
సాక్షి, న్యూఢిల్లీ : ఇండియన్ ఫోర్స్‌కు చెందిన ఓ సీనియర్ అధికారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఓ కీలక రహస్య సమాచారాన్ని తనతో సన్నిహితంగా ఉండే అమ్మాయితో సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారని ఆయనను అరెస్టు చేశారు. సమాచారాన్ని పొందిన ఆ మహిళ ఓ గుఢాచారి అని, సదరు అధికారిని ట్రాప్‌లోకి దింపి మంచితనంగా వ్యవహరించి వలపన్ని ఈ పనిచేసినట్లు తెలిపారు. ఆ అధికారి ఢిల్లీ ఉన్నత కార్యాలయాల్లో ర్యాంక్ స్థాయి అధికారి అని సమాచారం.
ఓ క్లాసిఫైడ్ సమాచారాన్ని అతడు వాట్సాప్, ఫేస్‌బుక్ ద్వారా ఆ మహిళకు పంపించినట్లు ఇంటెలిజెన్స్ విభాగం గుర్తించి అతడిని అదుపులోకి తీసుకున్న ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ సెంట్రల్ సెక్యూరిటీ దర్యాప్తు బృందం ప్రస్తుతం అతడిని విచారిస్తున్నట్లు అధికారులు చెప్పారు. సాయుధ బలగాల్లో సోషల్ మీడియాను ఉపయోగించే విషయంలో తాము కఠిన నిబంధనలు పాటిస్తామని, అధికారులు తమ ర్యాంకులను, హోదాలను కూడా వాటి ద్వారా పంచుకునేందుకు వీలుండదని సమాచారం. వారు ధరించిన దుస్తులతో ఫొటోలు దిగి కూడా ఆ అధికారులు సోషల్ మీడియా ద్వారా పంచుకోకూడదని ఓ సీనియర్ అధికారి చెప్పారు.