం చెప్పేవాడు. కొంతకాలం అలవాటు పడితే అన్నీ సర్దుకుంటాయని తల్లి చెబుతూ వచ్చారు. చివరకు ఆత్మహత్యకు పాల్పడ్డాడు.  

ఎక్కడో పుట్టి ఇక్కడే సమాధి: వైఎస్సార్‌ జిల్లా జమ్మలమడుగు సమీపంలోని పెద్దపసుపులకు చెందిన డి.వెంకటరెడ్డి ఉద్యోగ రీత్యా బి.కొత్తకోట మండలం గుంతావారిపల్లెకు వచ్చారు. ఇక్కడే స్థిర నివాసం ఏర్పరుచుకున్నారు. పీటీఎం మండలంలో పనిచేస్తూ ప్రమాదంలో మృతిచెందారు. ఆయన మృతదేహాన్ని గుంతావారిపల్లె సమీపంలో కొనుగోలు చేసిన భూమి లోనే సమాధి చేశారు. బుధవారం రాత్రి కొడుకు ఉరి వేసుకొని మృతిచెందాడు. ఆత్మహత్య లేఖలో డాడీ దగ్గరే ఉంటానని రాసినట్టుగానే శ్రీకాంత్‌రెడ్డి మృతదేహాన్ని తండ్రి సమాధి ఎదుటే పూడ్చారు.

స్నేహ బంధాన్ని చాటిన మిత్రులు: శ్రీకాంత్‌రెడ్డి మదనపల్లెలో చదివాడు. ఆ సమయంలో ఏర్పడిన మిత్రులు ఇప్పటికీ అలాగే కొనసాగారు. బుధవారం రాత్రి సారీ మా, బైబై వెళ్లిపోతున్నా అంటూ పంపిన వాయిస్‌ రికార్డు విన్నప్పటి నుంచి మిత్రులు అతనితో మాట్లాడేందుకు ఫోన్లో విశ్వప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది. శుక్రవారం అంత్యక్రియలు ముగిసే వరకు సుమారు 40 మంది మిత్రులు వెన్నంటే ఉన్నారు. 

అమ్మా క్షమించు..

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top